నేడు, రేపు అసాధారణ సెగలు
ఉత్తర కోస్తాపై అధిక ప్రభావం
42నుంచి 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం
109 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: అదుపు తప్పుతున్న ఉష్ణోగ్రతలతో భానుడు భగ్గుమంటున్నాడు. రానున్న రెండు రోజులు మరింతగా ఉగ్రరూపం దాల్చనున్నాడు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇన్నాళ్లూ రాయలసీమలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డయ్యాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో అంతకు మించి నమోదు కానున్నాయి.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం శుక్ర, శనివారాల్లో రాయలసీమలోని వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీలు, దక్షిణ కోస్తాలోని పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 41నుంచి 44, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 41నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 109 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 206 మండలాల్లో వడగాడ్పులు, శనివారం 115 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి.
చాగలమర్రిలో 44.1 డిగ్రీలు
కాగా, గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నచెప్పల్లి (వైఎస్సార్)లో 43.9, లద్దగిరి (కర్నూలు)లో 43.8, దరిమడుగు (ప్రకాశం)లో 43.6, తెరన్నపల్లి (అనంతపురం)లో 43.5, మనుబోలు (నెల్లూరు), చియ్యవరం (తిరుపతి)లలో 43.2, కుటగుల్ల (శ్రీసత్యసాయి)లో 43.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 97 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడు రోజులు వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment