పని జరగాలంటే.. చేయి తడపాల్సిందేనా..!
చేవెళ్ల: ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజాసేవకులు.. నెలనెలా వేతనం తీసుకుంటూ విధులు నిర్వర్తించాలి. కాని నేడు కొందరు అధికారులు అక్రమ సంపాదన వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పనిని తాము చేసేందుకు లంచాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో తరచూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. కాగా ‘దొరికినోడే దొంగ’ అన్న చందంగా ఉంది.
అవినీతికి పాల్పడుతూ తప్పించుకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అంకితభావంతో ఉద్యోగాలు చేసేవారూ లేకపోలేదు. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించే అవకాశం ఉంది. లంచం తీసుకోవడం ఎంత నేరమో.. ఇవ్వడమూ అంతే తప్పు. ఇటీవల మంచాల వ్యవసాయ అధికారి లావణ్య ఓ ఫర్టిలైజర్ లెసైన్స్ కోసం ఓ యువకుడి నుంచి డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేపలు..
* 2009లో మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సురేందర్‌రెడ్డి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
* 2011లో మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శుక్లకుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుకున్నారు.
* 2012లో అప్పటి శంకర్‌పల్లి గ్రామ పంచాయతీ ఈఓ ఓ పని నిమిత్తం రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
* 2012 ఫిబ్రవరి 16న చేవెళ్ల ప్రొబేషనరీ డీఎస్పీ గుణశేఖర్ ఓ భూవివాదం పరిష్కారిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కారు. అప్పట్లో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.
* 2013 జనవరి 30న చేవెళ్ల హెడ్‌కానిస్టేబుల్ నాగేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి దొరికాడు. దీంట్లో సీఐ శ్రీనివాస్ హస్తం ఉందనే ఆరోపణలతో అధికారులు ఆయనపై కూడా కేసు నమోదు చేసి అప్పట్లో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.
* చేవెళ్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ కురుమానాయక్, కానిస్టేబుల్ నర్సింలు కల్లు దుకాణం యజమాని నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
* కుల్కచర్ల ఇన్‌చార్జి ఎంపీడీఓ పండరీనాథ్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడ్డారు.
* 2013లో గండేడ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. గతంలో గండేడ్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శీనప్ప ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
* పంచాయతీ రాజ్ ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి లంచం కేసులో అవినీతి అధికారులు పట్టుకున్నారు
* గండేడ్ పీహెచ్‌సీ కార్యదర్శి గోపాల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.
* తాజాగా ఈనెల 5న మంచాల ఏఓ (అగ్రికల్చర్ ఆఫీసర్) లావణ్య ఓ ఫర్టిలైజర్ దుకాణం లెసైన్స్ విషయంలో రూ. 2 వేలు ఓ వ్యక్తి నుం చి తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతిపరుల భరతంపట్టండి..
ప్రభుత్వ అధికారులు వేతనం తీసుకుంటున్నారు. పనిచేయడం వారి బాధ్యత. పనికోసం లంచాలి వాల్సిన అవసరం లేదు. అవినీతి పరుల భరతం పట్టాలంటే జిల్లా ఏసీబీ అధికారికి 9440446140 నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వలపన్ని వారిని పట్టుకుంటారు.