నరసాపురం గోదావరి పాయవద్ద సముద్రంలో వేటకు పంపడానికి సిద్దంగా ఉంచిన బోట్లు
సాక్షి, నరసాపురం: నరసాపురం తీరం నెలరోజులుగా మత్స్యసిరితో అలరారుతోంది. రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతోంది. నిషేధం అనంతరం వేట ప్రారంభించిన మత్స్యకారుల పంట పండుతోంది. బోట్లు మత్స్యసిరితో నిండిపోతున్నాయి. సాదారణంగా వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లిన బోటు చేపలతో నిండడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. అయితే కొన్ని రోజులుగా ఇలా వేటకు వెళ్లినబోటు అలా నాలుగైదు రోజుల్లోనే తీరానికి చేరుకుంటోందని మత్ప్యకారులు చెబుతున్నారు. గత నెలరోజుల్లోనే తీరంలో దాదాపు రూ.300 కోట్ల విలువచేసే మత్స్యసంపద దొరికినట్టు అంచనా. గత ఏడాది కూడా జూన్, జూలై నెలల్లో పెద్ద ఎత్తున చేపలు దొరికాయి. కానీ గత ఏడాదికి మించి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎలాంటి విపత్తులూ లేకుండా ప్రకృతి కూడా కరుణించడంతో ముమర్మంగా వేటసాగుతోంది. ప్రస్తుతం తీరంలో వందల సంఖ్యలో మెకనైజ్డ్‌బోట్లు, ఫైబర్‌బోట్లు వేటసాగిస్తున్నాయి.
మరెక్కడాలేని విధంగా..
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ తీరంతో సహా మరెక్కడా లేని విధంగా నరసాపురం తీరంలోనే అపార మత్స్య సంపద లభిస్తోంది. దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా నరసాపురం తీరానికి బోట్లు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల వరదనీరు సముద్రంలో కలుస్తుండడంతో నీటిపోటుకు మత్స్యసంపద పైకితేలుతోందని, అందుకే భారీగా వలలకు దొరకుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇదికాక ఎగువప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా, నరసాపురం తీరంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల సముద్రగర్భం ఇబ్బందికరంగా మారడంతో జలచరాలు పైకితేలడం వల్లే సులువుగా వలలకు చిక్కుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
30 రోజుల్లో రూ 300 కోట్లపైనే వ్యాపారం
కేంద్ర ప్రభుత్వం సముద్రంలో ఏటా 61 రోజులపాటు వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇటీవలే జూన్ 15వ తేదీతో వేట నిషేధ కాలం ముగిసింది. వేట నిషేధం గడువు ముగిసి నెల దాటింది. నరసాపురం తీరంలో ఈ నెల రోజుల్లో రూ.300 కోట్ల విలువైన మత్స్య సంపద లభించినట్టు సమాచారం. సందువా, సొర, మాగ, పండుగొప్ప రకాల చేపలు, గుడ్డు పీతలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక టైగర్ రకానికి చెందిన రొయ్యలూ దొరుకుతున్నాయి. ఈ రొయ్యిలను సీడ్ ఉత్పత్తి నిమిత్తం ముంబయ్, పూణెల్లోని పరిశోధనా కేంద్రాలకు పంపుతారు. దీంతో ఎగుమతిదారులు ఇటు నరసాపురం అటు అంతర్వేది రేవులకు చేరుకుని మత్స్యసంపదను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు.
ఇతర జిల్లాల బోట్లూ హల్‌చల్
నరసాపురం తీరంలో నిత్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరకడంతో ఇతర జిల్లాల నుంచి కూడా బోట్లు తరలి వస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలకు చెందిన బోట్లు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుని వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ తీరంలో 150 నుంచి 200 వరకూ బోట్లు వేట సాగిస్తున్నాయి.
ఎగుమతులు పెరిగాయి
మత్స్య ఎగుమతులు భారీగా పెరిగాయి. నెలరోజుల నుంచి నరసాపురం తీరంలో రూ.వందల కోట్లలో ఎగుమతులు జరుగుతున్నాయి. గత ఏడాది కూడా ఈ సీజన్‌లో పరిస్థితి ఇలాగే ఉంది. కాకపోతే గత సంవత్సరం కంటే రికార్డు స్థాయిలో దిగుబడి పెరిగింది. సందువా, సొర లాంటి రకాల ఎగుమతులు పెరిగాయి.
– మేకల సతీష్, ఆక్వా వ్యాపారి
ఇతర జిల్లాల బోట్లు వస్తున్నాయి
నరసాపురం తీరంలో ముమ్మరంగా వేట సాగుతోంది. ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బోట్లు వస్తున్నాయి. ఇబ్బంది లేకుండా అన్ని బోట్లుకు చేపలు పడుతున్నాయి. సాధారణంగా జూలైలో తుపాన్ల ప్రమాదం ఉంటుంది. వేట సవ్యంగా సాగదు. ఆ ఇబ్బంది కూడా ఈ సారి లేకపోవడంతో వేట లాభసాటిగా మారింది.
– పీతల ప్రసాద్, బోటు యజమాని
Comments
Please login to add a commentAdd a comment