పడవలకు పసుపు రంగు | Colour Coding For Fishermen Boats | Sakshi
Sakshi News home page

పడవలకు పసుపు రంగు

Published Sat, Apr 21 2018 9:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

Colour Coding For Fishermen Boats - Sakshi

 నెల్లూరు రూరల్‌: తీరంలో పడవలకు పసుపు రంగు వేసిన మత్య్సకారులు 

నెల్లూరు రూరల్‌ : సముద్రపు దొంగలను గుర్తించేందుకు, జలమార్గంలో వచ్చే తీవ్రవాదులను పసిగట్టేందుకు, గల్లంతవుతున్న మత్స్యకారులను గుర్తించేందుకు, అంతరాష్ట్ర, దేశ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు, సముద్రంలో చేపల వేటకు వచ్చే మత్స్యకారులు ఇతర రాష్ట్రాలు, దేశసరిహద్దులు దాటిపోతుండడం తదతర ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. విదేశీయులు ఎవరైనా మన సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు బోట్లు ఏ దేశానికి సంబంధించినవో, మన దేశపరిధిలో అయితే ఏ రాష్ట్రానికి చెందినవో గుర్తించడానికి వీలుగా తీర రక్షణ దళం ప్రతి తీర రాష్ట్రానికి చెందిన పడవలకు ఒక రంగు కేటాయించింది.

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రంగు కేటాయిస్తూ ఏప్రిల్‌ నెలాఖరు లోపు రంగులు వేయడం పూర్తి చేయాలని ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు పడవలను పరిశీలించి పసుపు, నీలం రంగులు వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. పైభాగానికి పసుపు రంగు, నీటిలో మునిగి ఉన్న భాగానికి ముదురు నీలిరంగు వేయాలి. రంగువేయని పడవలకు రిజిస్ట్రేషన్‌ నిలిపివేయడమే కాకుండా వారికి అందే రాయితీలను నిలిపివేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ముంబై తరహా దాడులు జరగకుండా ఇతర దేశాలకు చెందిన వారు మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు సులువుగా గుర్తించవచ్చని చెబుతున్నారు.  

రంగు వేస్తేనే రాయితీ 
వేట విరామ సమయంలో 61 రోజు లకు రిజిస్ట్రేషన్‌ కలిగి ఉన్న ప్రతి ఇంజ న్‌బోటుపై వేట చేస్తే మత్స్యకారుడి కుటుంబానికి రూ.4 వేలు జీవన భృతి ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది నుంచి ఇంజిన్‌బోటు డీజిల్‌కు లీటరుకు రూ.6 రాయితీ ఇవ్వనున్నారు. పసుపురంగు వేయకపోతే ఇవన్నీ నిలిచిపోనున్నాయి. అలాగే బోట్లకు రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ నిలిపేస్తారు. ఆయా కుటుంబాలకు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిపేయనున్నారు. 

సర్కారు సూచించిన కలర్‌ కోడ్‌
ముత్తుకూరు: రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట సాగించే పడవలకు పైభాగంలో పచ్చరంగు పూయాలని, అడుగు భాగం ముదురునీలం రంగు వేయాలని ఆదేశించగా మత్స్యశాఖ అ« దికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులచే రంగులు కొనుగోలు చేయిం చి, పడవలకు కలర్‌ కోడ్‌ ఇప్పించే పనిలో పడ్డారు. ఇప్పటికే పొరుగున ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పడవలకు కలర్‌ కోడ్‌ ఇచ్చే కార్యక్రమం ఊపందుకొంది. ఒక పడవకు కలర్‌ కోడ్‌ ఇవ్వాలంటే రూ.2,500 ఖర్చవుతోందని అంచనా. జిల్లాలో సుమారు 2,000 ఇంజన్‌ పడవలు ఉన్నాయి. ముత్తుకూరు మండలంలో 383 ఫైబర్‌ బోట్లు, 155 తెప్పలు, 18 మరపడవలు ఉన్నాయి. కాగా జిల్లాలో కలర్‌ కోడ్‌ కార్యక్రమం ఇంకా ఊపందుకోలేదు. 

చిత్రం తీసి ఆన్‌లైన్‌లో ఉంచుతాం 
జిల్లాలో మత్స్యకారులు తమ పడవలకు పసుపు, ముదురు నీలిరంగు వేయాలి. ఇలా చేస్తేనే వారికి రాయితీలు వర్తిస్తాయి. రంగు వేసిన ప్రతి పడవను చిత్రం తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. రంగు వారికే వాటికే రాయితీలు, ఇతర పథకాలు వర్తిస్తాయి.  
  – ఎ.సాల్మన్‌రాజు, జిల్లా మత్స్యశాఖ జేడీ

పడవలకు కలర్‌ కోడ్‌ ఇవ్వాలి 
కలర్‌ కోడ్‌పై మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. పడవలకు రంగులు పూయాలని కోరుతున్నాం. కోస్టుగార్డు అధికారులు తేలిగ్గా గుర్తించేందుకు ప్రభుత్వం ఈ కలర్‌ కోడ్‌ సూచించింది.
–ప్రసాద్, ఎఫ్‌డీఓ, ముత్తుకూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement