valta law
-
వాల్టా చట్టంలో మార్పులు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో భూగర్భ జలాల వినియోగంపై కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వాల్టా చట్టంలోనూ మార్పులు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై నిర్ణీత చార్జీలు వసూలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. తాగునీటి అవసరాలు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాలకు ఎలాంటి చార్జీలను విధించకూడదని స్పష్టం చేశారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఈ చార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, వాటర్‌షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అర్థిక క్రమశిక్షణ తప్పింది: కాగ్
-
‘వాల్టా’తో బోరు బావులకు చెక్ !
భూగర్భ జలాలు బాగా అడుగంటిన గ్రామాల్లో వాల్టా చట్టం అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,227 గ్రామ పంచాయతీల్లో వాల్టా చట్టం – 2002 అమలులో ఉంటుందంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జనవరి 25న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలోని 18 గ్రామాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన గ్రామాల్లో కొత్తగా వ్యక్తిగత బోర్లు, బావుల తవ్వకాలపై ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న బోర్లు, బావుల నుంచి నీటి తోడకంపైనా ఆంక్షలు ఉంటాయి. వాల్టా చట్టంలోని ఛాప్టర్ – 3 సెక్షన్ 8 (2) ప్రకారం బోర్లు, బావుల నుంచి నీటి తోడకానికి ఉపయోగించే మోటార్లకు విద్యుత్ వినియోగంపైన ఆంక్షలు వర్తిస్తాయి. ఈ చట్టం అమలయ్యే గ్రామాల పరిధిలోని ఇసుక తవ్వకాలపైన కూడా నిషేధం ఉంటుంది. సామూహిక తాగునీటి అవసరాలకు భూగర్భ జల వనరుల శాఖ అధికారుల అనుమతితో మాత్రమే తవ్వకాలకు అవకాశం ఉంటుంది. చిలకలూరిపేట : వాల్లా చట్టం అమలులో ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయా గ్రామాల్లో వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్) చట్టం అమలులో ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షాలు కురవని సందర్భాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువుకాటకాలు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రోజువారీ అవసరాల కోసం మనుషులతో పాటు పశువులకు తాగేందుకు సరిపడ నీరు దొరకని పరిస్థితులు ఉంటాయి. చెరువులు, వాగులు ఎండిపోవటంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి ప్రమాదాన్ని అంచనా వేసి ముందస్తు చర్యల్లో భాగంగా వాల్టా చట్టాన్ని ఆయా గ్రామాలలో అమలు చేస్తుంటారు. అమలుకాని మార్గదర్శకాలు.. ఆయా గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరాయని, భవిష్యత్‌లో నీటి కష్టాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని భూగర్భ జల వనరుల శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో గత ఏడాది ఫిబ్రవరిలో 16.728 మీటర్ల అడుగున ఉన్న నీటి నిల్వలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 22.435 మీటర్లకు దిగజారాయి. మాచర్లలో 19.327 మీటర్ల అడుగున ఉన్న జలాలు ఈ ఏడాది 31.202 మీటర్ల అడుగుకు పడిపోయాయి. భూగర్భ జలాల వినియోగంపై సుప్రీం కోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం బోరు వేయటానికి 15 రోజుల ముందు సంబంధిత యజమాని భూగర్భ జల వనరుల అధికారులకు సమాచారం అందజేయాలి. వారి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు బోర్వెల్ తవ్వకం యంత్రాలు కలిగి ఉన్న నిర్వాహకులు విధిగా తమ పేర్లను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. గ్రామాలవారీగా బోర్ల వివరాలు పంచాయతీలు సేకరించాలి. అయితే వీటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోకపోవటంతో అవస్థలు తప్పటం లేదు. జిల్లాలో సుమారు 50 వేల పైచిలుకు బోర్లు ఉన్నాయి. వర్షాభావంతో రైతులు భూగర్భ జలాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో భూగర్భ జలాల లభ్యత అడుగంటుతోంది. పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్లకు సైతం విచ్చలవిడిగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రైవేటు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. విచ్చలవిడిగా వివిధ అవసరాలకు బోర్లు వేయకుండా ప్రజలను చైతన్యం చేయటం ద్వారానే భూగర్భ జలాలు పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాగుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు అధికం అయ్యాయని తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చట్టం ప్రకారం ఇసుక తవ్వకాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామాలలో మాత్రమే భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకొని వాల్టా చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరు మారని పక్షంలో జిల్లాలోని మరెన్నో గ్రామాలకు భూగర్భ జలాల లభ్యత లేకుండాపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటుందా... వాగులు వట్టిపోకుండా ఇసుక రవాణా నియంత్రించి భూగర్భ జలాల పెంపునకు సహకరిస్తుందా అనేది వేచి చూడాలి. తవ్వకాలు చేయరాదు.. సంబంధిత 18 గ్రామాల్లో కొత్తగా బోర్లు, బావుల కోసం ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇసుక తవ్వకాలు చేయరాదు. సామూహిక తాగునీటి అవసరాల కోసం అనుమతితో మాత్రమే కొత్త బోర్లు వేయాల్సి ఉంటుంది. – ఎం. రామ్‌ప్రసాద్, డీడీ, భూగర్భ జల వనరుల శాఖ -
అనుమతులు అనవసరం!.. కట్టె కొట్టు.. శివారు దాటించు..!!
కలప అక్రమ రవాణా జిల్లాలో జోరుగా సాగుతోంది. కలప వ్యాపారులు అటవీ భూములు, పట్టాభూముల్లోని చెట్లను యథేఛ్చగా నరికేస్తున్నారు. అటవీశాఖ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకుని విలువైన కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఓ వైపు హరితహారంతో అటవీ విస్తీర్ణం పెంచాలని చూస్తుంటే మరోవైపు కలప వ్యాపారులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడిన కొంత మంది అధికారుల వల్లే కలప అక్రమ వ్యాపారం జిల్లాలో సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.చెట్లను నరికి అక్రమంగా సాగిస్తున్న కలప వ్యాపారంపై సాక్షి ప్రత్యేక కథనం... సాక్షి, మెదక్: జిల్లాలో అనుమతులు లేకుండా చెట్లు నరికి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, నర్సాపూర్, వెల్దుర్తి, కౌడిపల్లి, శివ్వంపేట, మనోహరాబాద్ మండలాల్లో ఈ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. అటవీ, పట్టా భూముల్లోని టేకు, మద్ది, తుమ్మ, వేప, యూకలిప్టస్, మేడి, సరువు, మామిడి, చింత చెట్లు ఇలా అన్ని రకాల చెట్లను అనుమతులు లేకుండానే నరికేస్తున్నారు. నరికిన అరుదైన వృక్షాలను లారీల ద్వారా హైదరాబాద్, తూప్రాన్, పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలకు , ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 10 మందికిపైగా కలప వ్యాపారులు ఉండగా వీరి వద్ద పనిచేస్తున్న ఏజెంట్లు కలప నరకడం, రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రూ.10 నుంచి రూ.30 లక్షల కలప అక్రమ దందా సాగుతున్నట్లు అంచనా. సెలవు, పండుగ రోజుల్లో పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటాయి. దీన్ని ఆసరా చేసుకుని కలప వ్యాపారులు కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలోని అటవీ, పట్టాభూముల నుంచి అక్రమంగా నరికిన కలపను ఎక్కువగా టింబర్ డిపోలు, ఇటుక బట్టీలు, పరిశ్రమలకు తరలిస్తున్నారు. నిబంధనలు సడలింపుతో.. చెట్లను సంరక్షించేందుకు ప్రభుత్వం వాల్టా 2002 చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీంతో ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా వందలాది టన్నుల కలప అక్రమ రవాణా జరుగుతోంది. అటవీ చట్టాన్ని అనుసరించి అటవీభూముల్లోని చెట్లను నరకడం నిషేధం. అలాగే పట్టాభూముల్లోని చెట్లను నరకడం, రవాణాకు వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఈ చట్టం ప్రకారం చెట్లు నరికిన చోట మొక్కలను పెంచాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం 26 రకాల చెట్లను నరకడాన్ని నిషేధించింది. అయితే ఇటీవల ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 42 చెట్ల రవాణా అనుమతిస్తూ నిబంధనలను సడలించింది. దీనిని ఆసరా చేసుకుని కలప అక్రమ రవాణా చేసే వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెట్లను నరుకుతూ అక్రమంగా కలప వ్యాపారం సాగిస్తున్నారు. గ్రామాల నుంచి సామిల్‌కు.. అసైన్డ్ భూములు, పట్టా భూముల్లో మాత్రం చెట్లను అడ్డగోలుగా నరుకుతున్నారు. చింతచెట్టు నరకాలంటే అటవీశాఖ జిల్లా అధికారి అనుమతి తప్పనిసరికాగా తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే లారీలు, ట్రాక్టర్లలో కలప అక్రమ రవాణా జరుగుతుంది. పట్టా, అసైన్డ్ భూముల్లో చెట్లను నరకడానికిగాను సంబంధిత కంట్రాక్టర్ అటవీ సిబ్బందికి మమూళ్లు ఇవ్వాల్సిందే. ఒక్క రామాయంపేట రేంజీ పరిధిలోనే ప్రతిరోజూ పదిహేను లోడ్ల కలప రవాణా చేస్తున్నారు. మారుమూల గ్రామాలనుంచి కలప సా మిల్లులకు చేరుతుంది. దీనితో వారు చీకటి పడ్డాక హైదరాబాద్ తరలిస్తున్నారు. తూప్రాన్ సరిహాద్దులో జాతీయ ర«హదారిపై అటవీశాఖ చెక్‌పోస్టు ఉండగా, ఇక్కడ నుంచి జాతీయ రహదారిపై కలప తరలిస్తున్న ప్రతి వాహనానికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందే. పారిశ్రామిక వాడలకు తరలింపు.. నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి, అచ్చంపేట, నత్నాయిపల్లి, ఎల్లాపూర్, బ్రాహ్మాణపల్లి తదితర గ్రామాలను ఆనుకుని ఉన్న అడవులలో చెట్లను నరికి కలపను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల, తిమ్మాపూర్, పాంబండ గ్రామాలు అడవులను ఆనుకుని ఉన్నందున అడవుల నుంచి కలప నరికి మేడ్చల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన కంపెనీలకు రవాణా చేస్తున్నారు. కొత్తపేట ప్రాంతంలో ఇటుక బట్టీలు ఎక్కువగా చేపడుతూ అడవిలోని చెట్లను నరికి బట్టీలకు వినియోగిస్తున్నారు. కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్ గ్రామ పంచాయితీలోని గిరిజన తండాలతో పాటు కౌడిపల్లి కొల్చారం మధ్య ఉన్న అడవి నుంచి చెట్లను నరికి కలపను పారిశ్రామిక వాడలకు రవాణా చేస్తుంటారు. ఇటీవల శివ్వంపేట మండలంలోని కొత్తపేట నుంచి కలపను అక్రమంగా చేస్తున్న లారీ నర్సాపూర్త్లో బోల్తా పడింది. కలప లారీకి ఎలాంటి అనుమతులు లేకపోయినా లారీపై కేసు నమోదు చేయకుండానే వదిలివేయడం పోలీసు ల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. కఠిన చర్యలు తప్పవు అక్రమంగా అటవీభూములు, పట్టాభూముల్లో చెట్లు నరికి అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో కలప రవాణా కేసులు తక్కువగానే ఉన్నాయి. అటవీ అధికారులు మామూళ్లు తీసుకుని కలప రవాణాకు అనుమతిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాప్తవం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కలప అక్రమ రవాణాకు సంబంధించి 40 కేసులు పెట్టాం. అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు తప్పవు. వాల్టా చట్టం ప్రకారం ముందుస్తు అనుమతి తీసుకుని చెట్లు నరకడం లేదా రవాణా చేయాలని తెలిపారు. – పద్మజారాణి, డీఎఫ్ఓ -
నాలుగు ఇసుక లారీల పట్టివేత
శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా): వాల్టా చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని శామీర్‌పేట్ తహాసీల్దార్ దేవుజా పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారు చేసి తరలిస్తున్న నాలుగు లారీలను శామీర్‌పేట్ రెవెన్యూ అధికారుల పట్టుకుని శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో వాల్టా చట్టానికి విరుద్ధంగా మట్టి, ఇసుక తరలిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. లక్ష్మాపూర్‌కు చెందిన రెండు లారీలు, జగన్‌గూడకు చెందిన ఒక లారీ, బొమ్మరాశిపేట్కు చెందిన ఒక లారీని అధికారులు పట్టుకున్నారు.