కలప అక్రమ రవాణా జిల్లాలో జోరుగా సాగుతోంది. కలప వ్యాపారులు అటవీ భూములు, పట్టాభూముల్లోని చెట్లను యథేఛ్చగా నరికేస్తున్నారు. అటవీశాఖ, రెవెన్యూ అధికారుల
నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకుని విలువైన కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఓ వైపు హరితహారంతో అటవీ విస్తీర్ణం పెంచాలని చూస్తుంటే మరోవైపు కలప వ్యాపారులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడిన కొంత మంది అధికారుల వల్లే కలప అక్రమ వ్యాపారం జిల్లాలో సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.చెట్లను నరికి అక్రమంగా సాగిస్తున్న కలప వ్యాపారంపై సాక్షి ప్రత్యేక కథనం...
సాక్షి, మెదక్: జిల్లాలో అనుమతులు లేకుండా చెట్లు నరికి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, నర్సాపూర్, వెల్దుర్తి, కౌడిపల్లి, శివ్వంపేట, మనోహరాబాద్ మండలాల్లో ఈ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. అటవీ, పట్టా భూముల్లోని టేకు, మద్ది, తుమ్మ, వేప, యూకలిప్టస్, మేడి, సరువు, మామిడి, చింత చెట్లు ఇలా అన్ని రకాల చెట్లను అనుమతులు లేకుండానే నరికేస్తున్నారు. నరికిన అరుదైన వృక్షాలను లారీల ద్వారా హైదరాబాద్, తూప్రాన్, పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలకు , ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
జిల్లాలో 10 మందికిపైగా కలప వ్యాపారులు ఉండగా వీరి వద్ద పనిచేస్తున్న ఏజెంట్లు కలప నరకడం, రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రూ.10 నుంచి రూ.30 లక్షల కలప అక్రమ దందా సాగుతున్నట్లు అంచనా. సెలవు, పండుగ రోజుల్లో పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటాయి. దీన్ని ఆసరా చేసుకుని కలప వ్యాపారులు కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలోని అటవీ, పట్టాభూముల నుంచి అక్రమంగా నరికిన కలపను ఎక్కువగా టింబర్ డిపోలు, ఇటుక బట్టీలు, పరిశ్రమలకు తరలిస్తున్నారు.
నిబంధనలు సడలింపుతో..
చెట్లను సంరక్షించేందుకు ప్రభుత్వం వాల్టా 2002 చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీంతో ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా వందలాది టన్నుల కలప అక్రమ రవాణా జరుగుతోంది. అటవీ చట్టాన్ని అనుసరించి అటవీభూముల్లోని చెట్లను నరకడం నిషేధం. అలాగే పట్టాభూముల్లోని చెట్లను నరకడం, రవాణాకు వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఈ చట్టం ప్రకారం చెట్లు నరికిన చోట మొక్కలను పెంచాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం 26 రకాల చెట్లను నరకడాన్ని నిషేధించింది. అయితే ఇటీవల ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 42 చెట్ల రవాణా అనుమతిస్తూ నిబంధనలను సడలించింది. దీనిని ఆసరా చేసుకుని కలప అక్రమ రవాణా చేసే వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెట్లను నరుకుతూ అక్రమంగా కలప వ్యాపారం సాగిస్తున్నారు.
గ్రామాల నుంచి సామిల్‌కు..
అసైన్డ్ భూములు, పట్టా భూముల్లో మాత్రం చెట్లను అడ్డగోలుగా నరుకుతున్నారు. చింతచెట్టు నరకాలంటే అటవీశాఖ జిల్లా అధికారి అనుమతి తప్పనిసరికాగా తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే లారీలు, ట్రాక్టర్లలో కలప అక్రమ రవాణా జరుగుతుంది. పట్టా, అసైన్డ్ భూముల్లో చెట్లను నరకడానికిగాను సంబంధిత కంట్రాక్టర్ అటవీ సిబ్బందికి మమూళ్లు ఇవ్వాల్సిందే. ఒక్క రామాయంపేట రేంజీ పరిధిలోనే ప్రతిరోజూ పదిహేను లోడ్‌ల కలప రవాణా చేస్తున్నారు. మారుమూల గ్రామాలనుంచి కలప సా మిల్లులకు చేరుతుంది. దీనితో వారు చీకటి పడ్డాక హైదరాబాద్ తరలిస్తున్నారు. తూప్రాన్ సరిహాద్దులో జాతీయ ర«హదారిపై అటవీశాఖ చెక్‌పోస్టు ఉండగా, ఇక్కడ నుంచి జాతీయ రహదారిపై కలప తరలిస్తున్న ప్రతి వాహనానికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందే.
పారిశ్రామిక వాడలకు తరలింపు..
నర్సాపూర్ మండలంలోని చిప్పల్‌తుర్తి, అచ్చంపేట, నత్నాయిపల్లి, ఎల్లాపూర్, బ్రాహ్మాణపల్లి తదితర గ్రామాలను ఆనుకుని ఉన్న అడవులలో చెట్లను నరికి కలపను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల, తిమ్మాపూర్, పాంబండ గ్రామాలు అడవులను ఆనుకుని ఉన్నందున అడవుల నుంచి కలప నరికి మేడ్చల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన కంపెనీలకు రవాణా చేస్తున్నారు. కొత్తపేట ప్రాంతంలో ఇటుక బట్టీలు ఎక్కువగా చేపడుతూ అడవిలోని చెట్లను నరికి బట్టీలకు వినియోగిస్తున్నారు. కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్ గ్రామ పంచాయితీలోని గిరిజన తండాలతో పాటు కౌడిపల్లి కొల్చారం మధ్య ఉన్న అడవి నుంచి చెట్లను నరికి కలపను పారిశ్రామిక వాడలకు రవాణా చేస్తుంటారు. ఇటీవల శివ్వంపేట మండలంలోని కొత్తపేట నుంచి కలపను అక్రమంగా చేస్తున్న లారీ నర్సాపూర్త్‌లో బోల్తా పడింది. కలప లారీకి ఎలాంటి అనుమతులు లేకపోయినా లారీపై కేసు నమోదు చేయకుండానే వదిలివేయడం పోలీసు ల తీరుపై అనుమానాలకు తావిస్తోంది.
కఠిన చర్యలు తప్పవు
అక్రమంగా అటవీభూములు, పట్టాభూముల్లో చెట్లు నరికి అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో కలప రవాణా కేసులు తక్కువగానే ఉన్నాయి. అటవీ అధికారులు మామూళ్లు తీసుకుని కలప రవాణాకు అనుమతిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాప్తవం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కలప అక్రమ రవాణాకు సంబంధించి 40 కేసులు పెట్టాం. అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు తప్పవు. వాల్టా చట్టం ప్రకారం ముందుస్తు అనుమతి తీసుకుని చెట్లు నరకడం లేదా రవాణా చేయాలని తెలిపారు.
– పద్మజారాణి, డీఎఫ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment