మునగపాక (అనకాపల్లి జిల్లా) : తాను కులమతాలకు అతీతమని గొప్పలు చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాభిమానంతో వ్యవహరిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తనపై కాపు కులానికి చెందిన యలమంచిలి నియోజకవర్గ నేత సుందరపు విజయకుమార్ దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినా ఇంతవరకు పార్టీ పరంగా ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అదే పార్టీకి చెందిన పూడిమడక మత్స్యకారుడు ఎరిపల్లి కిరణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.
కిరణ్‌కుమార్‌కు న్యాయం చేసేంతవరకు పార్టీలకతీతంగా ఆందోళనలు చేసేందుకు మత్స్యకారులు సమాయత్తమవుతున్నారు. అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకార యువకుడు ఎరిపల్లి కిరణ్‌కుమార్ జనసేనలో చురుకైన కార్యకర్త. గత నెల 3న ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితిపై సమీక్షించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగబాబు విశాఖ వచ్చారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పార్టీని భ్రష్టుపట్టించేలా వ్యవహరిస్తున్నాడని కిరణ్‌కుమార్ ఈ సమావేశంలో ఫిర్యాదు చేశాడు. ఇది తట్టుకోలేని విజయకుమార్ తన అనుచరులతో కలిసి అదే రోజు కిరణ్‌కుమార్‌పై దాడిచేశాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న కిరణ్‌ను 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విజయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు కిరణ్ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాక.. గత నెల 23న కుటుంబ సభ్యులతో పవన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని కిరణ్ వివరించాడు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనకు తీర్మానం
తనపై దాడిచేసిన విజయకుమార్‌పై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా పూడిమడకలో 21న మత్స్యకారులు సమావేశమయ్యారు. తంతడి, వాడపాలెం, లోవపాలెం, ముత్యాలమ్మపాలెం, పూడిమడకకు చెందిన పలువురు మత్స్యకారులు సమావేశమయ్యారు. మత్స్యకార యువకుడు కిరణ్‌పై దాడికి పాల్పడ్డ సుందరపు విజయకుమార్‌ను అరెస్టుచేయాలని, పార్టీ నుంచి తొలగించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామంటూ సమావేశంలో తీర్మానించారు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అండగా నిలవడంపట్ల మత్స్యకార కుటుంబాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment