మూలపేట పోర్టుకు భూమి పూజ.. పోర్టు విశేషాలివే.. | Bhumi Pooja to Mulapeta Port Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మూలపేట పోర్టుకు భూమి పూజ.. దశాబ్దాల కలను నెరవేరుస్తున్న సీఎం జగన్‌

Published Wed, Apr 19 2023 12:37 AM | Last Updated on Wed, Apr 19 2023 11:01 AM

Bhumi Pooja to Mulapeta Port Andhra Pradesh - Sakshi

సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మూలపేట పోర్టు నమూనా

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు.

విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. 

మరికొన్ని ప్రాజెక్టులకు కూడా శ్రీకారం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్‌ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి.

వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. 

మూలపేట పోర్టు విశేషాలు
– పోర్టు సామర్థ్యం ఏడాదికి 23.5 మిలియన్‌ టన్నులు
– బెర్తుల సంఖ్య 4
– ఎన్‌హెచ్‌ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి
– నౌపడ జంక్షన్‌ నుంచి పోర్టు దాకా 10.6 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం
– గొట్టా బ్యారేజ్‌ నుంచి 50 కి.మీ. పైప్‌లైన్‌తో 0.5 ఎంఎల్‌డీ నీటి సరఫరా
– పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు

సిక్కోలు మత్స్యకారులకు బాసటగా..
2018 నవంబర్‌ 27న పాకిస్తాన్‌ భద్రతా దళాలకు పట్టుబడి 13 నెలలు కరాచీలో జైలు జీవితం గడిపిన 20 మంది మత్స్యకారులను గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విదేశాంగ శాఖతో పలుసార్లు మంతనాలు జరిపి 2020, జనవరి 6న వారిని విడుదల చేయించడంలో సఫలీకృతమైంది. అలాగే కరోనాతో లాక్‌డౌన్‌ విధించినప్పుడు గుజరాత్‌లో చిక్కుకున్న 3,064 మంది శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను రూ.3 కోట్ల ఖర్చుతో 46 బస్సుల ద్వారా ప్రభుత్వం స్వస్థలాలకు చేర్చింది.

ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే సంకల్పంతో రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్‌లు, 3 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు త్వరలో నిర్మాణం కానున్న 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్‌ విలసిల్లనుంది. 

మారనున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం
ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే నెలలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లైన్ల రహదారి పూర్తయింది. మంచినీళ్లపేట ఫిషింగ్‌ హార్బర్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

అదేవిధంగా వచ్చే నెలలోనే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల, పాడేరులో వైఎస్సార్‌ గిరిజన వైద్య కళాశాల, అనకాపల్లి, విజయనగరం వైద్య కళాశాలల పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

పార్వతీపురం వైద్య కళాశాల పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏకంగా రూ.700 కోట్లతో వంశధార నీటితో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఇళ్లకు నీరందించే పనులు 95 శాతం పూర్తయ్యాయి. దీన్ని త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దీన్ని పాతపట్నం నియోజకవర్గానికి కూడా విస్తరిస్తూ మరో రూ.265 కోట్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తారు. సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి జూన్‌లో ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది.

శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద, టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ సదుపాయం కల్పించనుంది. కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్‌ కోల్, కోకింగ్‌ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి మూలపేట పోర్టు కేంద్రం కానుంది.

అదేవిధంగా ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు, మినరల్‌ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతికి ఇక్కడి నుంచి అవకాశముంటుంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం కూడా లభిస్తుంది.

సుమారు రూ.35 కోట్లతో తీరప్రాంత–పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామికీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకెళుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement