మా కులపోడే దొరికాడా..?
నెల నెలా నిక్కచ్చిగా వేతనాలు అందుకుంటూనే అమ్యామ్యాలు చేతిలో పడనిదే పని చేయని ప్రభుత్వ ఉద్యోగులు పెరుగుతున్నారు. చేయి తడపనిదే పనులు చక్కబెట్టని సర్కారీ బాసులు కొకొల్లలు. లంచాల కోసం జనాన్ని చెండుకు తినే అవినీతి బకాసురులు దేశమంతటా పుట్టుకు వస్తున్నారు. బల్లకింద చేతులు పెట్టడం లంచగొండులకు అలవాటుగా మారింది. అయితే అవినీతి అధికారులకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తుండడమే ఇప్పుడు సామాన్యా జనాన్ని విస్తుపరుస్తోంది.
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), సీబీఐ అధికారులకు లంచావతారాలు చిక్కడం నిత్యకృత్యంగా మారింది. జీతం కంటే పైడబ్బులకే పాకులాడే ప్రభుత్వోద్యోగులు నానాగడ్డి కరుస్తున్నారు. మేతగాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక సామాన్య జనం సతమవుతున్నారు. కొంతమంది తమలో తాము కుమిలిపోతే, చైతన్యవంతులు మాత్రం ఏసీబీ, సీబీఐ సాయంతో అవినీతి చేపలను పట్టిస్తున్నారు. అయితే చిక్కినట్టే చిక్కి అవినీతి చేపలు జారుకుంటున్న ఉదంతాలెన్నో.
అవినీతిపరులకు కుల, మత, ప్రాంతాల వారీగా వత్తాసు లభిస్తుండడం విస్తుగొలుపుతుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు కూడా లంచావతారాలను వెనుకేసురావడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వాధికారి ఎవరైనా అవినీతి ఆరోపణలతో పట్టుబడితే చాలు కుల సంఘాలు వాలిపోతున్నాయి. 'మా కులపోడే దొరికాడా...' అంటూ కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రాంతాల వారీగా కూడా లంచగొండులను వెనకేసుకొచ్చే ధోరణి మొదలైంది.
తప్పు చేసిన వాడు తమ్ముడైనా న్యాయం చెప్పాలన్న నీతికి కొంతమంది సంకుచిత వాదులు చెదలు పట్టిస్తున్నారు. తప్పును సమర్థించేవారు తప్పుచేసినట్టే అన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతున్నారు. నిజాయితీపరులను అన్యాయంగా వేధించడాన్ని ఎవరూ సమర్థించరు. అదే సమయంలో లంచగొండితనాన్ని ఉపేక్షించమని ఎవరూ చెప్పరు. అలా చెప్పావారంతా లంచగొండుల కిందే లెక్క. ఏమంటారు?