కాశిమీడు తీరానికి బోటుతో సహా క్షేమంగా చేరిన మత్స్యకారులు
గంగమ్మ తల్లి తన బిడ్డల్ని కాచుకుంది. దారీ తెన్నూ తెలీక నడి సంద్రంలో చిక్కుకున్న వారికి అపాయం రాకుండా కాపు గాసింది. కనుచూపు మేర నీళ్లు, కళ్లల్లో కన్నీళ్లతో బతుకుపై బెంగ పెట్టుకున్న గంగ పుత్రులను క్షేమంగా తీరానికి చేర్చింది. అధికారులు, నాయకులు, కోస్టుగార్డులు సమష్టిగా పనిచేసి వారి ప్రాణాలు కాపాడారు. బెస్త పల్లెల కన్నీరు తుడిచారు. వేటకెళ్లిన వారంతా శుక్రవారం కాశిమీడు తీరానికి చేరుకున్నారు. తమ కోసం పని చేసిన వారికి, ప్రార్థించిన వారికి మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి,సోంపేట/కవిటి: తేదీ: జూలై 7.. సమయం: రాత్రి 7 గంటలు ప్రదేశం: చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ చేపల వేటకు సముద్రంలోకి సాగిపోయే పడవల సందడితో కళకళలాడుతోంది.
IND-TN-02-MM-106 నంబర్ బోట్ కూడా సోంపేట, కవిటి మండలాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో పాటు మరో ఐదుగురితో కలిసి గంగమ్మకు పూజలు చేసి తీరానికి బైబై చెప్పింది. కోడ సోమేశ్వరరావు రథసారథి. హుషారుగా బోట్‌ను నడిపిస్తున్నాడు. మొత్తం 25 రోజుల ప్రయాణం. ఆహారం, తాగునీరు ఇతర పూర్తి సదుపాయాలతో ఉన్న ఓడ వేట సాగిస్తూ ముందుకు సాగుతోంది. 9 రోజుల పాటు హుషారుగా సాగిన బతుకు పయనంలో జూలై 16 శుక్రవారం అనుకోని ఘటన. ఉన్నట్టుండి నడి సంద్రంలో పడవ ఆగిపోయింది.
సముద్రపోటుకు పడవ అదుపు తప్పుతోంది. వలలన్నీ సముద్రంలోనే ఉన్నాయి. బోటులో ఉన్న వారంతా అలర్టయ్యారు. ఇంజిన్‌ను చెక్ చేశారు. పంఖా ఎక్కడో జారిపడిపోయింది. యజమానికి సమాచారం తెలియజేస్తూనే.. ప్రత్యామ్నాయాలకు ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. సాయం కోసం చుట్టూ చూశారు. కనుచూపుమేర ఏమీ కనబడలేదు. సమాచార మార్పిడి కోసం బోట్‌లో వినియోగించే జీపీఎస్ మూగబోయింది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
‘దేవుడా ఏమిటీ పరిస్థితి..’ అంటూ నిట్టూర్చడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ పన్నెండు మంది వలసజీవులది. పగలంతా ధైర్యంగానే గడిపారు. సాయంత్రమవుతున్న కొద్దీ ఆందోళన పెరిగింది. చుట్టూ నీరు తప్ప ఓడ గానీ.. మనిషి జాడగానీ కానరాలేదు. ‘నీదే భారం తల్లీ..’ అంటూ గంగమ్మ మీద భారం వేశారు. నిమిషాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఎదురుగానే తిండి.. కానీ సహించదు. ఏమైపోతామనే ఆందోళన ముందు దాహం వేయడం మానేసింది. బోటు మాత్రం అదుపు తప్పింది. వాలుగా అండమాన్ వైపుగా వెళ్లిపోతోంది..
హెలికాప్టర్‌తో గాలింపు
సమాచారం అందుకున్న బోటు యాజమాని స్థానిక మత్స్యకార నాయకులతో కలిసి విషయాన్ని చెన్నైలోని స్థానిక అధికారులకు వివరించారు. ప్రయత్నాల ఫలితంగా కోస్ట్‌గార్డ్‌ను అలెర్ట్ చేశారు. జూలై 17న రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్ గాలించినా ఫలితం దక్కలేదు. విషయాన్ని పైఅధికారులకు తెలియజేయడంతో హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. బోటు ఆచూకీని అండమాన్ సమీపంలో ఎట్టకేలకు కనిపెట్టారు. సమాచారాన్ని కోస్ట్‌గార్డుకు అందజేశారు. రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు నౌక.. బోట్‌ను చేరుకుని మత్స్యకారులకు ధైర్యం చెప్పింది.
బోట్‌ను తీరానికి చేర్చేందుకు పరిసరాల్లోని ఓడల కోసం యత్నించింది. ‘ఎస్‌కే’ అనే బోటుకు సమాచారం అందించడంతో సాయమందించేందుకు ముందుకొచ్చింది. మొరాయించిన బోటును తాళ్లసాయంతో తీరంవైపునకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. కోస్ట్‌గార్డు నౌక ఈ రెండింటిని అనుసరించింది. 36 గంటల తరువాత ‘విన్నర్’ అనే మరో బోటు రంగంలోకి దిగింది. 36 గంటల ప్రయాణం తరువాత 12 మంది మత్స్యకారులతో కూడిన బోటును శుక్రవారం రాత్రి కాశిమీడు తీరానికి క్షేమంగా చేర్చింది.
తమ వారంతా ఒడ్డుకు చేరారని తెలుసుకుని సిక్కోలు మత్స్యకార పల్లెలు ఊపిరి పీల్చుకున్నాయి. మత్స్యకారులు గల్లంతయ్యారని సమాచారం అందినప్పటి నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు, ఇచ్ఛాపురం వైఎస్సార్‌సీపీ నేత పిరియా సాయిరాజ్ తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి చెన్నై అధికారులతో సంప్రదింపులు జరిపేలా చేశారు. మత్స్యకారులను రక్షించడానికి ప్రభుత్వం చేసిన కృషి ప్రశంసనీయమని మత్స్యశాఖ డైరెక్టర్ మడ్డు రాజారావు అభినందించారు.
ధైర్యం కోల్పోలేదు..
జూలై 16 మరిచిపోలేని రోజు. రాత్రంతా జాగారమే. బోటు వాలు వైపుగా వెళ్లిపోతోంది. ఎటు పోతున్నామో మాకే తెలియని పరిస్థితి. అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. హెలికాప్టర్‌ను చూసిన తరువాత ప్రాణం లేచొచ్చింది. కొద్ది గంటల తరువాత కోస్ట్‌గార్డ్ మమ్మల్ని సేవ్ చేసే పనిలో పడింది.
కోడ సోమేశ్వరరావు, బోటు డ్రైవర్
భయం వేసింది..
వేట సాగుతోంది. ముందుకు వెళుతున్నాం. ఉన్నట్టుండి పంఖా జారిపడిపోయింది. ఆందోళన చెందాం. దేవుడి మీదే భారం వేశాం. కోస్టుగార్డ్, ఇతర బోట్ల సిబ్బంది సాయంతో ఒడ్డుకు చేరాను. ఒకనొక దశలో చాలా భయం వేసింది.
కోడ జగన్నాథం, మత్స్యకారుడు
Comments
Please login to add a commentAdd a comment