పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం) : పాక్ చెరలో బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారుల విడుదలకు మరింత కాలం వేచి చూడక తప్పదమో అనిపిస్తోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల భారత ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన చట్టం చేసిన నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఇప్పటికే భారత్ నుంచి రైళ్ల సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసింది. దౌత్య, వాణిజ్య సంబంధాలు తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో తెలియని తప్పుకు పాక్ జైల్లో ఖైదీలుగా మగ్గుతున్న మన మత్స్యకారుల విడుదల సమస్య జఠిలమైంది.
కళ్లనే వత్తులుగా చేసుకుని..
భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న ప్రతిసారీ బాధిత మత్స్యకార కుటుంబాల గుండెల్లో అలజడి రేగుతోంది. తమవారు విడుదలయ్యే వరకూ వీరి మనసు కుదురుగా ఉండటం లేదు. నిద్రాహారాలు మానుకుని, కళ్లనే వత్తులుగా చేసుకుని దీనంగా ఎదురు చూస్తున్నారు. తమ వేదనను పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. విదేశాంగ శాఖ దృష్టికి సైతం ప్రభుత్వం తీసుకెళ్లింది. తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్న మత్స్యకారులను విడుదల చేయడం సమస్య కాదు. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు చిక్కితే సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. దర్యాప్తులో తప్పు లేదని తేలాక విడిచి పెడుతున్నారు. పాక్‌కు చిక్కితే మాత్రం తెలియకుండా చేసిన నేరమైనా ఏళ్ల సమయం పడుతుంది.
ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి సమస్య తీసుకెళ్తున్న మత్స్యకారులు (ఫైల్)
10 నెలలుగా బందీలోనే...
రాష్ట్రం నుంచి బతుకు దెరువు కోసం గుజరాత్ రాష్ట్రం వీరావల్ వెళ్లిన జిల్లా మత్స్యకారులతోపాటు విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల మత్స్యకారులు అక్కడ సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో పాకిస్థాన్ సముద్ర తీర గస్తీ రక్షణ విభాగానికి చిక్కారు. గతేడాది నవంబర్ 27న సముద్రంలో భారత్ ప్రాదేశిక సరిహద్దు తీరం దాటి పొరపాటున వెళ్లటంతో పట్టుబడ్డారు. మూడు బోట్లు పాక్ భద్రతా దళాలకు చిక్కుకున్నాయి. రెండో బోట్లుతో ఏడుగురు చొప్పున 14 మంది, మూడో బోటులో ఆరుగురు చిక్కుకున్నారు. మొత్తం 22 మందిలో మన జిల్లాకు చెందిన మత్స్యకారులు 15 మంది ఉన్నారు. వీరంతా ఒకే గదిలో ఖైదీ లుగా పాక్ ఉన్నట్లు గతంలో బాధిత కుటుంబ సభ్యులకు లేఖ అందింది. ఇప్పటికీ 10 నెలలు గడుస్తున్నా విడుదలలో పురోగతి లేదు.
పాక్ చెరలో ఉన్నది వీరే...
పాక్ చెరలో గనగళ్ల రామారావు, సురాడ కిశోర్, మైపల్లి సన్యాసి, మైలపల్లి రాంబాబు, కేశంరాజు, చీకటి గురుమూర్తి, సుమంత్, బర్రి బవిరోడు, కేశం ఎర్రయ్య, బడి అప్పన్న, నక్క అప్పన్న, నక్క నర్సింగ్, నక్క ధనరాజ్, వానుపల్లి శామ్యూల్, మైలపల్లి గురువులు, సూరాడ అప్పారావు, సూరాడ కల్యాణ్, కోనాడ వెంకటేష్, గండు సూర్యనారాయణ, పెంట మణి, బిమ్మాలి నారాయణరావు, సత్యం ఉన్నారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీరు విడుదల అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయినా నిరాశే మిగిలింది. తరచూ భారత్, పాక్ స్నేహ సంబంధాలు దెబ్బతినటం వల్ల విడుదలలో జాప్యం తప్పటం లేదు.
అధికంగా ఎచ్చెర్ల మండల వాసులే...
పాక్ చెరలో 22 మంది మత్స్యకారుల్లో జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. వీరిలో ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, బడివానిపేట పంచాయతీలకు చెందిన 14 మంది, ఒకరు శ్రీకాకుళం నగరానికి చెందినవారు ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి అప్పారావు, కిశోర్, కల్యాణ్, మరో కుటుంబం నుంచి సన్యాసి, రాంబాబు జైలు జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో వీరి కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీరు తప్పు లేదని నిరూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరు దేశాల సంబంధాలు క్షీణించడంతో అమాయక మత్స్యకారుల విడుదల సమస్య జఠిలమైంది. ఈ పరిస్థితుల్లో వీరు విడుదలకు మరికొంత కాలం పట్టనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment