Disaster Management Agency
-
Andhra Pradesh: ఏపీలో వణికించిన భూకంపం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు ఏపీలో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్లలో సామాన్లు, బీరువాలు ఊగడాన్ని స్పష్టంగా గుర్తించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ఏపీలో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే భూమి కంపించింది. భూప్రకంపనల కారణంగా తిరువూరు రాజుపేటలోని ఓ గృహంలో గోడలు బీటలు వారాయి. సుందరయ్య కాలనీలోని మోటూరు చింతయ్య ఇంట్లోని సామగ్రి కిందపడిపోయింది. భూకంప కేంద్రం తెలంగాణలోని ములుగు జిలా్లలో ఉండగా.. అక్కడ దాని తీవ్రత 5.3గా నమోదైంది. రాష్ట్రంలో రాజమండ్రి వరకు 230 కిలోమీటర్ల మేర వాయువ్య దిశలో దాని ప్రభావం రిక్టర్ స్కేల్‌పై 2.9గా ఉందని అధికారులు తెలిపారు. ఏపీ సేఫ్ జోన్లోనే..రాష్ట్రంలో చాలా స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. 12 స్థాయిలతో కూడిన భూకంప తీవ్రత జాబితాలో ఇక్కడ వచ్చింది రెండో స్థానమేనని పేర్కొన్నారు. దీన్ని ఫీబుల్ స్థాయి అని పిలుస్తారని, ఈ స్థాయిలో భూకంపం సంభవిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రకంపనలు ఎక్కడెక్కడ వచ్చాయంటే..విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కృష్ణాపురం, కొమ్ముగూడెం, దుద్దుకూరు, దాసియ్యపాలెం, వేలేరుపాడు, రుద్రమకోట, కన్నాయిగుట్ట, కుక్కునూరు మండలం సీతారామనగరం, వేలేరు, శ్రీధర్, ఉప్పేరు, కుక్కునూరు, రాజానగరం, మాధవరం, కొయ్యలగూడెం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, చాట్రాయి మండలం, ఆగిరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ప్రకాశం జిల్లా ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, క్రోసూరు తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. -
వరద ముంపులో ఏపీకి ఆరో స్థానం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో వరదలు, తుపాన్ల వల్ల ముంపునకు గురవుతున్న రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా మొదటి స్థానంలో నిలిచిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెల్లడించింది. 1998 నుంచి 2022 వరకు వివిధ రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, తుపాన్ల వల్ల జరిగిన నష్టాలను తెలియజేసింది. దేశంలో అత్యధికంగా బిహార్ రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 26 లక్షల హెక్టార్లు, అస్సాంలో 24 లక్షల హెక్టార్లు, పశ్చిమబెంగాల్లో 19 లక్షల హెక్టార్లు, ఒడిశాలో 14 లక్షల హెక్టార్లు, ఏపీలో 8 లక్షల హెక్టార్లలోని ప్రాంతాలు తుపాన్లు, వరదల వల్ల నీటమునిగాయని వెల్లడించింది. ఏపీలో అయితే బాపట్ల, నెల్లూరు జిల్లాలే అత్యధికంగా నీట మునిగాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 1.11 లక్షల హెక్టార్ల భూమి ముంపునకు గురైందని పేర్కొంది. ఈ నదులపై తీవ్ర ప్రభావంఎడతెగని వర్షాలతో పాటు ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వీర్యం, ప్రతికూల వాతావరణం, మారుతున్న భూ వినియోగ విధానాలు, పెరుగుతున్న జనాభా తదితరాల వల్లే వరదలు సంభవిస్తున్నాయని తెలిపింది. గడిచిన 25 ఏళ్లలో భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో ప్రవాహం పెరిగి.. తరుచూ వరదలు సంభవిస్తున్నాయని పేర్కొంది. రుతుపవనాలు, అల్పపీడనాలు కూడా ఏపీలో వరదలకు దోహదం చేస్తున్నాయని తెలిí³ంది.తీవ్ర విషాదం మిగిల్చిన దివిసీమ ఉప్పెన1977లో సంభవించిన దివిసీమ(కృష్ణాజిల్లా) ఉప్పెన తీవ్ర విషాదాన్ని మిగిల్చి0ది. వేలాది మంది ప్రాణా లు కోల్పోయారు. ఈ ఉప్పెన.. అంతర్జాతీయ దాత ల దృష్టిని సైతం ఆకర్షించిందని నివేదిక వెల్లడించింది. 1979, 1990, 1996 తుపానులు కూడా ఇలాంటివేనని.. అవన్నీ మరిచిపోయే తుపానులు కాదని జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొంది. -
నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండ మంటలు చల్లారడం లేదు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యంలో 8, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లాలో 21, ప్రకాశం 18, ఏలూరు 18, తూర్పుగోదావరి 17, నెల్లూరు 16, గుంటూరు 16, అనకాపల్లి 15, శ్రీకాకుళం 15, కాకినాడ 13, తిరుపతి 12, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, బాపట్ల 11, విజయనగరం 10, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, పార్వతీపురం మన్యం 7, వైఎస్సార్ 5, విశాఖపట్నం 1, అనంతపురం 1, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 121 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. నిప్పులుగక్కిన ఎండ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కూడా ఎండ నిప్పులుగక్కింది. పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగానెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. 21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. -
మూడు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44నుంచి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల పలుచోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొవిలంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4 ఉష్ణోగ్రత రికార్డయింది. తుమ్మికపల్లి (విజయనగరం)లో 45.2, రావికమతం (అనకాపల్లి)లో 45.1, మక్కువ (పార్వతీపురం మన్యం)లో 44.4, గోస్పాడు (నంద్యాల)లో 44.3 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. 88 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 89 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. కాగా.. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 175 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం 18, పార్వతీపురం మన్యం 12, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 15, కోనసీమ 9, తూర్పు గోదావరి 18, పశ్చిమ గోదావరి 18, ఏలూరు 13, కృష్ణా 10, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 22, బాపట్ల 2, ప్రకాశం 8, ఎస్పీఎస్సార్ నెల్లూరు 1, తిరుపతి జిల్లాలో 3 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. తీవ్ర వడగాడ్పులకు అవకాశం గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోను, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో, ఈనెల 20న అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. తీవ్ర వడగాడ్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
భగ్గుమంటున్న భానుడు
సాక్షి, విశాఖపట్నం: అదుపు తప్పుతున్న ఉష్ణోగ్రతలతో భానుడు భగ్గుమంటున్నాడు. రానున్న రెండు రోజులు మరింతగా ఉగ్రరూపం దాల్చనున్నాడు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇన్నాళ్లూ రాయలసీమలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డయ్యాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో అంతకు మించి నమోదు కానున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం శుక్ర, శనివారాల్లో రాయలసీమలోని వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీలు, దక్షిణ కోస్తాలోని పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 41నుంచి 44, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 41నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 109 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 206 మండలాల్లో వడగాడ్పులు, శనివారం 115 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. చాగలమర్రిలో 44.1 డిగ్రీలు కాగా, గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నచెప్పల్లి (వైఎస్సార్)లో 43.9, లద్దగిరి (కర్నూలు)లో 43.8, దరిమడుగు (ప్రకాశం)లో 43.6, తెరన్నపల్లి (అనంతపురం)లో 43.5, మనుబోలు (నెల్లూరు), చియ్యవరం (తిరుపతి)లలో 43.2, కుటగుల్ల (శ్రీసత్యసాయి)లో 43.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 97 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడు రోజులు వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. -
రేపు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపటికి(నవంబర్ 15కల్లా) పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకావం కనిపిస్తోంది. వాయవ్య దిశగా పయనించి.. 16వ తేదీ నాటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కనిపించనుంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. కోస్తాంధ్ర తీరంలో వర్షాల నేపథ్యంలో.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. -
ఏపీ విపత్తుల నిర్వహణ టెక్నాలజీ అత్యున్నతం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ విధానాలు, పని తీరు బాగున్నాయని, సాంకేతికత అత్యున్నతంగా ఉందని, వాటిని తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఉత్తరప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ చంద్రకాంత్ చెప్పారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐటీ నిపుణుడు ప్రశాంత్ షాహి తదితరులతో కలిసి ఆయన తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థను ఆధునికీరిస్తున్న క్రమంలో దేశానికే రోల్ మోడల్‌గా ఉన్న ఏపీ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం రెండు రోజుల క్రితం ఇక్కడకు వచ్చింది. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సాంకేతికతను, దాన్ని వినియోగిస్తున్న తీరును నిశితంగా పరిశీలించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వారికి స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్లోని అన్ని విభాగాలను చూపించి, పని విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో తుఫానులు, వరదలతోపాటు పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం విపత్తుల నిర్వహణ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసిందని తెలిపారు. తుపాను, వరద వచ్చే అవకాశం ఉందని తెలిసిన వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయ స్థాయి వరకు ఉన్న విపత్తుల నిర్వహణ బృందాలు క్షేత్ర స్థాయిలో పని ప్రారంభిస్తాయని వివరించారు. ఈ అప్రమత్తత వల్లే నాలుగేళ్లలో తుపానులు, వరదలొచ్చినా ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. వాతావరణ పరిశోధన విభాగాలు, వివిధ వాతావరణ మోడల్స్, కార్యాచరణ ప్రణాళికలు, కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి అంబేడ్కర్ వారికి వివరించారు. కామన్ అలెర్ట్ ప్రొటోకాల్, ఏపీ అలెర్ట్ ద్వారా ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌లు పంపేవిధానాన్ని వివరించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్ తదితర పరికరాలను చూపారు. వెబ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి వివరించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఈడీ నాగరాజు, రిటైర్డ్ సైంటిస్ట్ అలీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ద్రోణి– వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/పెళ్లకూరు(తిరుపతి జిల్లా)/ ఒంగోలు: తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్ కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపుల వర్షంతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ఎవరూ చెట్ల కింద ఉండకూడదని తెలిపారు. కాగా, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పునబాక గ్రామ సమీపంలోని ఓ పొలంలో నాట్లు వేస్తున్న కృష్ణా జిల్లా రామాపురం గ్రామానికి చెందిన జల్ల వీరలంకయ్య(49) పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాడు. అలాగే అదే మండలంలో రెండు ఆవులు, ఓ దూడ మృతి చెందాయి. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం మిరియంపల్లి గ్రామానికి చెందిన రైతు రావెళ్ల పుల్లయ్య (73) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండంలో పిడుగుపడి 15 గొర్రెలు చనిపోయాయి. -
14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (నేడు)14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆ.. మండలాలివే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ, అడ్డతీగల, అనకాపల్లి జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కాకినాడ జిల్లాలో కోటనంమూరు, పల్నాడు జిల్లాలో అమరావతి, పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపు కోట మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 16, నంద్యాలలో 12, అనకాపల్లిలో 11, పల్నాడులో 11, వైఎస్సార్‌లో 11, పార్వతీపురం మన్యంలో 9, విజయనగరంలో 8 మండలాలతో పాటు మిగిలిన చోట్ల మొత్తం 102 మండలాల్లో వడ గాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. -
విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి: మన్మోహన్సింగ్
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటిని ముందుగానే గుర్తించేందుకు తగినంత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రకృతి సృష్టించిన బీభత్సంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి విపత్కర సమయాల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఎండీఏ) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పారు. సోమవారమిక్కడ ప్రధాని అధ్యక్షతన ఎన్ఎండీఏ ఐదో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మనం ఇక్కడ సమావేశమయ్యాం కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు సతమతమవుతున్నారు. విపత్తు నిర్వహణ సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇటీవలి పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. ఇందులో ఎన్ఎండీఏ కీలక పాత్ర పోషించాలి’’ అని అన్నారు.