మిచాంగ్‌ గుణపాఠం | Sakshi Editorial On Cyclone Michaung | Sakshi
Sakshi News home page

మిచాంగ్‌ గుణపాఠం

Published Thu, Dec 7 2023 12:01 AM | Last Updated on Thu, Dec 7 2023 4:25 AM

Sakshi Editorial On Cyclone Michaung

ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడల్లా మనిషి చేసిన, చేస్తున్న పాపాలు బయటపడతాయి. అంతవరకూ పాలకులు రూపొందించిన విధానాల్లోని వైఫల్యాలు బట్టబయలవుతాయి. తీవ్ర తుపానుగా పరిగణించిన మిచాంగ్‌ నాలుగురోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను వణికించింది. దాని ధాటికి చెన్నై నుంచి తమిళ తీరప్రాంతాలతో మొదలుపెట్టి దక్షిణాంధ్ర జిల్లాలన్నీ తడిసిముద్దయ్యాయి. కోస్తా జిల్లాలు సైతం వర్షాలతో సతమతమయ్యాయి. పంటలు దెబ్బ తిన్నాయి. చెన్నైలో గత 47 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత స్థాయిలో భారీ వర్షం కురిసింది.

నగరం నగరమంతా వరదనీటిలో తేలియాడింది. వివిధ ఘటనల్లో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకూ 2015 నాటి కుంభవృష్టే రికార్డు. ఈ ఏడాది చిన్నా పెద్దా స్థాయిలో దేశం ఆరు తుపాన్లనూ, వాటి దుష్పరిణామాలనూ చవిచూసింది. మొన్న జూన్‌లో గుజరాత్, మహా రాష్ట్రల్లో బిపర్జయ్‌ తుపాను సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఆకాశాన్నంటే భవంతులతో, రోడ్లపై నిరంతరం రివ్వుమంటూ దూసుకుపోయే వాహనాలతో, అరచేతిలో ఇమిడే సెల్‌ఫోన్‌తో దేన్నయినా క్షణాల్లో పొందగల వెసులుబాటు వగైరాలతో అత్యద్భుతంగా కనబడే నగరాలు, పట్టణాలు చినుకుపడితే నరకాన్ని తలపిస్తాయి.

అటువంటిది కనీవినీ ఎరుగని రికార్డు స్థాయి కుంభవృష్టి పడితే ఇక చెప్పేదేముంది? కేవలం ఆది, సోమ వారాల్లో రాత్రింబగళ్లు కురిసిన వర్షపాతం ఏకంగా 35 సెంటీమీటర్లంటే పరిస్థితి ఎలావుందో ఊహించుకోవచ్చు. శివారుల్లో వున్న చెరువులు, రిజర్వాయర్లు, అడయార్, కూవమ్ నదులు, బకింగ్‌హామ్ కాల్వ పూర్తిగా నిండి వరద జలాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా అన్ని హైవేలు, సబ్‌వేలు మూతబడక తప్పలేదు. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రముఖులు నివాసం ఉండే పొయెస్‌ గార్డెన్‌ రోడ్డు ఏడడుగుల మేర కుంగిపోయి అందులో ట్రాన్స్‌ఫార్మర్లు, వాహనాలు కూరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు.

వాతావరణ విభాగం చెబుతున్న ప్రకారం మిచాంగ్‌ గత తుపానులకు భిన్నమైనది. సాధారణంగా తీరానికి సుదూరంగా తుపాను తిరుగాడుతుంది. కానీ ఈసారి తీరానికి 90 కిలోమీటర్ల దూరంలోనే మిచాంగ్‌ లంగరేసింది. పైగా అది చాలా నెమ్మదిగా... అంటే గంటకు 5–7 కిలోమీటర్ల మధ్య వేగంతో కదిలింది. తుపాను వేగం సాధారణంగా గంటకు 10–18 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీరానికి దగ్గరగా వుండి మందకొడిగా కదలటం వల్ల విడవకుండా భారీ వర్షాలు కురిశాయి.

2015లో చెంబరామ్బాక్కమ్ సరస్సు, పూండి రిజర్వాయర్‌ల నుంచి ఒక్కసారి భారీయెత్తున నీటిని విడుదల చేసిన పర్యవసానంగా చెన్నై నీట మునిగింది. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఒక క్రమపద్ధతిలో నీరు వదిలినా మిచాంగ్‌ తీవ్రత కారణంగా ఇంచుమించు అప్పటి పరిస్థితే ఏర్పడింది. తీరానికి ఆవల ఉండాల్సిన సముద్రం నగరబాట పట్టిందా అన్నంతగా వరద పోటెత్తింది.

అభివృద్ధి పేరు మీద అన్నిటినీ ఒకేచోట కేంద్రీకరిస్తే వృత్తి ఉద్యోగాల కోసం, చిన్నా చితకా వ్యాపారాల కోసం దూరతీరాల నుంచి సైతం జనం అక్కడికి చేరుకుంటారు. జనాభా అపరిమితంగా పెరుగుంది. నగరీకరణ, పట్టణీకరణ జరుగుతున్నప్పుడు ఆ వంకన భూబకా సురులు ప్రవేశిస్తారు. సరస్సులు, చెరువులు మాయమవుతాయి. కాల్వలు కుంచించుకు పోతాయి. పచ్చటి చెట్లు నేలకొరుగుతాయి. ఎటుచూసినా కాంక్రీట్‌ కీకారణ్యాలే విస్తరిస్తుంటాయి. మన దేశంలోనే కాదు... వేరే దేశాల్లో ఇదే పరిస్థితి. అయితే ఆ దేశాల్లో కాస్త ముందే మేల్కొని అభివృద్ధి వికేంద్రీకరణ వైపు కదిలారు.

కానీ మన దగ్గర ప్రకృతి విలయాలు కళ్ల ముందే కనబడుతున్నా ఆ అంశంపై పాలకులు దృష్టి సారించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఇందుకు ఉదాహరణ. వికేంద్రీకరణతో పాటు విపత్తులు ముంచుకొచ్చినప్పుడు తలెత్తగల సమస్యలను ముందే గుర్తించి అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పరిస్తే ఇబ్బందులు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిగతులు మారాయి. కర్బన ఉద్గారాలు అపరిమితంగా పెరిగిన పర్యవసానంగా భూగోళం వేడెక్కడం, ఆ వేడిమిలో 90 శాతం సముద్రాలకే పోవటం వల్ల వాటి జలాలు వేడెక్కుతున్నాయి. తుపానులకు అదే ప్రధాన వనరు. 

ఈ పరిస్థితుల్లో నగరీకరణ, పట్టణీకరణలపై పునరాలోచించటం, ఇప్పటికే ఉన్న నగరాలు, పట్టణాల్లో ప్రస్తుత స్థితిని మెరుగుపరచటానికి అనుసరించాల్సిన విధానాలకు రూపకల్పన చేయటం అవసరం. పారిస్‌ ఒడంబడికకు అనుగుణంగా అహ్మదాబాద్‌లోని అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఈ విధానాలకు తుదిరూపం ఇచ్చింది. తమిళనాడు సర్కారు దాని ఆధారంగా చెన్నైకు మొన్న జూన్‌లో సవివరమైన ప్రణాళికను రూపొందించింది. 2050కల్లా ఆ నగరాన్ని కర్బన ఉద్గారాల బారి నుంచి రక్షించటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక విధానాన్ని ప్రకటించింది.

నీటి కొరత నివారణ, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు, విద్యుత్‌తో నడిచే బస్సులు వందశాతం ఉండేలా చూడటం, నగరంలో హరితవనాల్ని 35 శాతానికి విస్తరించటం, పకడ్బందీ పారిశుద్ధ్యం, చెన్నై వరద ముంపు బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవటం అందులో కొన్ని. నగర విస్తరణకూ, కాలనీల నిర్మాణానికీ  విచ్చలవిడి అనుమతులీయటం విరమించుకుంటే, డ్రైనేజీ వ్యవస్థల పునర్వ్యవ స్థీకరణకు చర్యలు తీసుకుంటే ప్రతి నగరమూ మెరుగవుతుంది. మిచాంగ్‌ వంటి తీవ్ర తుపానుల వల్ల జరిగే నష్టం కనిష్ఠస్థాయికి పరిమితమవుతుంది. పాలకులు ఈ దిశగా ఆలోచించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement