పరిహారం ఇవ్వాలని కోరుతూ 2011 నవంబర్ 7న సముద్రంలోని జీఎస్‌పీసీ రిగ్గును బోట్లలో వెళ్లి ముట్టడించిన మత్స్యకారులు
శిశిరం వచ్చిన వేళ ఆకురాలిన చెట్టు.. మోడువారిపోయిన జీవితానికి ఉపమానంలా కనిపిస్తుంది. రుతువు మళ్లగానే అదే చెట్టు కొత్తాకులు తొడిగి.. సరికొత్త మెరుపులను అద్దుకుంటుంది. జీఎస్‌పీసీ నిర్వాసిత మత్స్యకారుల పరిస్థితి కూడా అటువంటిదే. జీఎస్‌పీసీ కార్యకలాపాల కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారు.. తమకు న్యాయంగా రావాల్సిన రూ.80 కోట్ల పరిహారం కోసం నాటి ‘పచ్చ’ పాలకుల చుట్టూ.. ఆ పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అధికార మదం తలకెక్కిన నాటి టీడీపీ నాయకులు వారిని పూచికపుల్లల కంటే హీనంగా చూశారు. ఆ రోజుల్లో వారి దీనావస్థను చూసి చలించిన నాటి విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వారి సమస్య పరిష్కారానికి మాట ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అణాపైసలతో సహా పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి.. జీఎస్‌పీసీ బాధిత మత్స్యకారులకు ఈ నెల 21న పరిహారం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. మోడువారిన తమ జీవితాల్లోకి నవవసంతం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని మత్స్యకారులు ఆనందంగా చెబుతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: చేయాలనే తపన, చేసే పనిపై చిత్తశుద్ధి ఉండాలే కానీ ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన మత్స్యకారుల సమస్యకు జగన్‌మోహన్‌రెడ్డి క్షణాల్లో పరిష్కారం చూపారు. తాళ్ళరేవు మండలం మల్లవరంలోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్‌పీసీ) చమురు, సహజవాయువు అన్వేషణకు సముద్రంలో డ్రిల్లింగ్ ఆరంభించిన నేపథ్యంలో.. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని 16,654 మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారికి రూ.80 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. దానికోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ మత్స్యకార నాయకులు పలుమార్లు ప్రదక్షిణలు చేశారు. అయినప్పటికీ వారిని కనీసంగా కూడా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన నాటి మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వద్దకు నాలుగున్నరేళ్ల పాటు కాళ్లరిగేలా తిరిగి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. మత్స్యకారుల బాధను వారు కనీస మానవత్వంతో కూడా చూడలేదు. టీడీపీ హయాంలో ఇక ఆ పరిహారం రాదనే మత్స్యకారులు నిర్ధారించుకున్నారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏతో అంటకాగారు.
అయినప్పటికీ ఇన్ని వేల మంది మత్స్యకారులకు సంబంధించిన పరిహారం సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలనే స్పృహ ఏనాడూ ఆయనకు కానీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కలగలేదు. తమ సమస్యను పరిష్కరించాలని గాడిమొగలో జీఎస్‌పీసీ గేటు వద్ద మత్స్యకారులు 103 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. సుమారు 5 వేల బోట్లపై వేలాది మంది మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో చమురు సంస్థల పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిపై నాటి చంద్రబాబు సర్కార్ ఏమాత్రం సానుభూతి చూపలేదు. రోజులు గడిచాయి. సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. టీడీపీ నేతల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహంతో ఉన్న మెజారిటీ మత్స్యకారులు ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. ముమ్మిడివరంలో చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థి బుచ్చిరాజును సాగనంపారు. ఆ ఎన్నికల సందర్భంగా ముమ్మిడివరంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మత్స్యకారుల తరఫున నాటి వైఎస్సార్ సీపీ అభ్యర్థి, నేటి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ జీఎస్‌పీసీ పరిహారం సమస్యను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కరిస్తానని నాడు ఆయన మాట ఇచ్చారు.
వాస్తవానికి జీఎస్‌పీసీ ద్వారా పరిహారం అందించాల్సి ఉండగా ఆ సంస్థ తన ప్లాంట్‌ను ఓఎన్‌జీసీకి బదలాయించేసింది. పరిహారం ఇవ్వడానికి ఓఎన్‌జీసీ ముందుకు రాకున్నా తమ ప్రభుత్వమే అణాపైసలతో సహా బాధిత కుటుంబాలకు అందజేస్తుందని ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబులా మత్స్యకారులను జగన్ పదేపదే తన చుట్టూ తిప్పుకోలేదు. ఈ సమస్యపై ఎమ్మెల్యే పొన్నాడ సతీ‹Ùకుమార్‌తో మాట్లాడారు. నాడు ముమ్మిడివరంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.80 కోట్లు ఇవ్వడానికి ఇటీవల మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా మొత్తం పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ రోజు పరిహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన విధి విధానాలపై చర్చించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ సోమవారం జిల్లాకు రానున్నారు.
సీఎం చొరవతో స్పందించిన ఓఎన్‌జీసీ
ఈ ఏర్పాట్లు ఇలా జరుగుతూండగా, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. వచ్చీ రాగానే తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జీఎస్‌పీసీ నిర్వాసిత మత్స్యకారుల పరిహారం అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. పరిహారంగా ఇవ్వాల్సిన రూ.80 కోట్లూ ఓఎన్‌జీసీ చెల్లించేవిధంగా కేంద్ర మంత్రిని ఒప్పించారు. వాస్తవానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో వైఎస్సార్ సీపీకి ఎటువంటి పొత్తులు, సర్దుబాటులు లేవు. కానీ బలహీన వర్గాలకు చెందిన 16 వేల మంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు, గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సీఎం గట్టి పట్టుదలతో కేంద్ర మంత్రి ద్వారా ఓఎన్‌జీసీ నిధులు రాబట్టడంలో విజయం సాధించారు. జగన్ మాదిరిగానే చంద్రబాబు చిన్న ప్రయత్నం చేసి ఉంటే ఈ పరిహారం ఏనాడో తమ చేతికి వచ్చేదని బాధిత మత్స్యకారులు అంటున్నారు.
సీఎం జగన్ వల్లే పరిహారం వచ్చింది
నష్ట పరిహారం కింద జీఎస్‌పీసీ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే వచ్చాయి. గత ఐదేళ్లలో ఎన్నిసార్లు వేడుకొన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు. కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులు ఇస్తానని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడి నిధులు విడుదల చేయించడం అభినందనీయం.
– వైదాడి ధర్మారావు, మత్స్యకార నాయకుడు, తాళ్లరేవు
చమురు సంస్థల మెడలు వంచారు
కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా చమురు సంస్థలు పరిహారం ఇవ్వలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాటి మెడలు వంచి డబ్బులు వచ్చేలా చేశారు. మత్స్యకారులకు జీఎస్‌పీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంపై కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ మాట్లాడి, పరిహారం ఇచ్చేవిధంగా కృషి చేశారు. సీఎం కారణంగానే మాకు డబ్బులు వస్తున్నాయి. మత్స్యకారులు జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటారు.
– కొక్కిలిగడ్డ లోకేష్, మత్స్యకార నాయకుడు, గాడిమొగ
మాట నిలబెట్టుకున్నారు
సముద్ర అలల తాకిడి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి, ఐదేళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న మాకు పాదయాత్రలో జగన్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఓఎన్‌జీసీపై ఒత్తిడి తీసుకువచ్చి పరిహారం ఇప్పించేవిధంగా కృషి చేశారు. చాలా సంతోషంగా ఉంది.
– దాసరి కాసుబాబు, మత్స్యకారుడు, పోర గ్రామం
రుణపడి ఉంటాం
గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన మత్స్యకారులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నివిధాలా ఆదుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రావనుకుని వదిలేసిన జీఎస్‌పీసీ నిధులను జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాబట్టి, మాకు ఇప్పిస్తున్నారు. మత్స్యకారుల పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఔదార్యం మరువలేనిది. ఆయనకు మత్స్యకారులు జీవితాంతం రుణపడి ఉంటాం.
– మల్లాడి ఆదినారాయణ, మత్స్యకారుడు, బలుసుతిప్ప
Comments
Please login to add a commentAdd a comment