ఎమ్మెల్యేలకు వేతన భాగ్య | Salary increases by Rs 95 thousand | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు వేతన భాగ్య

Published Tue, Dec 16 2014 1:58 AM | Last Updated on Fri, Jun 1 2018 7:35 PM

Salary increases by Rs 95 thousand

రూ.95 వేలకు  పెరగనున్న జీతభత్యాలు
 
బెంగళూరు: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కుర్చున్నట్లుంది రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల వ్యవహారం. ఒక వైపు ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా పంట నష్ట పోయిన రైతులు, మరోవైపు ఏడాది క్రితం అమ్మిన చెరుకుకు సంబంధించిన రైతు బకాయిలు ఇప్పటికి అందక ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం అవేమి పట్టనట్లు వేతన భత్యాల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఫలితం కూడా పొందబోతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రస్తుతం బెళగావిలో జరుగుతున్న శీతాకాల శాసనసభ సమావేశాల చివరి రోజున ప్రజాప్రతినిధుల జీతభత్యాల పెంపునకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం శాసనసభ్యులకు రూ.20వేల వేతనంతోపాటు నెలకు ఫోన్‌బిల్ కోసం రూ.15వేలు, క్షేత్రస్థాయి పర్యటనకు రూ.15 వేలు, పోస్టల్ ఖర్చులు రూ.5 వేలు, ఇతరత్రాలు రూ.10 వేలతో కలుపుకుని మొత్తంగా రూ. 65 వేలు అందుకుంటున్నారు.  గత బెళగావి శాసనసభ సమావేశాల సందర్భంగా శాసనసభ్యుడు బి.ఆర్. పాటిల్ వేతన భత్యాల పెంపునకు సంబంధించి సభాసలహా సమితికి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారు.

ఇందుకు కొంతమంది తమ మద్దతును కూడా తెలియజేశారు. ఈ మేరకు శాసనసభ్యుల జీతభత్యాల పెంపుకు సంబంధించిన దస్త్రం కూడా చకచకా తయారై పోయింది.  అయితే స్పీకర్ కాగోడు తిమ్మప్ప అడ్డుపడి ఇలా హడావుడిగా వేతన పెంపుపై నిర్ణయం తీసుకోవడం సరికాదని సర్ది చెప్పారు. పొరుగురాష్ట్రాల్లో అక్కడి శాసనసభ్యులకు ఎంతెంత వేతనం ఇస్తున్నారో తెలియజేయాల్సిందిగా సంబంధిత  అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసి వివరాలను తెప్పించుకున్న అధికారులు నివేదికను తయారు చేసి స్పీకర్‌కు అందజేశారు.

రూ.95 వేలకు పెరగనున్న జీతభత్యాలు!
 
ప్రస్తుతం గోవా రాష్ట్రంలో అక్కడి శాసనసభ్యులు రూ.1.2 లక్షలను వేతన భత్యాల రూపంలో అందుకుంటుండగా తమిళనాడులో రూ.55వేలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. లక్ష, కేరళలో రూ.39,500, ఢిల్లీలో రూ.40 వేలను జీతభత్యాల రూపంలో అందుకుంటున్నారు. వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భౌగోళిక, జీవన వ్యయం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కర్ణాటక శాసన సభ్యుల జీత భత్యాలను రూ.65 వేల నుంచి రూ.95వేలకు పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఈ విషయమై ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు మాట్లాడుతూ ‘శాసనసభ్యుల జీత భత్యాల పెంపునకు సంబంధించిన దస్త్రం ఇప్పటికే తయారైంది. శీతాకాల సమావేశాల చివరి రోజున ఉభయసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి అనుమతి తీసుకుంటాం. ఏ పార్టీ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించరని భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement