ఇది వల్లూరు మండలంలోని తప్పెట్ల ఇసుకక్వారీ.. ఇక్కడ నవంబర్ 3వ తేదీ నుంచి ఇసుక విక్రయాలు ప్రారంభించారు.. ఇప్పటి వరకు 17,640 క్యూబిక్‌మీటర్ల ఇసుకను విక్రయించారు. క్యూబిక్‌మీటర్‌కు రూ. 650 చొప్పున ప్రభుత్వానికి రూ. 1.50 కోట్ల ఆదాయం ఒనగూరింది.. కేవలం 50 రోజుల్లో ఒక తప్పెట్ల క్వారీ నుంచే వచ్చిన ఆదాయం ఇది.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 3.2 కోట్ల ఆదాయం లభించింది. ఇదిలా ఉండగా ఇంతకు పదిరెట్లు అక్రమంగా ఇసుక తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చూస్తుండిపోతోంది.
సాక్షి ప్రతినిధి, కడప:
ప్రకృతి సంపద అధికార పార్టీ నేతలకు అందివచ్చిన అవకాశంగా మారింది. నాయకుల అక్రమ సంపాదనకు అడ్డుఅదుపూ లేకుండా ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో ఆరు రీచ్‌ల ద్వారా ఇసుక విక్రయాలు చేస్తున్నారు. మరో 15 రీచ్‌లలో ఇసుక తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెయ్యేరు నదిలో 6 రీచ్‌లు, పెన్నాలో 5 రీచ్‌లు, పాపాఘ్నిలో 4 రీచ్‌లను ఏర్పాటు చేయలని నిర్ణయించారు. దాదాపు 80 హెక్టార్లలో 9లక్షల 5వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించవచ్చనేది అధికారుల అంచనా.
తద్వారా రూ.60 కోట్లు ఆదాయాని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాత్రికి రాత్రే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నా ఎవరూ నియంత్రించడం లేదు. ప్రధానంగా తప్పెట్ల, పైడికాల్వ, కమలాపురం, ములుకోనిపల్లె, నందిమండలం, వేంపల్లె, వీరన్నగట్టుపల్లె నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాగే కొండాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, చెన్నూరు మండలాల నుంచి కూడా ఇసుక సంపదను కొల్లగొడుతున్నారు.
అంతలోనే ఎంత మార్పు...
నదుల్లోని ఇసుక తరలిస్తే భూగర్భజలాలు అడుగింటి పోతాయని ఆవేదన చెందుతూ ఆందోళన చేపట్టిన నాయకులు అధికారపీఠం ఎక్కగానే దృష్టి మరలుతోంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి తీరు ఇందుకు దర్పంగా నిలుస్తోంది. 2007-08లో తంగేడుపల్లె (వేంపల్లె దిగువన) ఇసుక టెండర్ నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకించారు.
ఇసుకను తరలిస్తే నీటిపథకాలకు గ్రహణం పడుతుందని, వేంపల్లెకు తాగునీటి సమస్య వస్తుందని ఆవేదన చెందారు. ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వేంపల్లె గ్రామానికి పైభాగాన కుమ్మరాంపల్లె గ్రామం ఉంది. తాగునీటి పథకాలన్నీ కుమ్మరాంపల్లెకు సమీపంలోనే ఉన్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఒక్కమారు కూడా పట్టుమని పదిరోజులు పాపాఘ్ని నదిలో నీటి ప్రవాహం లేదు. నాడు వేంపల్లె భూగర్భజలాలపై ఆందోళన చెందిన ఎస్వీ సతీష్‌రెడ్డికి ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీ గుర్తుకు రాకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
కరువు మండలాలతోనే సరి...
జిల్లాలో 48 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చెన్నూరు మండలాలు మినహా తక్కినవికరువు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రకటన మినహా ఇంతవరకు ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవలేదు. కరవు నేపధ్యంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గుదిబండగా ప్రభుత్వ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కార్మికులు, చిన్నతరహా పరిశ్రమల యజమానులకు గుదిబండగా మారింది. జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న 20వేల మంది రోడ్డుపాలయ్యారు. బెరైటీస్ ఖనిజం ఆధారంగా 180 మిల్లులు పనిచేస్తున్నాయి.
వాటిలో ప్రత్యక్షంగా 5వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇదివరకు 40ః60 దామాషా ప్రకారం బెరైటీస్ ఖనిజాన్ని సరఫరా చేసేవారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు గ్యారంటీ అనీ ప్రకటనలు ఇచ్చారు, ఇప్పుడేమో కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు.
జఠిలంగా మారుతున్న తాగునీటి సమస్య...
వేసవి రాకముందే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. 185 గ్రామాలు నీటి ఎద్దడితో ఉన్నాయి. వాటిలో 110 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 మాత్రమే కేటాయిస్తున్నారని .. మిగతాది తాము చేతి నుంచి భరించాల్సిన దుస్థితి నెలకొందని ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు నీటి తరలింపునకు వెనక్కి తగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తుండటంతో భూగర్భజలాల్ని అడుగంటి నీటి సమస్య ఏర్పడుతోంది.
కొనసాగుతున్న వివక్షత...
జిల్లాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివక్షత ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు స్పష్టమైన ఉదాహరణలుగా ఎయిర్‌పోర్టు, కలెక్టరేట్ కాంప్లెక్స్ బిల్డింగ్‌లు నిలుస్తున్నాయి. కడప విమానాశ్రయంలో దిగేందుకు కింగ్‌ఫిషర్, జెట్ ఏయిర్ వేస్, స్పైజెట్‌లు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. వాటితోపాటు ప్రభుత్వ విమానయాన సంస్థ ఇండియన్ ఏయిర్ లైన్స్ సర్వీసులు ఎలాగూ నడుస్తాయి.
అయితే కడప విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఏయిర్‌పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో కేవలం ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులు మాత్రమే సౌకర్యం ఉంటుంది. దీనికి కూడా కొందరు అడ్డుపుల్ల వేస్తున్నారు. దీంతో విమానాశ్రయ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.
కలెక్టరేట్ కాంప్లెక్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌లో పూర్తయిన భవనాలు ఐదేళ్లుగా అలాగే ఉండిపోతున్నాయి. జిల్లాలోని గండికోట ప్రాజక్టులో ఏకకాలంలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పెండింగ్ కారణంగా గండికోట ముంపు గ్రామాలు ఖాళీ కాలేదు.
గండికోట, మైలవరం, వామికొండ, సర్వారాయసాగర్, బ్రహ్మంసాగర్‌లలో నీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉండి కూడా ఆ మేరకు చర్యలు తీసుకోలేకపోతున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈనేపధ్యంలో శనివారం జిల్లా సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ చూపెట్టాలని పాలక పక్షం వివక్షతను ఎండగట్టాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.
కళ్లు తెరవండి!
Published Sat, Jan 3 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM
Advertisement
Advertisement