విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి: మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటిని ముందుగానే గుర్తించేందుకు తగినంత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రకృతి సృష్టించిన బీభత్సంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి విపత్కర సమయాల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఎండీఏ) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పారు. సోమవారమిక్కడ ప్రధాని అధ్యక్షతన ఎన్‌ఎండీఏ ఐదో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మనం ఇక్కడ సమావేశమయ్యాం కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు సతమతమవుతున్నారు. విపత్తు నిర్వహణ సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇటీవలి పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. ఇందులో ఎన్‌ఎండీఏ కీలక పాత్ర పోషించాలి’’ అని అన్నారు.