
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో భూగర్భ జలాల వినియోగంపై కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వాల్టా చట్టంలోనూ మార్పులు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై నిర్ణీత చార్జీలు వసూలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.
తాగునీటి అవసరాలు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాలకు ఎలాంటి చార్జీలను విధించకూడదని స్పష్టం చేశారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఈ చార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, వాటర్‌షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment