
మొద్దు నిద్రలో ప్రభుత్వం: చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రకృతి విపత్తులతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని.. పాలకులు మొద్దునిద్ర వీడటం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు వచ్చిన ఆయన నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. శనివారం ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన మొదట నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు వద్ద ముంపునకు గురైన వరి పంటను పరిశీలించారు. అక్కడే పలాస ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆయన్ను కలుసుకుని రాష్ట్ర విభజన లేఖ వెనక్కి తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అక్కడి నుంచి బాబు కంచిలి, కేసరపడ, కొజ్జీరియా జంక్షన్, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్నకు చేరుకుని బాధితులతో మాట్లాడారు.
నిలదీసిన బాధితుడు: కంచిలి, కేసరపడ, కొజ్జీరియా జంక్షన్, లొద్దపుట్టిలో పర్యటించిన చంద్రబాబు ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తూ, టీడీపీ గురించి గొప్పలు చెప్పుకోవడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అనపాన కుభేర్‌రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాల సందర్శనకు వచ్చి, రాజకీయాల గురించి మాట్లాడటమేమిటని నిలదీశాడు. మీరు గొప్పగా చెప్పుకొంటున్న జాతీయ రహదారి అభివృద్ధి కారణంగానే తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురైందని గట్టిగా చెప్పడంతో బాబు కంగుతిన్నారు.
బాధితులను ఆదుకోవటంలో విఫలం
విశాఖపట్నం: పై-లీన్ తుపాను నుంచితేరుకోకముందే ప్రస్తుత వర్షాలు ఉత్తరాంధ్రను మ రింత కుంగదీశాయని, బాధితులకు సహాయ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతూ ఆయన శనివారం విశాఖ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు.