ఏపీ విపత్తుల నిర్వహణ టెక్నాలజీ అత్యున్నతం | AP disaster management technology is top | Sakshi
Sakshi News home page

ఏపీ విపత్తుల నిర్వహణ టెక్నాలజీ అత్యున్నతం

Published Thu, Aug 31 2023 4:11 AM | Last Updated on Thu, Aug 31 2023 4:00 PM

AP disaster management technology is top  - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ విధానాలు, పని తీరు బాగున్నాయని, సాంకేతికత అత్యున్నతంగా ఉందని, వాటిని తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఉత్తరప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ చంద్రకాంత్‌ చెప్పారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐటీ నిపుణుడు ప్రశాంత్‌ షాహి తదితరులతో కలిసి ఆయన తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థను ఆధునికీరిస్తున్న క్రమంలో దేశానికే రోల్‌ మోడల్‌గా ఉన్న ఏపీ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం రెండు రోజుల క్రితం ఇక్కడకు వచ్చింది.

స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సాంకేతికతను, దాన్ని వినియోగిస్తున్న తీరును నిశితంగా పరిశీలించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వారికి స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని అన్ని విభాగాలను చూపించి, పని విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో తుఫా­నులు, వరదలతోపాటు పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం విపత్తుల నిర్వహణ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసిందని తెలిపారు.

తుపాను, వరద వచ్చే అవకాశం ఉందని తెలిసిన వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయ స్థాయి వరకు ఉన్న విపత్తుల నిర్వహణ బృందాలు క్షేత్ర స్థాయిలో పని ప్రారంభిస్తాయని వివరించారు. ఈ అప్రమత్తత వల్లే  నాలుగేళ్లలో తుపానులు, వరదలొచ్చినా ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. వాతావరణ పరిశోధన విభా­గాలు, వివిధ వాతావరణ మోడల్స్, కార్యాచరణ ప్ర­ణాళికలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల గురించి అంబేడ్క­ర్‌ వారికి వివరించారు.

కామన్‌ అలెర్ట్‌ ప్రొటోకాల్, ఏపీ అలెర్ట్‌ ద్వారా ప్రజల మొబైల్‌ ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌లు పంపేవిధానాన్ని వివరించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్‌ ఫోన్స్, శాటిలైట్‌ బేస్డ్‌ మొబైల్‌ డేటా వాయిస్‌ టెర్మినల్‌ తదితర పరికరాలను చూపారు. వెబ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్, జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ గురించి వివరించారు.  కార్యక్రమంలో  విపత్తుల నిర్వహణ సంస్థ ఈడీ  నాగరాజు, రిటైర్డ్‌ సైంటిస్ట్‌ అలీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement