అవినీతి తుఫాన్
‘హుద్‌హుద్’ పేరుతో భారీ అక్రమాలు
తప్పుడు అంచనాలతో సొమ్ములు తినేసే ప్రణాళికలు
‘వుడా కైలాసగిరి’ లోగో పునరుద్ధరణకే రూ.1.10 కోట్లు
పార్కులు, ప్రభుత్వ భవనాలకు అత్యధికంగా ఖర్చు
ఔరా.. అనిపించేలా అధికారుల నివేదికలు
విశాఖపట్నం: హుద్‌హుద్.. విశాఖ వాసులకు కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యం.. కొన్ని గంటల్లోనే వి శాఖ రూపు రేఖలు మార్చేసిన భారీ తుఫాన్.. భవిష్యత్ తరాలు కథలు, కథలుగా చెప్పుకునేంత పెను విపత్తు.. అయితేనేం ప్రజల మరోధైర్యం ముందు తలవంచింది. వారం పది రోజులు తిండికి, తాగునీటికి అలమటించినా, వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా అతి త్వరలోనే నగరం మళ్లీ నిలబడింది. దాతలు ఇచ్చిన ఉదార విరాళాలు, స్థానికుల శ్రమదానం, నిబద్ధతలతో విశాఖ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కానీ ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. విశాఖ కోలుకోవడానికి తాము చేసిన భారీ ఖర్చు కారణమని చూపిస్తూ కనిపించని అవినీతి తుఫాన్ సృష్టించారు. నివేదికల్లో తప్పుడు లెక్కలు చూపించి వుడా అధికారులు సొమ్ములు దండుకుంటున్నారు. నగరం మునుపటి స్థితికి చేరడంతో తమ దర్జాగా దోచుకుతింటున్నారు.
చకచకా సొమ్ములొచ్చే పనులు
హుద్‌హుద్ 48మందిని పొట్టనపెట్టుకుంది. 122మందిని గాయాలపాలు చేసింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరంలోని కట్టడాలను కకావికలం చేసేశాయి. వాటిని పునరుద్ధరించడానికి అధికారులు అంచనాలు రూపొందించారు. దాని ప్రకారం అనేక పనులు పూర్తి చేయగా, మరికొన్ని జరుగుతున్నాయి. ఇంకొన్నిటికి టెండర్లు పిలిచారు. తుపాను వల్ల దెబ్బతిన్న 1,46,799 సామాన్యుల గృహాలను తిరిగి కట్టిచ్చేందుకు ఆసక్తి చూపని ప్రభుత్వం, అధికారులు తమకు ప్రయోజనం కలిగే పనులను మాత్రం చకచకా చేసుస్తున్నారు. అయితే పునరుద్ధరణ, పునఃనిర్మాణ పనులకు చేసిన, చేస్తున్న ఖర్చుల లెక్కలు అధికారుల అవినీతికి అద్దం పడుతున్నాయి.
వారి లెక్కలు ఇవిగో
కైలాసగిరి కొండపై వుడా కైలాసగిరి (వీయూడీఏ కేఏఐఎల్‌ఎస్‌ఏజీఐఆర్‌ఐ-కైలాసగిరి) అనే పేరును దాదాపు రూ.80 లక్షల వ్యయంతో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. తుపాను దెబ్బకు అవి కింద పడిపోయాయి. దీంతో వాటి స్థానంలో కొత్త అక్షరాలను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయాలనుకున్నారు. దానికి రూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ మళ్లీ ఏమనుకున్నారో ఏమో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టేశారు. పడిపోయిన అక్షరాలను నిలబెట్టి సరిపెట్టేశారు. కానీ విచిత్రం ఏమిటంటే రూ.1.10 కోట్లు ఖర్చు అయినట్లుగా రికార్డుల్లో రాసేశారు. ఉన్నవి నిలబెట్టి కొత్త వాటికి చేయాలనుకున్న ఖర్చును ఎలా చూపిస్తున్నారో అంతుచిక్కడం లేదు. దీనిపై వుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను సంప్రదించగా రికార్డుల్లో పొరపాటుగా నమోదైవుంటుందని చెప్పుకొచ్చారు.
దీనిపై ఆరా తీయగా పడిపోయిన అక్షరాలు పునరుద్ధరించడానికి రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అదే ఎక్కువనుకుంటే రికార్డుల్లో కోటీ పది లక్షల రూపాయలు చూపించడం వెనక మతలబు ఏమిటో అర్ధం కావడం లేదు.
అన్నిటిలోనూ ఇదే తీరు
వుడా అధికారులు చేసిన ఖర్చుల లెక్కల ప్రకారం.. బీచ్ రోడ్డులోని కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద చెత్త, ఇసుక తొలగించడానికి, ఎలక్ట్రికల్ పనులకు రూ.54.57 లక్షలు ఖర్చయింది. వుడా పార్కు ముఖద్వారం పక్కన 60 మీటర్ల కాంపౌండ్ వాల్, చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కు పునరుద్ధరణకు రూ.11.43 లక్షలు ఖర్చు చేశారు. రే హౌసింగ్ స్కీం భవనాలకు పగిలిన గాజు అద్దాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి రూ.19.42 లక్షలు వెచ్చించారు. కైలాసగిరి రోప్‌వే ప్రాంతం నుంచి తొట్ల కొండ వరకు పడిపోయిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు రూ.6 లక్షలు ధారపోశారు.
దెబ్బతిన్న గురజాడ కళాకేంద్రం రూఫ్ స్థానంలో కొత్తది నిర్మించడానికి రూ.5.70 కోట్లతో టెండర్లు తుదిదశకు చేరాయి. సిరిపురం వద్ద యుబి కాంప్లెక్స్ ఎలివేషన్ ప్యానెళ్లు, కిటికీ అద్దాలకు రూ.35 లక్షలు ఖర్చు కానుంది. వుడా పరిధిలో విద్యుత్ మెరుగుపరచడానికి రూ.1.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ లెక్కలన్నిటికీ జిల్లా కలెక్టర్ ఆమోదం లభించింది.