fisher mens
-
మూలపేట పోర్టుకు భూమి పూజ.. పోర్టు విశేషాలివే..
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా శ్రీకారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. మూలపేట పోర్టు విశేషాలు – పోర్టు సామర్థ్యం ఏడాదికి 23.5 మిలియన్ టన్నులు – బెర్తుల సంఖ్య 4 – ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి – నౌపడ జంక్షన్ నుంచి పోర్టు దాకా 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం – గొట్టా బ్యారేజ్ నుంచి 50 కి.మీ. పైప్‌లైన్‌తో 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా – పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు సిక్కోలు మత్స్యకారులకు బాసటగా.. 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు పట్టుబడి 13 నెలలు కరాచీలో జైలు జీవితం గడిపిన 20 మంది మత్స్యకారులను గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం విదేశాంగ శాఖతో పలుసార్లు మంతనాలు జరిపి 2020, జనవరి 6న వారిని విడుదల చేయించడంలో సఫలీకృతమైంది. అలాగే కరోనాతో లాక్డౌన్ విధించినప్పుడు గుజరాత్లో చిక్కుకున్న 3,064 మంది శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను రూ.3 కోట్ల ఖర్చుతో 46 బస్సుల ద్వారా ప్రభుత్వం స్వస్థలాలకు చేర్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే సంకల్పంతో రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు త్వరలో నిర్మాణం కానున్న 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ విలసిల్లనుంది. మారనున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే నెలలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లైన్ల రహదారి పూర్తయింది. మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా వచ్చే నెలలోనే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, పాడేరులో వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాల, అనకాపల్లి, విజయనగరం వైద్య కళాశాలల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పార్వతీపురం వైద్య కళాశాల పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏకంగా రూ.700 కోట్లతో వంశధార నీటితో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఇళ్లకు నీరందించే పనులు 95 శాతం పూర్తయ్యాయి. దీన్ని త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దీన్ని పాతపట్నం నియోజకవర్గానికి కూడా విస్తరిస్తూ మరో రూ.265 కోట్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తారు. సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి జూన్‌లో ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద, టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సదుపాయం కల్పించనుంది. కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్ కోల్, కోకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి మూలపేట పోర్టు కేంద్రం కానుంది. అదేవిధంగా ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు, మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి ఇక్కడి నుంచి అవకాశముంటుంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం కూడా లభిస్తుంది. సుమారు రూ.35 కోట్లతో తీరప్రాంత–పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామికీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతోంది. -
పవన్ తీరుపై మత్స్యకారుల మండిపాటు
మునగపాక (అనకాపల్లి జిల్లా) : తాను కులమతాలకు అతీతమని గొప్పలు చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాభిమానంతో వ్యవహరిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తనపై కాపు కులానికి చెందిన యలమంచిలి నియోజకవర్గ నేత సుందరపు విజయకుమార్ దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినా ఇంతవరకు పార్టీ పరంగా ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అదే పార్టీకి చెందిన పూడిమడక మత్స్యకారుడు ఎరిపల్లి కిరణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. కిరణ్‌కుమార్‌కు న్యాయం చేసేంతవరకు పార్టీలకతీతంగా ఆందోళనలు చేసేందుకు మత్స్యకారులు సమాయత్తమవుతున్నారు. అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకార యువకుడు ఎరిపల్లి కిరణ్‌కుమార్ జనసేనలో చురుకైన కార్యకర్త. గత నెల 3న ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితిపై సమీక్షించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగబాబు విశాఖ వచ్చారు. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి సుందరపు విజయకుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పార్టీని భ్రష్టుపట్టించేలా వ్యవహరిస్తున్నాడని కిరణ్‌కుమార్ ఈ సమావేశంలో ఫిర్యాదు చేశాడు. ఇది తట్టుకోలేని విజయకుమార్ తన అనుచరులతో కలిసి అదే రోజు కిరణ్‌కుమార్‌పై దాడిచేశాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న కిరణ్‌ను 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విజయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు కిరణ్ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాక.. గత నెల 23న కుటుంబ సభ్యులతో పవన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని కిరణ్ వివరించాడు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు తీర్మానం తనపై దాడిచేసిన విజయకుమార్‌పై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా పూడిమడకలో 21న మత్స్యకారులు సమావేశమయ్యారు. తంతడి, వాడపాలెం, లోవపాలెం, ముత్యాలమ్మపాలెం, పూడిమడకకు చెందిన పలువురు మత్స్యకారులు సమావేశమయ్యారు. మత్స్యకార యువకుడు కిరణ్‌పై దాడికి పాల్పడ్డ సుందరపు విజయకుమార్‌ను అరెస్టుచేయాలని, పార్టీ నుంచి తొలగించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామంటూ సమావేశంలో తీర్మానించారు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అండగా నిలవడంపట్ల మత్స్యకార కుటుంబాలు మండిపడుతున్నాయి. -
క్షణమొక యుగం.. ఎటుచూసినా నీరే.. బోటు వెళ్లిపోతోంది!
గంగమ్మ తల్లి తన బిడ్డల్ని కాచుకుంది. దారీ తెన్నూ తెలీక నడి సంద్రంలో చిక్కుకున్న వారికి అపాయం రాకుండా కాపు గాసింది. కనుచూపు మేర నీళ్లు, కళ్లల్లో కన్నీళ్లతో బతుకుపై బెంగ పెట్టుకున్న గంగ పుత్రులను క్షేమంగా తీరానికి చేర్చింది. అధికారులు, నాయకులు, కోస్టుగార్డులు సమష్టిగా పనిచేసి వారి ప్రాణాలు కాపాడారు. బెస్త పల్లెల కన్నీరు తుడిచారు. వేటకెళ్లిన వారంతా శుక్రవారం కాశిమీడు తీరానికి చేరుకున్నారు. తమ కోసం పని చేసిన వారికి, ప్రార్థించిన వారికి మనసారా కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి,సోంపేట/కవిటి: తేదీ: జూలై 7.. సమయం: రాత్రి 7 గంటలు ప్రదేశం: చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ చేపల వేటకు సముద్రంలోకి సాగిపోయే పడవల సందడితో కళకళలాడుతోంది. IND-TN-02-MM-106 నంబర్ బోట్ కూడా సోంపేట, కవిటి మండలాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో పాటు మరో ఐదుగురితో కలిసి గంగమ్మకు పూజలు చేసి తీరానికి బైబై చెప్పింది. కోడ సోమేశ్వరరావు రథసారథి. హుషారుగా బోట్‌ను నడిపిస్తున్నాడు. మొత్తం 25 రోజుల ప్రయాణం. ఆహారం, తాగునీరు ఇతర పూర్తి సదుపాయాలతో ఉన్న ఓడ వేట సాగిస్తూ ముందుకు సాగుతోంది. 9 రోజుల పాటు హుషారుగా సాగిన బతుకు పయనంలో జూలై 16 శుక్రవారం అనుకోని ఘటన. ఉన్నట్టుండి నడి సంద్రంలో పడవ ఆగిపోయింది. సముద్రపోటుకు పడవ అదుపు తప్పుతోంది. వలలన్నీ సముద్రంలోనే ఉన్నాయి. బోటులో ఉన్న వారంతా అలర్టయ్యారు. ఇంజిన్‌ను చెక్ చేశారు. పంఖా ఎక్కడో జారిపడిపోయింది. యజమానికి సమాచారం తెలియజేస్తూనే.. ప్రత్యామ్నాయాలకు ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. సాయం కోసం చుట్టూ చూశారు. కనుచూపుమేర ఏమీ కనబడలేదు. సమాచార మార్పిడి కోసం బోట్లో వినియోగించే జీపీఎస్ మూగబోయింది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ‘దేవుడా ఏమిటీ పరిస్థితి..’ అంటూ నిట్టూర్చడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ పన్నెండు మంది వలసజీవులది. పగలంతా ధైర్యంగానే గడిపారు. సాయంత్రమవుతున్న కొద్దీ ఆందోళన పెరిగింది. చుట్టూ నీరు తప్ప ఓడ గానీ.. మనిషి జాడగానీ కానరాలేదు. ‘నీదే భారం తల్లీ..’ అంటూ గంగమ్మ మీద భారం వేశారు. నిమిషాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఎదురుగానే తిండి.. కానీ సహించదు. ఏమైపోతామనే ఆందోళన ముందు దాహం వేయడం మానేసింది. బోటు మాత్రం అదుపు తప్పింది. వాలుగా అండమాన్ వైపుగా వెళ్లిపోతోంది.. హెలికాప్టర్‌తో గాలింపు సమాచారం అందుకున్న బోటు యాజమాని స్థానిక మత్స్యకార నాయకులతో కలిసి విషయాన్ని చెన్నైలోని స్థానిక అధికారులకు వివరించారు. ప్రయత్నాల ఫలితంగా కోస్ట్‌గార్డ్‌ను అలెర్ట్ చేశారు. జూలై 17న రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్ గాలించినా ఫలితం దక్కలేదు. విషయాన్ని పైఅధికారులకు తెలియజేయడంతో హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. బోటు ఆచూకీని అండమాన్ సమీపంలో ఎట్టకేలకు కనిపెట్టారు. సమాచారాన్ని కోస్ట్‌గార్డుకు అందజేశారు. రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు నౌక.. బోట్‌ను చేరుకుని మత్స్యకారులకు ధైర్యం చెప్పింది. బోట్‌ను తీరానికి చేర్చేందుకు పరిసరాల్లోని ఓడల కోసం యత్నించింది. ‘ఎస్కే’ అనే బోటుకు సమాచారం అందించడంతో సాయమందించేందుకు ముందుకొచ్చింది. మొరాయించిన బోటును తాళ్లసాయంతో తీరంవైపునకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. కోస్ట్‌గార్డు నౌక ఈ రెండింటిని అనుసరించింది. 36 గంటల తరువాత ‘విన్నర్’ అనే మరో బోటు రంగంలోకి దిగింది. 36 గంటల ప్రయాణం తరువాత 12 మంది మత్స్యకారులతో కూడిన బోటును శుక్రవారం రాత్రి కాశిమీడు తీరానికి క్షేమంగా చేర్చింది. తమ వారంతా ఒడ్డుకు చేరారని తెలుసుకుని సిక్కోలు మత్స్యకార పల్లెలు ఊపిరి పీల్చుకున్నాయి. మత్స్యకారులు గల్లంతయ్యారని సమాచారం అందినప్పటి నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు, ఇచ్ఛాపురం వైఎస్సార్సీపీ నేత పిరియా సాయిరాజ్ తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి చెన్నై అధికారులతో సంప్రదింపులు జరిపేలా చేశారు. మత్స్యకారులను రక్షించడానికి ప్రభుత్వం చేసిన కృషి ప్రశంసనీయమని మత్స్యశాఖ డైరెక్టర్ మడ్డు రాజారావు అభినందించారు. ధైర్యం కోల్పోలేదు.. జూలై 16 మరిచిపోలేని రోజు. రాత్రంతా జాగారమే. బోటు వాలు వైపుగా వెళ్లిపోతోంది. ఎటు పోతున్నామో మాకే తెలియని పరిస్థితి. అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. హెలికాప్టర్‌ను చూసిన తరువాత ప్రాణం లేచొచ్చింది. కొద్ది గంటల తరువాత కోస్ట్‌గార్డ్ మమ్మల్ని సేవ్ చేసే పనిలో పడింది. కోడ సోమేశ్వరరావు, బోటు డ్రైవర్ భయం వేసింది.. వేట సాగుతోంది. ముందుకు వెళుతున్నాం. ఉన్నట్టుండి పంఖా జారిపడిపోయింది. ఆందోళన చెందాం. దేవుడి మీదే భారం వేశాం. కోస్టుగార్డ్, ఇతర బోట్ల సిబ్బంది సాయంతో ఒడ్డుకు చేరాను. ఒకనొక దశలో చాలా భయం వేసింది. కోడ జగన్నాథం, మత్స్యకారుడు -
సముద్రంలో సజీవంగా..
-
రెండేళ్ల క్రితం తప్పిపోయి.. సముద్రంలో సజీవంగా
బొగోటా: కొలంబియాలో వింత సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ సముద్రంలో సజీవంగా కనిపించిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొలంబియా సముద్ర తీరంలో నీటిపై తేలుతున్న సదరు మహిళను బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మత్స్యకారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పేరు ఎంజెలికా గైటన్. ఆమె రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు వెల్లడించింది. గైటన్ ఆర్సీఎన్ రేడియోతో మాట్లాడుతూ... తాను మళ్లీ పుట్టానని, దేవుడు తన మరణాన్ని కోరుకోలేదంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె దాదాపు ఎనిమిది గంటల పాటు నీటిపైనే తేలుతూ ఉన్నట్లు చెప్పింది. (చదవండి: 'ఒక్క పనితో మా మనసులు దోచేసింది') ‘20 సంవత్సరాలుగా నా భర్త చేతిలో గృహహింసకు గురయ్యాను. నా భర్త ఎప్పుడూ నన్ను చిత్రహింసలకు గురిచేసేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. నాకు ఇద్దరు పిల్లలు. వారు చిన్న పిల్లలు కావడంతో అతని నుంచి విడిపోలేక హింసలను భరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. పోలీసులు ఒక్కరోజు అతడిని జైలులో ఉంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించే వారు. అయినా అతడు మారలేదు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మరింత కొట్టేవాడు. ఈ క్రమంలో 2018లో నా భర్త నన్ను చంపాలని చుశాడు. నన్ను నేను కాపాడుకునేందుకు ఇంటి నుంచి పారిపాయాను. నాకు ఆశ్రయం లేకపోవడంలో 6 నెలలు వీధుల్లోనే గడిపాను ఆ తర్వాత నాకు కామినో డిఫే రెస్క్యూ సెంటర్లో ఆశ్రయం దొరికింది’ అని చెప్పింది. (చదవండి: ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత) అయితే అక్కడ ఉండటానికి గడువు పూర్తి కావడంతో నిరాశ్రయురాలిని అయ్యానని, దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కొలంబియా సముద్రంలో దూకినట్లు పేర్కొంది. సముద్రంలో దూకిన ఆనంతరం స్పృహ కోల్పోయానని ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని పేర్కొంది. తనను రక్షించిన వ్యక్తులు నీటిలో అసస్మారక స్థితిలో ఉన్నానని చెప్పినట్లు గైటాన్ వివరిచింది. ఇక ఆమెను రక్షించిన మత్స్యకారులు మాట్లాడుతూ.. మేము తీరంలో చేపల వేటకు వెళుతుండగా దూరంగా ఆమె నీటిలో తెలుతూ కనిపించిందన్నారు. అది ఎంటన్నది తమకు స్పష్టంగా కనిపించకపోవడంతో చెక్క అయి ఉంటుందనుకున్నామన్నారు. కాసేపటకి ఆమె రక్షించాలంటూ చేయి పైకిత్తడంతో ఏంటో చూడటానికి దగ్గరికి వెళ్లామని, అక్కడికి వెళ్లి చూడగా గైటాన్ అపస్మారక స్థితిలో కనిపించిందని వారు చెప్పారు. (చదవండి: ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి) -
మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు సంవత్సరాల క్రితం అమీన్ పూర్ మండలం గండిగూడెం చెరువులో వ్యర్ధ జలాల మూలంగా భారీగా చేపలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ నేరుగా జోక్యం చేసుకుని పరిశ్రమలకు భారీ జరిమానా విధించడంతో పాటు వ్యర్థ జలాలు వదులుతున్న 14 పరిశ్రమలను మూసివేసింది. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో చెరువులు కలుషితం కావనే భరోసా మత్స్యకారుల్లో కలిగింది. అయినా పరిశ్రమల తీరు మారక పోవడంతో సమస్య ప్రతియేటా పునరావృతం అవుతూనే ఉంది. ఇదే సమయంలో జిన్నారం రాయని చెరువులో కాలుష్యం మూలంగా భారీగా చేపలు మృతి చెందాయి. గండి గూడెం చెరువు బాధితులకు జరిగిన న్యాయమే తమకు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ ఆ సమస్యను కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) అధికారులు గాలికొదిలేశారు. ఆ సమయంలో సoబంధిత పరిశ్రమలపై కేసులు నమోదైనా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనిని అలుసుగా భావించిన పలు పరిశ్రమలు ఏటా ఇదే తంతును కొనసాగిస్తూ వర్షపునీటిలో కాలుష్య జలాలు విడుదల చేస్తుండడంతో చేపలు చనిపోవడం పరిపాటిగా మారుతుంది. తాజాగా పరిశ్రమలు కలుషిత జలాలు విడుదల చేయడంతో జిన్నారం మండలం కిష్టయ్య పల్లి మల్లం చెరువు గడ్డపోతారం అయ్యమ్మ చెరువులో చేపలు చనిపోయాయని మత్స్యకారులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం రసాయన పరిశ్రమలు వ్యర్ధ జలాలను ఒక్క చుక్క కూడా బయటకు వదలకూడదు. ఇందుకు సంబంధించిన అనుమతులు జారీ చేసే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు అంగీకార పత్రాన్ని కాలుష్యం నియంత్రణ మండలికి ఇస్తాయి. అయినా తప్పు జరిగితే జరిమానాలు కడితే సరిపోతుంది కదా అన్న ధోరణితో పరిశ్రమలు కాలుష్య జలాలు విడుదల చేస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల అవినీతి సమస్యను పెంచిపోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య జలాల కారణంగా చేపలు సరిగా ఎదగని పరిస్థితితో పాటు చేపలు ఎప్పుడు మృత్యువాత పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్ల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ విభాగాలు కొన్ని కాలుష్యం కారకులకే వంత పాడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాలుష్యం బారిన పడే చెరువులకు చేప పిల్లలు ఇవ్వమని చెబుతున్న మత్స్యశాఖ తీరును గతంలో మత్స్యకారులు ఎండగట్టారు. కాలుష్య నియంత్రణ మండలి కొన్ని చెరువుల వివరాలు వెల్లడించిందని అందులో పేర్లు లేకుంటేనే చేప పిల్లలు ఇస్తామన్న రీతిలో మత్స్యశాఖ వ్యవహరించింది. నిజానికి ఇక్కడ తప్పు చేస్తున్నది రసాయన పరిశ్రమలు, కాలుష్యాన్ని నియంత్రించకుంటే సంబంధిత పరిశ్రమలను మూసివేయాలి కానీ ఇక్కడ తప్పు చేస్తున్న పరిశ్రమలను వదిలేసి చెరువులకు చేపలు ఇవ్వటం మానేస్తున్నారని మత్సకారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పరిశ్రమలు, అధికారుల తీరు మారాలని మత్సకారులు కోరుతున్నారు. కాలుష్య జలాల కారణంగా చేపలు మృత్యువాత పడ్డ సమయాల్లో సంబంధిత అధికారులు విచారణ, తనిఖీలు అంటూ హడావిడి చేసి అనంతరం సమస్యను మరుగున పడవేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారుల చిత్తశుద్ధితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. -
చేపల వలకు చిక్కి.. జీవచ్ఛవాలుగా మారి..
చింతలమానెపల్లి (సిర్పూర్): ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదం మిగిల్చింది. శనివారం గల్లంతైన బీట్ అధికారులు మంజం బాలకృష్ణ ((31), బదావత్ సురేష్ నాయక్ (35)ల మృతదేహాలు సోమవారం లభ్యమ య్యాయి. చేపల వలకు చిక్కి జీవచ్ఛవాలుగా కనిపించాయి. ఉదయం నుంచే చింతలమానెపల్లి, మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్లకు ఘటనా స్థలానికి కొద్ది దూరంలో నదిలో చేపల వేటకు ఏర్పాటు చేసిన వలలో మృతదేహాలు చిక్కుకుని కనిపించాయి. ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీం ఇన్స్పెక్టర్ పవన్ ఆధ్వర్యంలో మృతదేహాలను బయటకు తీశారు. కాగా, ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందడం పట్ల అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
శిశిరం వచ్చిన వేళ ఆకురాలిన చెట్టు.. మోడువారిపోయిన జీవితానికి ఉపమానంలా కనిపిస్తుంది. రుతువు మళ్లగానే అదే చెట్టు కొత్తాకులు తొడిగి.. సరికొత్త మెరుపులను అద్దుకుంటుంది. జీఎస్పీసీ నిర్వాసిత మత్స్యకారుల పరిస్థితి కూడా అటువంటిదే. జీఎస్పీసీ కార్యకలాపాల కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారు.. తమకు న్యాయంగా రావాల్సిన రూ.80 కోట్ల పరిహారం కోసం నాటి ‘పచ్చ’ పాలకుల చుట్టూ.. ఆ పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అధికార మదం తలకెక్కిన నాటి టీడీపీ నాయకులు వారిని పూచికపుల్లల కంటే హీనంగా చూశారు. ఆ రోజుల్లో వారి దీనావస్థను చూసి చలించిన నాటి విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారి సమస్య పరిష్కారానికి మాట ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అణాపైసలతో సహా పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి.. జీఎస్పీసీ బాధిత మత్స్యకారులకు ఈ నెల 21న పరిహారం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. మోడువారిన తమ జీవితాల్లోకి నవవసంతం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని మత్స్యకారులు ఆనందంగా చెబుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: చేయాలనే తపన, చేసే పనిపై చిత్తశుద్ధి ఉండాలే కానీ ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన మత్స్యకారుల సమస్యకు జగన్మోహన్రెడ్డి క్షణాల్లో పరిష్కారం చూపారు. తాళ్ళరేవు మండలం మల్లవరంలోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ) చమురు, సహజవాయువు అన్వేషణకు సముద్రంలో డ్రిల్లింగ్ ఆరంభించిన నేపథ్యంలో.. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని 16,654 మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారికి రూ.80 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. దానికోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ మత్స్యకార నాయకులు పలుమార్లు ప్రదక్షిణలు చేశారు. అయినప్పటికీ వారిని కనీసంగా కూడా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన నాటి మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వద్దకు నాలుగున్నరేళ్ల పాటు కాళ్లరిగేలా తిరిగి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. మత్స్యకారుల బాధను వారు కనీస మానవత్వంతో కూడా చూడలేదు. టీడీపీ హయాంలో ఇక ఆ పరిహారం రాదనే మత్స్యకారులు నిర్ధారించుకున్నారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏతో అంటకాగారు. అయినప్పటికీ ఇన్ని వేల మంది మత్స్యకారులకు సంబంధించిన పరిహారం సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలనే స్పృహ ఏనాడూ ఆయనకు కానీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కలగలేదు. తమ సమస్యను పరిష్కరించాలని గాడిమొగలో జీఎస్పీసీ గేటు వద్ద మత్స్యకారులు 103 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. సుమారు 5 వేల బోట్లపై వేలాది మంది మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో చమురు సంస్థల పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిపై నాటి చంద్రబాబు సర్కార్ ఏమాత్రం సానుభూతి చూపలేదు. రోజులు గడిచాయి. సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. టీడీపీ నేతల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహంతో ఉన్న మెజారిటీ మత్స్యకారులు ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. ముమ్మిడివరంలో చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థి బుచ్చిరాజును సాగనంపారు. ఆ ఎన్నికల సందర్భంగా ముమ్మిడివరంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. మత్స్యకారుల తరఫున నాటి వైఎస్సార్ సీపీ అభ్యర్థి, నేటి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ జీఎస్పీసీ పరిహారం సమస్యను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కరిస్తానని నాడు ఆయన మాట ఇచ్చారు. వాస్తవానికి జీఎస్పీసీ ద్వారా పరిహారం అందించాల్సి ఉండగా ఆ సంస్థ తన ప్లాంట్‌ను ఓఎన్జీసీకి బదలాయించేసింది. పరిహారం ఇవ్వడానికి ఓఎన్జీసీ ముందుకు రాకున్నా తమ ప్రభుత్వమే అణాపైసలతో సహా బాధిత కుటుంబాలకు అందజేస్తుందని ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబులా మత్స్యకారులను జగన్ పదేపదే తన చుట్టూ తిప్పుకోలేదు. ఈ సమస్యపై ఎమ్మెల్యే పొన్నాడ సతీ‹Ùకుమార్‌తో మాట్లాడారు. నాడు ముమ్మిడివరంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.80 కోట్లు ఇవ్వడానికి ఇటీవల మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా మొత్తం పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ రోజు పరిహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన విధి విధానాలపై చర్చించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ సోమవారం జిల్లాకు రానున్నారు. సీఎం చొరవతో స్పందించిన ఓఎన్జీసీ ఈ ఏర్పాట్లు ఇలా జరుగుతూండగా, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. వచ్చీ రాగానే తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జీఎస్పీసీ నిర్వాసిత మత్స్యకారుల పరిహారం అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. పరిహారంగా ఇవ్వాల్సిన రూ.80 కోట్లూ ఓఎన్జీసీ చెల్లించేవిధంగా కేంద్ర మంత్రిని ఒప్పించారు. వాస్తవానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో వైఎస్సార్ సీపీకి ఎటువంటి పొత్తులు, సర్దుబాటులు లేవు. కానీ బలహీన వర్గాలకు చెందిన 16 వేల మంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు, గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సీఎం గట్టి పట్టుదలతో కేంద్ర మంత్రి ద్వారా ఓఎన్జీసీ నిధులు రాబట్టడంలో విజయం సాధించారు. జగన్ మాదిరిగానే చంద్రబాబు చిన్న ప్రయత్నం చేసి ఉంటే ఈ పరిహారం ఏనాడో తమ చేతికి వచ్చేదని బాధిత మత్స్యకారులు అంటున్నారు. సీఎం జగన్ వల్లే పరిహారం వచ్చింది నష్ట పరిహారం కింద జీఎస్పీసీ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే వచ్చాయి. గత ఐదేళ్లలో ఎన్నిసార్లు వేడుకొన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు. కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు ఇస్తానని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడి నిధులు విడుదల చేయించడం అభినందనీయం. – వైదాడి ధర్మారావు, మత్స్యకార నాయకుడు, తాళ్లరేవు చమురు సంస్థల మెడలు వంచారు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా చమురు సంస్థలు పరిహారం ఇవ్వలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి వాటి మెడలు వంచి డబ్బులు వచ్చేలా చేశారు. మత్స్యకారులకు జీఎస్పీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంపై కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ మాట్లాడి, పరిహారం ఇచ్చేవిధంగా కృషి చేశారు. సీఎం కారణంగానే మాకు డబ్బులు వస్తున్నాయి. మత్స్యకారులు జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటారు. – కొక్కిలిగడ్డ లోకేష్, మత్స్యకార నాయకుడు, గాడిమొగ మాట నిలబెట్టుకున్నారు సముద్ర అలల తాకిడి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి, ఐదేళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న మాకు పాదయాత్రలో జగన్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఓఎన్జీసీపై ఒత్తిడి తీసుకువచ్చి పరిహారం ఇప్పించేవిధంగా కృషి చేశారు. చాలా సంతోషంగా ఉంది. – దాసరి కాసుబాబు, మత్స్యకారుడు, పోర గ్రామం రుణపడి ఉంటాం గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన మత్స్యకారులను సీఎం జగన్మోహన్రెడ్డి అన్నివిధాలా ఆదుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రావనుకుని వదిలేసిన జీఎస్పీసీ నిధులను జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాబట్టి, మాకు ఇప్పిస్తున్నారు. మత్స్యకారుల పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి ఔదార్యం మరువలేనిది. ఆయనకు మత్స్యకారులు జీవితాంతం రుణపడి ఉంటాం. – మల్లాడి ఆదినారాయణ, మత్స్యకారుడు, బలుసుతిప్ప -
మరింత కాలం పాక్ చెరలోనే..
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం) : పాక్ చెరలో బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారుల విడుదలకు మరింత కాలం వేచి చూడక తప్పదమో అనిపిస్తోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల భారత ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన చట్టం చేసిన నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఇప్పటికే భారత్ నుంచి రైళ్ల సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసింది. దౌత్య, వాణిజ్య సంబంధాలు తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో తెలియని తప్పుకు పాక్ జైల్లో ఖైదీలుగా మగ్గుతున్న మన మత్స్యకారుల విడుదల సమస్య జఠిలమైంది. కళ్లనే వత్తులుగా చేసుకుని.. భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న ప్రతిసారీ బాధిత మత్స్యకార కుటుంబాల గుండెల్లో అలజడి రేగుతోంది. తమవారు విడుదలయ్యే వరకూ వీరి మనసు కుదురుగా ఉండటం లేదు. నిద్రాహారాలు మానుకుని, కళ్లనే వత్తులుగా చేసుకుని దీనంగా ఎదురు చూస్తున్నారు. తమ వేదనను పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. విదేశాంగ శాఖ దృష్టికి సైతం ప్రభుత్వం తీసుకెళ్లింది. తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్న మత్స్యకారులను విడుదల చేయడం సమస్య కాదు. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు చిక్కితే సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. దర్యాప్తులో తప్పు లేదని తేలాక విడిచి పెడుతున్నారు. పాక్‌కు చిక్కితే మాత్రం తెలియకుండా చేసిన నేరమైనా ఏళ్ల సమయం పడుతుంది. ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి సమస్య తీసుకెళ్తున్న మత్స్యకారులు (ఫైల్) 10 నెలలుగా బందీలోనే... రాష్ట్రం నుంచి బతుకు దెరువు కోసం గుజరాత్ రాష్ట్రం వీరావల్ వెళ్లిన జిల్లా మత్స్యకారులతోపాటు విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల మత్స్యకారులు అక్కడ సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో పాకిస్థాన్ సముద్ర తీర గస్తీ రక్షణ విభాగానికి చిక్కారు. గతేడాది నవంబర్ 27న సముద్రంలో భారత్ ప్రాదేశిక సరిహద్దు తీరం దాటి పొరపాటున వెళ్లటంతో పట్టుబడ్డారు. మూడు బోట్లు పాక్ భద్రతా దళాలకు చిక్కుకున్నాయి. రెండో బోట్లుతో ఏడుగురు చొప్పున 14 మంది, మూడో బోటులో ఆరుగురు చిక్కుకున్నారు. మొత్తం 22 మందిలో మన జిల్లాకు చెందిన మత్స్యకారులు 15 మంది ఉన్నారు. వీరంతా ఒకే గదిలో ఖైదీ లుగా పాక్ ఉన్నట్లు గతంలో బాధిత కుటుంబ సభ్యులకు లేఖ అందింది. ఇప్పటికీ 10 నెలలు గడుస్తున్నా విడుదలలో పురోగతి లేదు. పాక్ చెరలో ఉన్నది వీరే... పాక్ చెరలో గనగళ్ల రామారావు, సురాడ కిశోర్, మైపల్లి సన్యాసి, మైలపల్లి రాంబాబు, కేశంరాజు, చీకటి గురుమూర్తి, సుమంత్, బర్రి బవిరోడు, కేశం ఎర్రయ్య, బడి అప్పన్న, నక్క అప్పన్న, నక్క నర్సింగ్, నక్క ధనరాజ్, వానుపల్లి శామ్యూల్, మైలపల్లి గురువులు, సూరాడ అప్పారావు, సూరాడ కల్యాణ్, కోనాడ వెంకటేష్, గండు సూర్యనారాయణ, పెంట మణి, బిమ్మాలి నారాయణరావు, సత్యం ఉన్నారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీరు విడుదల అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయినా నిరాశే మిగిలింది. తరచూ భారత్, పాక్ స్నేహ సంబంధాలు దెబ్బతినటం వల్ల విడుదలలో జాప్యం తప్పటం లేదు. అధికంగా ఎచ్చెర్ల మండల వాసులే... పాక్ చెరలో 22 మంది మత్స్యకారుల్లో జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. వీరిలో ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, బడివానిపేట పంచాయతీలకు చెందిన 14 మంది, ఒకరు శ్రీకాకుళం నగరానికి చెందినవారు ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి అప్పారావు, కిశోర్, కల్యాణ్, మరో కుటుంబం నుంచి సన్యాసి, రాంబాబు జైలు జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో వీరి కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీరు తప్పు లేదని నిరూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరు దేశాల సంబంధాలు క్షీణించడంతో అమాయక మత్స్యకారుల విడుదల సమస్య జఠిలమైంది. ఈ పరిస్థితుల్లో వీరు విడుదలకు మరికొంత కాలం పట్టనున్నట్లు తెలుస్తోంది. -
మత్స్యసిరి.. అలరారుతోంది
సాక్షి, నరసాపురం: నరసాపురం తీరం నెలరోజులుగా మత్స్యసిరితో అలరారుతోంది. రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతోంది. నిషేధం అనంతరం వేట ప్రారంభించిన మత్స్యకారుల పంట పండుతోంది. బోట్లు మత్స్యసిరితో నిండిపోతున్నాయి. సాదారణంగా వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లిన బోటు చేపలతో నిండడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. అయితే కొన్ని రోజులుగా ఇలా వేటకు వెళ్లినబోటు అలా నాలుగైదు రోజుల్లోనే తీరానికి చేరుకుంటోందని మత్ప్యకారులు చెబుతున్నారు. గత నెలరోజుల్లోనే తీరంలో దాదాపు రూ.300 కోట్ల విలువచేసే మత్స్యసంపద దొరికినట్టు అంచనా. గత ఏడాది కూడా జూన్, జూలై నెలల్లో పెద్ద ఎత్తున చేపలు దొరికాయి. కానీ గత ఏడాదికి మించి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎలాంటి విపత్తులూ లేకుండా ప్రకృతి కూడా కరుణించడంతో ముమర్మంగా వేటసాగుతోంది. ప్రస్తుతం తీరంలో వందల సంఖ్యలో మెకనైజ్డ్బోట్లు, ఫైబర్‌బోట్లు వేటసాగిస్తున్నాయి. మరెక్కడాలేని విధంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ తీరంతో సహా మరెక్కడా లేని విధంగా నరసాపురం తీరంలోనే అపార మత్స్య సంపద లభిస్తోంది. దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా నరసాపురం తీరానికి బోట్లు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల వరదనీరు సముద్రంలో కలుస్తుండడంతో నీటిపోటుకు మత్స్యసంపద పైకితేలుతోందని, అందుకే భారీగా వలలకు దొరకుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇదికాక ఎగువప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా, నరసాపురం తీరంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల సముద్రగర్భం ఇబ్బందికరంగా మారడంతో జలచరాలు పైకితేలడం వల్లే సులువుగా వలలకు చిక్కుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 30 రోజుల్లో రూ 300 కోట్లపైనే వ్యాపారం కేంద్ర ప్రభుత్వం సముద్రంలో ఏటా 61 రోజులపాటు వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇటీవలే జూన్ 15వ తేదీతో వేట నిషేధ కాలం ముగిసింది. వేట నిషేధం గడువు ముగిసి నెల దాటింది. నరసాపురం తీరంలో ఈ నెల రోజుల్లో రూ.300 కోట్ల విలువైన మత్స్య సంపద లభించినట్టు సమాచారం. సందువా, సొర, మాగ, పండుగొప్ప రకాల చేపలు, గుడ్డు పీతలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక టైగర్ రకానికి చెందిన రొయ్యలూ దొరుకుతున్నాయి. ఈ రొయ్యిలను సీడ్ ఉత్పత్తి నిమిత్తం ముంబయ్, పూణెల్లోని పరిశోధనా కేంద్రాలకు పంపుతారు. దీంతో ఎగుమతిదారులు ఇటు నరసాపురం అటు అంతర్వేది రేవులకు చేరుకుని మత్స్యసంపదను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇతర జిల్లాల బోట్లూ హల్చల్ నరసాపురం తీరంలో నిత్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరకడంతో ఇతర జిల్లాల నుంచి కూడా బోట్లు తరలి వస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలకు చెందిన బోట్లు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుని వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ తీరంలో 150 నుంచి 200 వరకూ బోట్లు వేట సాగిస్తున్నాయి. ఎగుమతులు పెరిగాయి మత్స్య ఎగుమతులు భారీగా పెరిగాయి. నెలరోజుల నుంచి నరసాపురం తీరంలో రూ.వందల కోట్లలో ఎగుమతులు జరుగుతున్నాయి. గత ఏడాది కూడా ఈ సీజన్లో పరిస్థితి ఇలాగే ఉంది. కాకపోతే గత సంవత్సరం కంటే రికార్డు స్థాయిలో దిగుబడి పెరిగింది. సందువా, సొర లాంటి రకాల ఎగుమతులు పెరిగాయి. – మేకల సతీష్, ఆక్వా వ్యాపారి ఇతర జిల్లాల బోట్లు వస్తున్నాయి నరసాపురం తీరంలో ముమ్మరంగా వేట సాగుతోంది. ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బోట్లు వస్తున్నాయి. ఇబ్బంది లేకుండా అన్ని బోట్లుకు చేపలు పడుతున్నాయి. సాధారణంగా జూలైలో తుపాన్ల ప్రమాదం ఉంటుంది. వేట సవ్యంగా సాగదు. ఆ ఇబ్బంది కూడా ఈ సారి లేకపోవడంతో వేట లాభసాటిగా మారింది. – పీతల ప్రసాద్, బోటు యజమాని -
ఆకలి..‘ అల’మట
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : సుముద్రంలో వేట నిషేధం గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. 61 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం గంగపుత్రులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సముద్రంలోకి అడుగుపెట్టనున్నారు. చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సముద్రంలో వేట నిషేధం అమలవుతూ ఉంటుంది. రెండు నెలలుగా ఖాళీగా ఉన్న మత్స్యకారులు ఆకలితో అలమటించారు. మళ్లీ వేటకు సిద్ధమవుతున్నారు. బోట్లను సముద్రంలోకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వలలు, ఇతర వేట సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సవ్యంగా వేట సాగాలని గంగమ్మ తల్లిని మొక్కుకుంటూ వేటకు సన్నద్ధమవుతున్నారు. బంగాళాఖాతానికి దగ్గరగా ఉండే నరసాపురం తీరంలో మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 100 వరకూ బోట్లు రోజూ వేట సాగిస్తాయి. వేట నిషేధ సమయం ముగియడంతో బోట్లు ఒక్కొక్కటీ చేరుకుంటున్నాయి. గతేడాది కష్టాల వేట నిజానికి గత ఏడాది వేటకు ప్రకృతి సహకరించింది. తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు పెద్దగా చుట్టుముట్టలేదు. అయినా వేట సవ్యంగా సాగలేదు. మత్స్యసంపద ఎక్కువగా దొరికే జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా పెద్దగా మత్స్య సంపద లభ్యంకాకపోవడంతో జాలర్లు దిగాలు పడ్డారు. అంతకు ముందు రెండు సంవత్సరాలు 2017, 2018లలో ప్రకృతి విపత్తులు ఎక్కువగా రావడంతో మత్స్యకారులకు వేట విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. అందని వేట నిషేధ సాయం నరసాపురం తీరంలో వేట నిషేధ సాయాన్ని గతపాలకులు అరకొరగా అందించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేట నిషేధ కాలంలో 2017లో కేవలం 104 మందికి సాయం అందించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం 2018లో 173 మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ. 4వేలు చొప్పున అందించింది. ఈ ఏడాది 375 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే వేట నిషేధ సమయం ముగిసినా ఇంకా లబ్ధిదారులకు సొమ్ము చెల్లించలేదు. ఎన్నికల సమయం కావడంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.నిజానికి 19 కిలో మీటర్ల మేర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దాదాపుగా 2వేల మంది వరకూ పూర్తిగా వేటనే నమ్ముకుని బతుకుతున్నారు. వారిలో పెద్దబోట్లపై పనిచేసేవారి సంఖ్య 700 వరకూ ఉంటుంది. కేవలం 375 మందిని ఎంపికచేసి మత్స్యశాఖ చేతులు దులుపుకోవడంపైనా మత్స్యకార సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పైనే ఆశలు అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయనపైనే గంగపుత్రులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తారా? వచ్చే ఏడాది నుంచి ఇస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ కలిసొస్తే బాగుండు వేట లేకపోవడంతో రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు వేటకు వెళుతున్నాం. మంచి సీజన్. చేపలు ఎక్కువగా పడతాయి. ఈ ఏడాది బాగుంటుందని అనుకుంటున్నాం. తుపాన్లు పట్టకపోతే నాలుగు డబ్బులు వస్తాయి. దేవుడిపై భారం వేసి వేటకు వెళుతున్నాం. అంతా మంచే జరుగుతుందని ఆశ. – మైలా శ్రీనివాస్, బోటు కార్మికుడు, పెదమైనవానిలంక సొమ్ము త్వరలో జమ ఈ ఏడాది రూ.4 వేలు సాయం 375 మందికి ఇస్తున్నాం. గత ఏడాది 173 మందికే ఆర్థిక సాయం అందించాం. ఈ ఏడాది బోట్ల సంఖ్య పెరగడంతో లబ్ధిదారులు పెరిగారు. పెద్దబోట్లపై పని చేసే వారికే రూ.4 వేల సాయం అందుతుంది. సాయం రూ.4వేలు ఇస్తారా? రూ.10 వేలు పెంచి ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లబ్ధిదారుల వివరాలు ఉన్నతాధికారులకు పంపించాం. – కె.రమణకుమార్, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
స‘పోర్టు’ పేరిట దగా...
సాక్షి, శ్రీకాకుళం : సువిశాల భావనపాడు తీరంలో చేపల వేట సాగిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్న మత్స్యకారులు, పుడమితల్లినే నమ్ముకుని బతుకుతున్న రైతుల్లో పోర్టు పేరుతో టీడీపీ ప్రభుత్వం వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు నాడు ఒక్క ఇటుక కూడా కదలదని చెప్పి తరువాత జరిగిన ‘జన్మభూమి మాఊరు’ కార్యక్రమంలో గ్రామాన్నే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడంతో మంత్రి ద్వంద్వ వైఖరిపై మత్స్యకారులు, రైతులు మండిపడుతున్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి 2015వ సంవత్సరంలో సుమారు 4800 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా మండలంలోని భావనపాడు, మర్రిపాడు పంచాయతీలు, వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునల్తాడ, కొత్తపేట, సైనూరు పంచాయతీల్లో భూములు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది మత్స్యకారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం కొంతకాలం మౌనంగా ఉండి చాప కింద నీరులా నయానో భయానో సొంత పార్టీ నేతలకు పరిహారం ఆశ చూపి తమకు అనుకూలంగా మలుచుకుంది. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి నాలుగేళ్లు కావస్తుండడంతో ఈ ప్రాంత రైతులు వారి భూములపై హక్కులు కోల్పోయారు. భూములపై క్రయవిక్రయాలు చేసుకునేందుకు వారికి అవకాశం లేకుండా పోయింది. దీని వల్ల ఇళ్లలో శుభకార్యాలు, విద్య, ఉద్యోగావసరాల కోసం భూములను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ‘జన్మభూమి మాఊరు’ కార్యక్రమంలో ఎకరాకు రూ.12 లక్షల 50 వేలు మాత్రమే ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అప్పటి ఆర్డీవో వెంకటేశ్వరరావు మంత్రి అచ్చెన్నాయుడు సాక్షిగా చెప్పడంతో రైతుల్లో ఆందోళన తీవ్రమైంది. బయట మార్కెట్లో ఎకరా భూమి ధర రూ.20లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతుంటే ఇలాగేనా పరిహారం చెల్లింపు అంటూ సభలో రైతులు నిరసన తెలియజేశారు. యువతకు ప్యాకేజీ అంటూ మభ్యపెట్టి కాలయాపన చేసి మాయచేశారు. ఒకప్పుడు ఒక్క ఇటుక కూడా గ్రామం నుంచి కదలనీయబోనని చెప్పి ఆ తర్వాత గ్రామాన్నే ఖాళీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో మత్స్యకారులు, రైతుల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఇటీవల కొత్త భూసేకరణ నోటిఫికేషన్ సుమారు 18 ఎకరాలకు ఇచ్చినా రైతులకు భూమిపై హక్కులేకుండా పోయింది. ఇలా రైతులు, మత్స్యకారులను పోర్టుపేరుతో దగా చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుకు బుద్ధి చెప్పేందుకు ఆ ప్రాంతీయులు సిద్ధంగా ఉన్నారు. జీవో రద్దు చేయాలి ప్రభుత్వం విడుదల చేసిన పోర్టు భూసేకరణకు సంబంధించిన జీవోను రద్దు చేయాలి. నాలుగేళ్లుగా రైతులు భూములపై హక్కులు కోల్పోయి అవసరాలకు అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క ఇటుక కూడా కదలనీయనని చెప్పి ఇప్పుడేమో గ్రామాన్నే ఖాళీ చేయాలని అంటున్నారు. ఇదేనా రాజకీయం. –బి.మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్, భావనపాడు -
గంగమ్మా... బతికేది ఎలాగమ్మా..!
కృష్ణాజిల్లా, మచిలీపట్నం సబర్బన్: పూడిక దశకు చేరుకున్న గిలకలదిండి సముద్రపు మొగ సముద్రపు మత్య్స వేటకు ప్రధాన అడ్డంకిగా మారింది. అర మీటరు లోతు మాత్రమే ఉన్న నీళ్లలో వేట కు వెళ్లలేక బోట్లన్నీ హార్బర్ వద్దే నిలిచిపోవడం మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం తమ పాలిట శాపంగా మారిందని తీరంలోని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా తీర ప్రాంతంలో సముద్రపు మత్య్సవేట కు ప్రసిద్ధి చెందిన గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నేడు వెలవెలబోతోంది. ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలో వేట కొనసాగించే 180 మెకనైజ్డ్ బోట్లు, 220 మోటరైజ్డ్ బోట్లు హార్బర్ వద్దే నిలిచిపోతున్నాయి. ఫలితంగా వందలాది టన్నుల చేపలు, రొయ్యలు, పీతల సేకరణకు బ్రేక్‌పడి ఎగుమతులు జరగకపోవడంతో మత్య్సకారులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులు వర్ణణా తీతం. మచిలీపట్నంతో పాటు గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్య్సకారులు దీనిపై ఆధారపడ్డారు. ప్రస్తుతం బోట్లపై పని చేసే డ్రైవర్లు, కలాసీలు అత్యధికంగా నిజాంపట్నం, అమలాపురం ప్రాంతాలకు చెందిన వారే. పూడిపోయిన మొగ గిలకలదిండి హార్బర్ నుంచి సముద్రం వరకు సుమారు 1.5 మీటర్ల దూరం. ఐదు నుంచి ఏడు రోజులు సముద్రంలో వేట సాగించే మోటరైజ్డ్ బోట్లు, రెండుమూడు రోజులు వేట సాగించే మోటరైజ్డ్ బోట్లు హార్బర్ నుంచి ఈ మార్గం ద్వారానే సముద్రంలోకి వెళ్లాల్సి ఉం టుంది. తీసుకొచ్చిన మత్య్స ఉత్పత్తులను హార్బర్‌లోనే వేలం పాటల ద్వారా విక్రయాల జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న మత్య్సకా రుల వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తో 20 ఏళ్ల క్రితం పూడిపోయిన సముద్రపు మొగను డ్రెజ్జింగ్ చేశారు. అయితే ఆలల తాకిడి కారణంగా క్రమక్రమంగా మొగ పూడికదశకు చేరుకుంటోంది. మూడేళ్లుగా ఈ పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా మోటరైజ్డ్ బోటు సముద్రంలోకి వేటకు వెళ్లాలంటే కనీసం రెండు మీటర్లు లోతు తప్పనిసరి. అంతకన్నా తక్కువ లోతు ఉంటే బోటు అడుగు భాగం మట్టిలో కూరుకుపోతుంది. ప్రస్తుతం సముద్రపు మొగ వద్ద అర కిలోమీటరు దూరం మట్టి తీవ్ర స్థాయిలో మేట వేసిందని కలాసీలు చెబుతున్నారు. అంతేకుండా రోజురోజుకీ తీర ప్రాంత పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో సముద్రంలో ఇసుక దిబ్బలు ఏర్పడినట్లు మత్య్సకారులు చెబుతున్నారు. సముద్రం పాటు సమయంలో స్పష్టంగా కనిపిస్తున్న ఈ దిబ్బలు సముద్రపు వేటకు ప్రతికూలంగా మారుతున్నాయి. గతంలో 50 మీటర్లు మాత్రమే మొగ పూడిపోవడంతో పోటు సమయం చూసుకుని బోట్లు వేటకు వెళ్లేవి. అయితే ప్రస్తుతం అత్యధిక దూరం పూడిపోవడంతో హార్బర్ వద్దే రోజుల తరబడి బోట్లు నిలిచిపోతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి ఇలా నెలకు నాలుగుసార్లు వచ్చే తీవ్ర పోటు నీటిని ఆధారంగా చేసుకునే బోట్లు వేటకు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే వేట ముగిం చుకుని తిరుగు ప్రయాణంలో తీవ్ర పోటు నీటి కోసం రెండుమూడు రోజులు మొగ వద్దే వేచి ఉండాల్సి ఉంటున్నామని మత్య్సకారులు వాపోతున్నారు. పోటు సమయం చూసుకోకుండా ముందుకు నడిపిన కారణంగా ఇప్పటి వరకు ఐదు బోట్లు మేట వేసిన మట్టిలో కూరుకుపోయాయి. అత్యధిక లోతులోకి కూరుకుపోవడంతో బోటు అడుగు భాగం పూర్తిగా దెబ్బతిని పనికిరాకుండా పోయినట్లు పలువురు బోటు యజమానులు చెబుతున్నారు. అంచనాలతో సరి తీవ్రస్థాయిలో మేట వేసిన మట్టిని డ్రెజ్జింగ్ చేసి తొలగించాలని మత్య్సశాఖ అధికారులు రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మేటను తొలగించేందుకు రూ. 255 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి తెలిపారు. మొగ వద్ద ఉన్న పరిస్థితులను మత్య్సశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాంశంకర్ నాయక్ స్వయంగా పరిశీలించారు. అప్పట్లోనే పర్యావరణ అనుమతులు, నిధుల విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా బందరు పోర్టు నిర్మాణ అంశం మొగ డ్రెజ్జింగ్ పనులకు ప్రధాన అడ్డంకిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొగ డ్రెజ్జింగ్ పనులు చేపడితే పోర్టు నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయంటూ ఏంయూడీఏ అధికారులు డ్రెజ్జింగ్ను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇబ్బందుల్లో మత్య్సకారులు మచిలీపట్నంలోని వేలాది మత్య్సకార కుటుం బాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గిలకలదిండి హార్బర్ పైనే ఆధారపడి జీవిస్తుంటారు. వేలాది టన్నుల చేపలు, రొయ్యలును ప్రాసెసింగ్ చేయడం, వలల మరమ్మతులు, ఐస్ విక్రయాలు జరపుతూ కొందరు జీవనోపాధి సాగిస్తుంటే మరికొందరు ఎండు చేపల విక్రయాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. సముద్రపు వేటకు అంతరాయం ఏర్పడిన నాటి నుంచి వేలాధి కుటుంబాలు రోడ్డున పడ్డాయని మత్య్సకారులు వాపోతున్నారు. నడపడానికి కూడా ఇబ్బందే దాదాపు అర కిలోమీటరు పాటు మొత పూడిపోయింది. పాటు సమయంలో నేల కనిపిస్తుంది. నెలకు నాలుగుసార్లు వచ్చే అత్యధిక పోటు నీళ్లను చూసుకుని బోట్లను సముద్రంలోకి తీసుకెళ్తున్నాం. కొన్నిసార్లు బోట్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. వేటకు వెళ్లి వారానికి ఒకసారి వస్తాం. వేట ముగించుకుని వచ్చేపుడు రెండుమూడు రోజులు మొగ దగ్గరే ఉండాల్సి వస్తోంది. నాతో పాటు చాలా మంది డ్రైవర్లు ఇతర ప్రాంతాల వారే. మేట వేసిన మట్టిని తొలగించి మొగను అభివృద్ధి చేయాలి. – పెదశింగు నాగేశ్వరరావు, బోటు డ్రైవర్, అమలాపురం నిధులొస్తే పనులుప్రారంభిస్తాం మొగ వద్ద ఉన్న దారుణమైన పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. మరో నెల రోజుల్లో పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అనంతరం నిధులు విడుదల కాగానే డ్రెజ్జింగ్ పనులు ప్రారంభించి పూడిక తీత చర్యలు తీసుకుంటాం.–రాఘవరెడ్డి, డీడీ, మత్య్సశాఖ -
వైఎస్ జగన్‌ను కలిసిన మైదాన ప్రాంత మత్స్యకారులు
-
చేపా చేపా నీకేమైంది?
చేపా చేపా... ఎందుకు ఎదగలేదు? నాణ్యమైన విత్తనం వేయక... అదనులో వానల్లేక... చెరువుల్లో నీరు అడుగంటి... ...ఇలా ఒకటా, రెండా? కర్ణుడి చావు మాదిరిగా ఎన్నో కారణాలున్నాయి!! సాక్షి నెట్వర్క్: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. చెరువులు, కుంటల్లో మత్స్య శాఖ మూడేళ్లుగా చేప పిల్లలను వదులుతోంది. వాటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఇంత చేస్తున్నా ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఈ ఏడాది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. నిర్వహణ లోపాల వల్ల అనుకున్న ప్రగతి సాధించలేకపోయారు. గతేడాది అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు కురవకపోవడం, చేప విత్తనాలను ఆలస్యంగా వదలడం, ఫీడింగ్ సరఫరా చేయకపోవడంతోపాటు చేపపిల్లల్లో నాణ్యత లేకపోవడం ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది మత్స్యకారులు లాభాలను కళ్లచూడలేకపోయారు. ఈ ఏడాది మిషన్ కాకతీయలో భాగంగా బాగు చేసిన చెరువుల్లో మాత్రం గతేడాది కన్నా ఈసారి చేపల దిగుబడి అధికంగా వచ్చింది. వాటిల్లో ఏడాది పొడువునా నీరుండటంతో చేపలు బతికి మత్స్యకారులు కాస్త ఆదాయం కళ్లజూశారు. భువనగిరి మండలం రాయగిరి చెరువులో నీరు లేకపోవడంతో చేపలు పడుతున్న మత్స్యకారులు వానల్లేక... చెరువుల్లో చేపల పెంపకం పథకం కోసం ఈ–టెండర్ విధానంలో ఏపీలోని కైకలూరు నుంచి చేప విత్తనాలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు, మ్రిగాల, బంగారు తీగ, బొచ్చలతో పాటు అక్కడక్కడ నీలకంఠ రకం రొయ్యలను పోస్తున్నారు. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్‌లో వదలాల్సిన చేప విత్తనాలను ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వదిలారు. కొన్ని ప్రాంతాల్లోనైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో పోశారు! చిన్నాచితక వర్షాలు మినహా అనుకున్న స్థాయిలో వానల్లేక వర్షాధార చెరువుల్లో నీరు తగ్గింది. నీటికుంటలూ ఎండిపోయాయి. దాంతో దాదాపుగా 30 శాతం చెరువుల్లో సగానికి పైగా చేపలు చనిపోయాయి. ఇది చాలదన్నట్టు ఎదిగీ ఎదగక ముందే చలికాలం ప్రారంభమవడం చేపల పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. గత సెప్టెంబర్‌లో వదిలిన చేప పిల్లలు ఇప్పుడు కేవలం 600 గ్రాముల నుంచి 800 గ్రాముల మధ్య మాత్రమే ఎదిగాయి. నిజానికి వర్షాకాలం ప్రారంభంలోనే చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. జూన్, జూలై తర్వాత వదిలితే ఎదుగుదల సరిగా ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు. ఏడాదంతా నీరు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 మి.మీ. సైజున్న చేపలను, వర్షాధార చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 మి.మీ. చేపలను వదులుతున్నారు. వీటిలో 50 నుంచి 60 శాతం మాత్రమే వృద్ధి అవుతున్నాయని మత్స్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. నాణ్యమైన పిల్లలనూ ఇవ్వడం లేదు... ఉన్న సమస్యలకు తోడు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లల్లో నాణ్యత కూడా లోపిస్తోందని రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల మత్స్యకారులూ వాపోతున్నారు. ఆ విత్తనాలను కూడా ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. దాంతో, 8 నెలల్లో 3 నుంచి 4 కిలోలు పెరగాల్సిన చేపల బరువు కిలో లోపే ఉంటుండటం దుస్థితికి అద్దం పడుతోంది. ఈ ఆలస్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న దళారులు మత్స్యకారులతో మాట్లాడుకుని తమకే తెగనమ్మేలా ఒప్పందం కుదుర్చుకుంటూ చేపపిల్లలను తెచ్చి వదులుతున్నారు. ఇలా దళారుల వలకు చిక్కి మత్స్యకారులు బిక్కమొకం వేస్తున్నారు. మార్కెట్ సదుపాయమేది? మార్కెట్ సదుపాయాల లేమి కూడా మత్స్యకారులకు శాపంగా మారింది. పలు ప్రాంతాల్లో చేపల మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ అవి పలు కొన్ని చోట్ల స్థల ఎంపిక దశలో ఉండగా మిగతా చోట్ల అది కూడా జరగలేదు. చేపలు పట్టిన వెంటనే నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో దళారులు కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని పట్టణాలకు తరలించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన దళారులే చేపల మార్కెట్‌ను నియంత్రిస్తున్నారు. చేపలు పాడవకుండా లాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా ఆ దిశగా అడుగు పడలేదు. పలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 275 మత్స్యకార సంఘాలున్నాయి. గతేడాది 918 చెరువులు, 14 ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో రూ.8.41 కోట్ల విలువైన చేపపిల్లలు వదిలారు. ఈ ఏడాది 20,900 టన్నుల చేపలు ఉత్పత్తయ్యాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపలు త్వరగా పెరగడం లేదనేది ఇక్కడి మత్స్యకారులు ఆవేదన. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 963 చెరువులు, 230 మత్య్సకార సంఘాలున్నాయి. ఈ ఏడాది రూ.3.40 కోట్ల విలువైన 4.92 కోట్ల చేప పిల్లలను వదిలారు. 13,800 టన్నుల చేప పిల్లలు ఉత్పత్తి అయ్యాయి. ఉత్పత్తి గతేడాది 8 వేల టన్నులే ఉండగా ఈసారి 12 వేల టన్నులకు పెరిగిందని అధికారులు అంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో గతేడాది 1.72 కోట్ల చేప పిల్లలు వదిలారు. ఇప్పుడు నీరు తగ్గడంతో చేపలు పడుతున్నారు. ఇప్పటికి 3,071 మెట్రిక్ టన్నుల చేపలను విక్రయించారు. రూ.27.63 కోట్ల ఆదాయం సమకూరింది. నల్లగొండ జిల్లాలో 90 శాతం చెరువులను కాంట్రాక్టర్లే గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లాలో 177 డిపార్ట్మెంట్ చెరువులు, 8 జలశయాలు, 490 గ్రామ పంచాయితీ చెరువులున్నాయి. వీటిలో గతేడాది రూ.2.96 కోట్ల విలువ గల 3.7 కోట్ల చేప పిల్లలను పోస్తే ఇప్పటికీ చాలా చెరువుల్లో కేజీ లోపు మాత్రమే పెరిగాయి. వరంగల్ జిల్లాలో గతేడాది 10.49 కోట్ల చేప పిల్లలు వదిలారు. 32,174 టన్నులు చేపల ఉత్పత్తి జరిగింది. మత్స్య కార్మికులకు రూ.207 కోట్ల ఆదాయం సమకూరింది. చేపలు పెరగలేదు.. మా ఊరి చెరువులో లక్ష చేప పిల్లలు వదిలాం. మాకు సెప్టెంబర్ చివరి వారంలో పంపిణీ చేశారు. సకాలంలో వానలు రాక పిల్లలు పెరగలేదు. రూ.70 వేల విలువైన పిల్లలు వేస్తే రూ.70 వేల దిగుబడే వచ్చింది. ఒక్కో చేప కనీసం కిలోన్నర పెరగాలి. కానీ ఈసారి ఒక్కో పిల్ల ముప్పావు కిలో మాత్రమే పెరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యంగా కాకుండా చేప పిల్లలను జూలై తొలి వారంలో పంపిణీ చేయాలి. అప్పుడు అధిక వర్షాలకు చేప పిల్లలు పెరుగుతాయి. మత్స్యకారులకు లాభం చేకురుతుంది. – ఎడ్ల భీమయ్య, కనికి సొసైటి అధ్యక్షుడు, కౌటాల మండలం, కుమురం భీం జిల్లా. ఆశలకు గండి కొట్టారు యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని గండి చెరువులో 4 నెలల కింద 50 వేల చేప పిల్లలను వదిలాం. ఇప్పుడవి ఎదిగే దశలో ఉన్నాయి. బాగా వానలు పడితే మా బతుకులు మారుతాయని 150 మంది మత్స్యకారులం సంతోషించాం. కానీ గండి చెరువును అభివృద్ధి చేస్తున్న కాంట్రాక్టర్లు ఆ ఆశలకు గండి కొట్టారు. అభివద్ధి పేరుతో గండి పెట్టి నీటిని తరలించడంతో చేప పిల్లలన్నీ కొట్టుకుపోయాయి. 4 నెలలు ఆగితే అవి పెరిగి మా బతుకులు బాగుపడేవి. – పల్లెపాటి రాంనర్సయ్య, మత్స్యకారుడు, యాదగిరిగుట్ట చేపల మార్కెట్లు లేక నష్టపోతున్నాం పాలేరు చెరువుపై వందలాది మంది మత్స్యకారులం బతుకుతున్నాం. ఏటా 250 టన్నుల చేపలు పడుతుంటాం. మాకు మార్కెట్లు లేక ఉన్న చేపంతా ఒక్క రోజే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. నాయకన్‌గూడెం, పాలేరుల్లో చేపల మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తే చేపలను మంచి ధరకు అమ్ముకోగలుగుతాం. జనానికీ ఎక్కువ రోజులు చేపలను అందుబాటులో ఉంచగలుగుతాం. – దేశబోయిన ఏడుకొండలు, మత్స్య సొసైటీ కార్యదర్శి చేపల ఉత్పత్తి పెరిగింది.. ఈసారి నాగార్జున సాగర్‌తో పాటు చెరువుల్లోకీ నీరు రావడంతో చేపల పెంపకం ఆశాజనకంగా ఉంది. మిషన్ కాకతీయతో చెరువుల్లోనూ నీరు నిల్వ ఉండటం చేపల ఉత్పత్తి, పెంపకానికి దోహదపడింది. దిగుబడి గతేడాది 8 వేల టన్నులు మించలేదు. ఈసారి 12 వేల టన్నులొచ్చింది. రిజర్వాయర్‌లో పోసిన చేపలు కిలోన్నర దాకా, పంచాయతీ చెరువుల్లోని చేపలు ముప్పావు కిలో దాకా పెరిగాయి. – హన్మంతరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం -
‘చంద్రబాబు సినిమా చూపిస్తున్నారు’
సాక్షి, నరసాపురం : ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు. రాజధాని మాదిరిగానే అదిగో ..వశిష్ట వారధి...ఇదిగో వశిష్ట వారధి అంటూ నరసాపురం ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. ప్రతి ఎన్నికలప్పుడు చంద్రబాబుకు వశిష్ట వారధి గుర్తుకు వస్తుంది. వశిష్ట వారధి నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచిపోయారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. వేట విరామ సమయంలో రూ.4వేలు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. అలాగే బియ్యప్పుతిప్ప హార్బర్‌ను పక్కనపెట్టారు. ఇక చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ ఆపేశారు. డీజిల్‌కు రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు. అధికారంలోకి వచ్చాకా మత్స్యకారులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. గతంలో మత్స్యకారులు చనిపోతే వెంటనే డబ్బులు వచ్చేవి. ఇప్పుడు వారు చనిపోతే డబ్బులు రావడం లేదు.’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్టీమర్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మత్య్సకారులకు కార్పొరేషన్ ఏర్పాటు ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు కొత్త బోట్లు ఇస్తాం. అంతేకాకుండా వేట విరామ సమయంలో వారికి నెలకు రూ.10వేలు, మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే బీమా కింద పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాంర. అలాగే బోట్లపై డీజిల్‌కు సబ్సిడీ ఇస్తాం.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పనవి కూడా చంద్రబాబు చేశారట..! చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 98 శాతం హామీలు అమలు చేశారట. చెప్పనవి కూడా చంద్రబాబు చేశారట. రైతుల రుణాలను మాఫీ చేశారట. బాబు రుణమాఫీ వడ్డీలకైనా సరిపోతుందా?. పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా?. బీసీలు జడ్జిలు కాకుండా చంద్రబాబు లేఖలు రాస్తారు. జస్టిస్ ఈశ్వరయ్య చంద్రబాబు లేఖను చూపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 12 మంత్రి పదవులు ఇస్తానన్న చంద్రబాబు ఏపీలో మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని పునరుద్దరిస్తాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నవరత్నాలు పథకాన్ని తీసుకు వస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. పేదవాడి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకువస్తే దాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. మనం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పునరుద్దరిస్తాం. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా సరే ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తాం. కుటుంబ పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా విశ్రాంతి అవసరం అయితే ఆ సమయంలో పేషెంట్‌కు ఆర్థిక సాయం చేస్తాం. డయాలసిస్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం. అవ్వా తాతలకు రూ.2వేల పెన్షన్, అంతేకాక వారి పెన్షన్ వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. వైఎస్ జగన్ ఇంకా ఏమి మాట్లాడారంటే... చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు రైతులు గిట్టుబాటు ధర లేక చనిపోతున్నారు ఒక్క పంటకైన సీఎం చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర పలికిందా? నరసాపురంలో 4వేల ఎకరాల్లో ఉప్పుపంట సాగవుతుంది ఉప్పు రైతులకు గిట్టుబాటు ధరల్లేవు, గిడ్డంగులు లేవు ఉప్పు బస్తాను దళారీలు కేజీ రూ.1.70 పైసలకు కొంటున్నారు అదే ఉప్పును అదే ఉప్పును ప్యాకింగ్ చేసి హెరిటేజ్‌లో కేజీ రూ.10కి అమ్ముతున్నారు నరసాపురంలో చేతి అల్లికలు మీద 15వేలమంది మహిళలు ఆధారపడి జీవిస్తున్నారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేతి అల్లికల మహిళకు పెద్ద పీట వేశారు. చేతి అల్లిక మహిళలకు నెలకు రెండు వేలు సబ్సిడీ కింద ఇస్తాం -
నిషేధం ఉన్నా..
పూసపాటిరేగ : సముద్రంలో వేట చేపట్టకూడదన్న నిషేధం ఉన్నా యథావిథిగా చేపల వేట కొనసాగుతూనే ఉంది. చింతపల్లి సముద్రతీరంలో 25 వరకు బోట్లు వేట కొనసాగించి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒడ్డుకు చేరాయి. ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో మత్స్యకారులు విధిలేని పరిస్థితిలో వేటకొనసాగిస్తున్నారు. చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ప్రభుత్వం వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేట చేపట్టిన మత్స్యకారులపై జరిమాన కూడా విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే నిషేధ సమయంలో ఇవ్వాల్సిన జీవనభృతి సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే వేట చేపట్టాల్సివస్తోందని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. జిల్లాలో సముద్రం చేపల వేటపై ప్రత్యక్షంగా నాలుగు వేల మంది.. పరోక్షంగా 16 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది నిషేధ సమయంలో చెల్లించాల్సిన జీవనభృతి నేటికీ చెల్లించలేదని పలువురు మత్స్యకారులు వాపోయారు. నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారుని కుటుంబానికి రూ. 4 వేలు చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. కాని ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో మత్స్యకారులకు జీవనభృతి చెల్లించడం లేదు. అధికారపార్టీ అనుచరులకు మాత్రమే పరిహారం ఇచ్చి ప్రతి పక్షానికి చెందిన వ్యక్తులుగా కొంతమంది మత్స్యకారులపై ముద్రవేసి జీవనభృతి ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే చేపల వేట యథావిథిగా కొనసాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సైదానాయక్ వద్ద ప్రస్తావించగా, సముద్రంలో చేపలవేటపై నిషేధం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. -
పడవలకు పసుపు రంగు
నెల్లూరు రూరల్ : సముద్రపు దొంగలను గుర్తించేందుకు, జలమార్గంలో వచ్చే తీవ్రవాదులను పసిగట్టేందుకు, గల్లంతవుతున్న మత్స్యకారులను గుర్తించేందుకు, అంతరాష్ట్ర, దేశ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు, సముద్రంలో చేపల వేటకు వచ్చే మత్స్యకారులు ఇతర రాష్ట్రాలు, దేశసరిహద్దులు దాటిపోతుండడం తదతర ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. విదేశీయులు ఎవరైనా మన సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు బోట్లు ఏ దేశానికి సంబంధించినవో, మన దేశపరిధిలో అయితే ఏ రాష్ట్రానికి చెందినవో గుర్తించడానికి వీలుగా తీర రక్షణ దళం ప్రతి తీర రాష్ట్రానికి చెందిన పడవలకు ఒక రంగు కేటాయించింది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రంగు కేటాయిస్తూ ఏప్రిల్ నెలాఖరు లోపు రంగులు వేయడం పూర్తి చేయాలని ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు పడవలను పరిశీలించి పసుపు, నీలం రంగులు వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. పైభాగానికి పసుపు రంగు, నీటిలో మునిగి ఉన్న భాగానికి ముదురు నీలిరంగు వేయాలి. రంగువేయని పడవలకు రిజిస్ట్రేషన్ నిలిపివేయడమే కాకుండా వారికి అందే రాయితీలను నిలిపివేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ముంబై తరహా దాడులు జరగకుండా ఇతర దేశాలకు చెందిన వారు మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు సులువుగా గుర్తించవచ్చని చెబుతున్నారు. రంగు వేస్తేనే రాయితీ వేట విరామ సమయంలో 61 రోజు లకు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రతి ఇంజ న్బోటుపై వేట చేస్తే మత్స్యకారుడి కుటుంబానికి రూ.4 వేలు జీవన భృతి ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది నుంచి ఇంజిన్బోటు డీజిల్‌కు లీటరుకు రూ.6 రాయితీ ఇవ్వనున్నారు. పసుపురంగు వేయకపోతే ఇవన్నీ నిలిచిపోనున్నాయి. అలాగే బోట్లకు రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ నిలిపేస్తారు. ఆయా కుటుంబాలకు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిపేయనున్నారు. సర్కారు సూచించిన కలర్ కోడ్ ముత్తుకూరు: రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట సాగించే పడవలకు పైభాగంలో పచ్చరంగు పూయాలని, అడుగు భాగం ముదురునీలం రంగు వేయాలని ఆదేశించగా మత్స్యశాఖ అ« దికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులచే రంగులు కొనుగోలు చేయిం చి, పడవలకు కలర్ కోడ్ ఇప్పించే పనిలో పడ్డారు. ఇప్పటికే పొరుగున ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పడవలకు కలర్ కోడ్ ఇచ్చే కార్యక్రమం ఊపందుకొంది. ఒక పడవకు కలర్ కోడ్ ఇవ్వాలంటే రూ.2,500 ఖర్చవుతోందని అంచనా. జిల్లాలో సుమారు 2,000 ఇంజన్ పడవలు ఉన్నాయి. ముత్తుకూరు మండలంలో 383 ఫైబర్ బోట్లు, 155 తెప్పలు, 18 మరపడవలు ఉన్నాయి. కాగా జిల్లాలో కలర్ కోడ్ కార్యక్రమం ఇంకా ఊపందుకోలేదు. చిత్రం తీసి ఆన్లైన్లో ఉంచుతాం జిల్లాలో మత్స్యకారులు తమ పడవలకు పసుపు, ముదురు నీలిరంగు వేయాలి. ఇలా చేస్తేనే వారికి రాయితీలు వర్తిస్తాయి. రంగు వేసిన ప్రతి పడవను చిత్రం తీసి ఆన్లైన్లో నమోదు చేస్తాం. రంగు వారికే వాటికే రాయితీలు, ఇతర పథకాలు వర్తిస్తాయి. – ఎ.సాల్మన్‌రాజు, జిల్లా మత్స్యశాఖ జేడీ పడవలకు కలర్ కోడ్ ఇవ్వాలి కలర్ కోడ్‌పై మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. పడవలకు రంగులు పూయాలని కోరుతున్నాం. కోస్టుగార్డు అధికారులు తేలిగ్గా గుర్తించేందుకు ప్రభుత్వం ఈ కలర్ కోడ్ సూచించింది. –ప్రసాద్, ఎఫ్డీఓ, ముత్తుకూరు -
అల..అలా చేరుకున్నారు
క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు పల్లిపాలెం (సఖినేటిపల్లి) : వర్దా తుపాను ధాటికి సముద్రంలో బోటు అదుపుతప్పి పశ్చిమగోదావరి జిల్లా సంబలదీవి చేరుకున్న కాకినాడ రూరల్ ఏరియాకు చెందిన మత్య్సకారులు ఐదుగురు మంగళవారం మెరై¯ŒS పోలీసులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది సాయంతో క్షేమంగా వెనుతిరిగారు. ఈ నెల 10న కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన చక్కా సత్తిబాబు, కుమారులు పెద్దరాజు, చిన్నరాజు, వీరబాబు, సోదరుడు బాబ్జీరాజు బోటుపై ఒడ్డున వేటాడుకునేందుకు సముద్రంపైకి వెళ్లారు. బోటు కొంత దూరం వెళ్లే సరికి సముద్రం గాలులకు అదుపుతప్పింది. బోటులో ప్రయాణిస్తూ మూడు రోజులు సముద్రంపైనే ఉండిపోయారు. అదృష్టవశాత్తూ బోటు అనుకూల వాతావరణంలో పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, సంబలదీవి ప్రాంతాల సమీపానికి చేరడంతో వారికి పెనుప్రమాదం తప్పింది. స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో పల్లిపాలెం చేపల రేవుకు చేరుకుని, వీఆర్వో పోతురాజు బాబు ద్వారా అంతర్వేది మెరై¯ŒS పోలీసులను ఆశ్రయించారు. మెరై¯ŒS పోలీసు, రెవెన్యూ సిబ్బంది సాయంతో వారు ఐదుగురు క్షేమంగా వెనుతిరిగారు. -
వరద నీటిలో చిక్కుకున్న జాలర్లు
-
'పశ్చిమ' అధికారులు అప్రమత్తం
ఏలూరు : రాబోయే 48 గంటలపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ...అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్ధిరంగా కొనసాగుతోందని విశాఖ లోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం 24 గంటల్లో క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా పయనించే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరో 48గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.