ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలో భూ ప్రకంపనలకు గోడపై ఏర్పడిన బీటలు
ఏపీలో తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.9గా నమోదు
తెలంగాణలో 5.3గా నమోదు
ప్రమాదం లేదన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు ఏపీలో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్లలో సామాన్లు, బీరువాలు ఊగడాన్ని స్పష్టంగా గుర్తించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ఏపీలో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో పలుచోట్ల రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే భూమి కంపించింది. భూప్రకంపనల కారణంగా తిరువూరు రాజుపేటలోని ఓ గృహంలో గోడలు బీటలు వారాయి. సుందరయ్య కాలనీలోని మోటూరు చింతయ్య ఇంట్లోని సామగ్రి కిందపడిపోయింది. భూకంప కేంద్రం తెలంగాణలోని ములుగు జిలా్లలో ఉండగా.. అక్కడ దాని తీవ్రత 5.3గా నమోదైంది. రాష్ట్రంలో రాజమండ్రి వరకు 230 కిలోమీటర్ల మేర వాయువ్య దిశలో దాని ప్రభావం రిక్టర్ స్కేల్‌పై 2.9గా ఉందని అధికారులు తెలిపారు.
ఏపీ సేఫ్ జోన్‌లోనే..
రాష్ట్రంలో చాలా స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. 12 స్థాయిలతో కూడిన భూకంప తీవ్రత జాబితాలో ఇక్కడ వచ్చింది రెండో స్థానమేనని పేర్కొన్నారు. దీన్ని ఫీబుల్ స్థాయి అని పిలుస్తారని, ఈ స్థాయిలో భూకంపం సంభవిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
ప్రకంపనలు ఎక్కడెక్కడ వచ్చాయంటే..
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కృష్ణాపురం, కొమ్ముగూడెం, దుద్దుకూరు, దాసియ్యపాలెం, వేలేరుపాడు, రుద్రమకోట, కన్నాయిగుట్ట, కుక్కునూరు మండలం సీతారామనగరం, వేలేరు, శ్రీధర్, ఉప్పేరు, కుక్కునూరు, రాజానగరం, మాధవరం, కొయ్యలగూడెం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, చాట్రాయి మండలం, ఆగిరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ప్రకాశం జిల్లా ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, క్రోసూరు తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
Comments
Please login to add a commentAdd a comment