నిందితులు మహ్మద్ సుభానీ, మహ్మద్ అబ్దుల్ ముజీబ్
సాక్షి, సిటీబ్యూరో: వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన సూడో డాక్టర్ల కేసులో అనేక కొత్త, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం చనిపోయిన తన సోదరుడి కోరిక మీదటే ఈ ఆస్పత్రి ఏర్పాటు చేశానంటూ సుభానీ చెప్పుకొచ్చాడు. వైద్య పరంగా ఎలాంటి అర్హతలు లేని ఇతడి స్నేహితుడు ముజీబ్ ఏకంగా చిన్న పిల్లల వైద్యడి (పిడియాట్రిషన్) అవతారం ఎత్తాడు. ఈ వ్యవహారంలో అత్యంత కీలక విషయం ఏమిటంటే... కేవలం ఆధార్ కార్డు ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డీఎం అండ్ హెచ్‌ఓ అధికారులు వీరి ఆస్పత్రికి అనుమతి ఇచ్చేయడం. బీకాం మధ్యలో ఆపేసిన మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ షోయబ్ సుభానీకి ఓ సోదరుడు ఉండేవాడు. డాక్టర్ కావాలని, ఓ ఆస్పత్రి పెట్టాలని ఎంతగానే ఆశపడ్డాడు. అయితే అతడు ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతూ చనిపోయాడు. తన సోదరుడి కోరిక తీర్చాలనే ‘లక్ష్యం’తో ఉన్న సుభానీకి ముజీబ్‌తో పరిచయం ఏర్పడింది. హుమాయున్‌నగర్‌లోని ఎంఎం హాస్పిటల్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఇతడికి ఉందని తెలియడంతో సుభానీ తన ఆలోచన చెప్పాడు. అలా ఆస్పత్రి ఏర్పాటు చేసి నిర్వహిస్తే భారీ లాభాలు ఉంటాయంటూ తనకున్న అనుభవంతో ముజీబ్ చెప్పాడు. దీంతో ఆస్పత్రికి అవసరమైన అనుమతి పొందడంపై దృష్టి పెట్టిన ‘టెన్త్ క్లాస్’ ముబీబ్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్ పేరుతో ఓ ఆధార్ కార్డు సంపాదించాడు. (‘కొవిడ్’ తీగలాగితే బయటపడ్డ సూడో డాక్టర్లు! )
దీని ఆధారంగా 2017లో డీఎం అండ్ హెచ్‌ఓకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇతగాడు తాను డాక్టర్‌ని అంటూ ఎలాంటి నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించలేదు. కేవలం డాక్టర్ అని పేరు ముందు ఉన్న ఆధార్ కార్డును పొందుపరచగా డీఎం అండ్ హెచ్‌ఓ అధికారులు అనుమతి ఇచ్చారంటూ ఇతగాడు పోలీసులకు చెప్పాడు. ఇలా సమీర్ పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఈ ద్వయం వైద్యం చేయడం మొదలెట్టింది. సుభానీ చైర్మన్‌గా, ముజీబ్ ఎండీగా ఈ ఆస్పత్రి నిర్వహిస్తూ వచ్చారు. తన పేరు పక్కన ఎండీ అని రాసుకునే ముజీబ్ ఎవరైనా గుచ్చిగుచ్చి అడిగితే తాను మెడిసిన్‌లో ఎండీ చేయలేదని, కేవలం ఆస్పత్రికి ఎండీనని చెప్పుకొచ్చేవాడు. ఇలా దాదాపు నాలుగేళ్లుగా అనేక మందికి ఈ ద్వయం వైద్యం చేస్తూ వచ్చింది. కోవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్ ముఠా చిక్కడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ ఔషధాల కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ప్రశ్నించడానికి ఇరువురినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వీరి గుట్టురట్టైంది.
ఆధార్ కార్డులో పేరు ముందు డాక్టర్ అనే పదం ఎలా వచ్చిందంటూ పోలీసులు ముజీబ్‌ను కోరారు. తాను సుదీర్ఘ కాలంగా వివిధ ఆస్పత్రుల్లో పని చేశానని, ఈ నేపథ్యంలోనే తనని అందరూ డాక్టర్ అని పిలుస్తారని చెప్పాడు. ఆధార్ కార్డులు జారీ చేసే వారు తమ వద్దకు వచ్చినప్పుడు తాను చెప్పకుండానే వాళ్లే డాక్టర్ అని పేరు ముందు పెట్టేశారంటూ చెప్పుకొచ్చాడు. ఈ సూడో డాక్టర్లను రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో డీఎం అండ్ హెచ్‌ఓ అధికారులకూ నోటీసులు జారీ చేసి ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌పై ప్రశ్నించనున్నారని తెలిసింది. అసలు ఎలాంటి వైద్య విద్యకు సంబంధించిన డిగ్రీలు లేకుండా, వాటిని దాఖలు చేయకుండా ఆధార్ కార్డులో పేరు ముందు డాక్టర్ పదం ఆధారంగా ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి ఎలా ఇచ్చారు? దానికి బాధ్యులు ఎవరు? ఈ వ్యవహారం వెనుక మతలబు ఏంటి? తదితర అంశాలు ఆరా తీయాలని పోలీసులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment