బీటెక్ వైద్యం
బీటెక్ వైద్యం
Published Tue, Jun 20 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
కర్నూలు, ఆదోనిలో నకిలీ ఆసుపత్రులు
– ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో రోగులకు చికిత్స
– విజిలెన్స్ విచారణలో బట్టబయలు
కర్నూలు(హాస్పిటల్): చదివింది ఇంటర్, డిగ్రీ, బీటెక్. కానీ పేరు ముందు డాక్టర్ తగలించుకున్నారు. ఎంబీబీఎస్‌తో పాటు స్పెషాలిటీ కోర్సులనూ జతచేసి కర్నూలు, ఆదోని నగర నడిబొడ్డులో దర్జాగా వైద్యం చేస్తున్నారు. వీరిచ్చే మామూళ్లకు ఆశపడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులూ ఆసుపత్రికి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. తాజాగా సదరు ఆసుపత్రి ఒకచోట నుంచి మరోచోటికి మార్పు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెక్కీ నిర్వహించి ఏకకాలంలో కర్నూలు, ఆదోనిలోని ఆసుపత్రులపై దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన నరేంద్ర అలియాస్ డాక్టర్ నాగేంద్రప్రసాద్ గతంలో హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పనిచేశాడు. అక్కడ ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా వచ్చే డబ్బు చూసి ఆశ మొదలైంది. తాను కూడా ఏదైనా ఒక ఆసుపత్రి పెట్టి డబ్బు సంపాదించాలని అప్పుడే అతని మెదడులో బీజం పడింది. ఈ మేరకు కర్నూలుకు వచ్చి స్థానిక బిర్లాకాంపౌండ్‌లో సంక్షేమ భవన్ ఎదురుగా జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. వైద్య ఆరోగ్యశాఖలో మామూళ్లు ఇచ్చి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను తీసుకున్నాడు.
ఆసుపత్రిలో తాను డాక్టర్ నాగేంద్రప్రసాద్ అని, తన భార్య జ్యోతి ఎంబీబీఎస్, డీసీహెచ్ అని పేర్కొన్నాడు. అయితే ఆయన భార్య జ్యోతి కేవలం ఇంటర్ మీడియట్ మాత్రమే చదువుకుంది. వీరిద్దరూ కలిసి బిర్లా కాంపౌండ్ వద్ద రెండేళ్ల పాటు ఆసుపత్రి నడిపారు. దాంతో పాటు కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా, ఆదోని పట్టణంలోనూ విజయగౌరి హాస్పిటల్ పేరుతో ఆసుపత్రులు ప్రారంభించారు. కొత్తబస్టాండ్ వద్ద డాక్టర్‌గా తన బావమరిది రఘును నియమించాడు. అతనిని డాక్టర్ రాఘవేంద్ర ఎంబీబీఎస్, ఎండీగా పరిచేయం చేశాడు. ఈ మేరకు విజిటింగ్‌కార్డులు ముద్రించాడు. బిర్లాగడ్డ వద్ద ఆసుపత్రి దివాళా తీయడంతో దానిని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న విజయగౌరి హాస్పిటల్‌కు మార్చాడు. నాగేంద్రప్రసాద్, ఆయన భార్య జ్యోతి ఇద్దరూ ఆదోనిలో బిజీ ప్రాక్టీషినర్లుగా మారారు. కర్నూలులో మాత్రం రాఘవేంద్ర డాక్టర్‌గా చెలామణి అయ్యాడు. జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై, వారి ద్వారా తమ ఆసుపత్రులకు రోగులను రప్పించి దోచుకునేవాళ్లు. ఒక రోగిని ఆసుపత్రికి ఆర్‌ఎంపీ తీసుకొస్తే అతనికి 60 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారు.
రెక్కీ నిర్వహించి దాడులు చేసిన విజిలెన్స్
జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో పాటు విజయగౌరి హాస్పిటల్‌పై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం కర్నూలులో హోంగార్డు శ్రీకాంత్, తిప్పయ్యలు కలిసి విజయగౌరి హాస్పిటల్‌కు వెళ్లారు. శ్రీకాంత్ తనకు తల తిరుగుతోందని చెప్పడంతో ముందుగా రూ.150 కట్టి ఓపీ తీసుకోవాలని అక్కడి సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత 5 నిమిషాలు కూర్చోబెట్టారు. ఒక నర్సు వచ్చి బీపీ చెక్ చేసి నార్మల్‌గా ఉందని చెప్పింది. అక్కడ రోగులు ఎవ్వరూ లేకపోయినా పావుగంట సేపు కూర్చోబెట్టి శ్రీకాంత్‌ను రాఘవేంద్ర అలియాస్ రఘు వద్దకు పంపించారు. శ్రీకాంత్ మణికట్టు పట్టుకుని డాక్టర్ రాఘవేంద్ర పరీక్షించాడు. అలాగే తిప్పయ్యనూ పరీక్షించాడు. ఇతనికి కడుపునొప్పి ఉందనగానే స్కానింగ్‌తో పాటు రక్తపరీక్షలు చేయాలని చెప్పాడు. అయితే తాము డబ్బులు తెచ్చుకోలేదని చెప్పడంతో ఇద్దరికీ మందులు రాసిచ్చి పంపించారు.
అలాగే ఆదోనిలోనూ నాగేంద్రప్రసాద్ వద్దకు హోంగార్డు నాగరాజు వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయి, కడుపునొప్పి ఉందని చెబితే అతనికి సెలైన్ పెట్టి డబ్బులు గుంజారు. హోంగార్డులకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మధ్యాహ్నం నుంచి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలులో రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శివకోటి బాబూరావు, సీఐ రామక్రిష్ణాచారి, ఏఈ భాస్కరరెడ్డి, సిబ్బంది, ఆదోనిలో సీఐ జగన్మోహన్‌రెడ్డి ఏకకాలంలో దాడులు చేపట్టారు.
ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం
కర్నూలు, ఆదోనిలలోని ఆసుపత్రులకు తాత్కాలిక అనుమతులే తప్ప మున్సిపల్, ఫైర్, పోలీస్ అనుమతులు ఏవీ లేవు. అయినా అల్ట్రాసౌండ్‌స్కానింగ్ మిషన్‌తో పాటు ఎక్స్‌రే, డయోగ్నోస్టిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఏమీ చేయకున్నా అన్ని పరీక్షలు చేసినట్లు వారికి వారే నివేదికలు ఇచ్చేసి వచ్చిన రోగులకు నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్స్, విటమిన్స్ మందులు ఇచ్చి డబ్బు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై.నరసింహులు విచారణలో తేలింది. మెడికల్‌షాపు సైతం నరేంద్ర పేరుపైనే ఉంది. అయితే కొత్తబస్టాండ్ వద్ద ఉన్న షాపునకు అనుమతులు లేవు. దీంతో జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్/విజయగౌరి హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో 26 నకిలీ ఆసుపత్రుల జాబితా ఉంది
నగరంలో మరో 26 ఆసుపత్రులు సైతం ఇదే విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా, నకిలీ వైద్యులతో నిర్వహిస్తున్నట్లు మా వద్ద జాబితా ఉంది. సదరు ఆసుపత్రులపైనా దాడులు నిర్వహిస్తాం. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో కొన్ని ఆసుపత్రులు తీసుకున్న అనుమతులపైనా విచారణ చేయనున్నాం. సదరు ఆసుపత్రులు సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నాం.
– డాక్టర్ వై.నరసింహులు, డీఎంహెచ్‌ఓ
Advertisement
Advertisement