నకిలీ డాక్టర్లా.. ‘విదేశీ’ వైద్యులా? | Telangana State Medical Council Database Tampering For Fake Doctors | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్టర్లా.. ‘విదేశీ’ వైద్యులా?

Published Fri, Feb 25 2022 3:34 AM | Last Updated on Fri, Feb 25 2022 3:34 AM

Telangana State Medical Council Database Tampering For Fake Doctors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ డేటాబేస్‌ ట్యాంపరింగ్‌ నకిలీ వైద్యుల కోసమా? లేక విదేశాల్లో విద్యనభ్యసించి వచ్చిన డాక్టర్ల కోసమా? ఇంటి దొంగలు ఎవరు? అనే కోణంలో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ హన్మంతరావు ఫిర్యాదు మేరకు బుధవారం నమోదైన ఈ కేసును ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌ దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కౌన్సిల్‌కు వెళ్లి సర్వర్‌ను పరిశీలించాలని భావిస్తున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వాళ్లు కచ్చితంగా ఈ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకుని, ప్రత్యేక నంబర్‌ తీసుకున్న తర్వాతే ప్రాక్టీసుకు అర్హులు అవుతారు.

ఈ వైద్యులు ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు తమ విద్యార్హతలు పెంచుకున్నప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. ఈ డేటాబేస్‌ను మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తుంటుంది. కాగా వైద్య విద్య పూర్తి చేసిన సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డి 2016లో కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. కాగా తదనంతర కాలంలో ఈ డేటాబేస్‌ను ట్యాంపర్‌ చేసిన ఇంటి దొంగలు కొందరు సుభాష్, రామిరెడ్డి పేర్లను తొలగించి శివానంద్, దిలీప్‌కుమార్‌ అనే వారి పేర్లను చేర్చారు. అలాగే నాగమణి విద్యార్హతలు, శ్రీనివాస్‌ ఫొటో అవే పేర్లు గల కొత్తవారితో మార్చేశారు. ఈ నలుగురినీ 2016లో సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డిలకు కేటాయించిన నంబర్లను వినియోగించి కౌన్సిల్‌లో చేర్చేశారు.

ఇలా వెలుగులోకి..: ఇటీవల ఓ వైద్యుడు తన పీజీని అప్‌డేట్‌ చేయించుకో వడానికి, మరో ముగ్గురు ఐదేళ్లు పూర్తి కావడంతో రెన్యువల్‌ కోసం వచ్చారు. అయితే వీరి దరఖాస్తుల్లోని వివరాలు, ఫొటో.. అప్పటికే డేటాబేస్‌లో ఉన్న వాటితో సరిపోలకపోవడంతో ట్యాంపరింగ్‌ వెలుగులోకి వచ్చింది. నకిలీ పట్టాలు పొందిన వైద్యులు నేరుగా రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నిస్తే బండారం బయటపడే ప్రమాదం ఉంటుంది. అలాగే చైనా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వచ్చిన వాళ్లు నేరుగా ఇక్కడ రిజిస్టర్‌ చేసుకుని, ప్రాక్టీసు మొదలుపెట్టే అవకాశం లేదు.

మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కోవలకు చెందినవారే ఇంటి దొంగల సాయంతో డేటా బేస్‌ ట్యాంపరింగ్‌ చేయించి ఉంటారని, ఈ విధంగా మరెన్నో పేర్లు ట్యాంపర్‌ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించాలంటే కౌన్సిల్‌లోని కంప్యూటర్లు, సర్వర్‌తో పాటు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. 2016 తర్వాతే ఈ వ్యవహారం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు గడిచిన ఆరేళ్ల కాలంలో ఆ పేర్లతో రిజిస్టర్‌ అయిన, నమోదు చేసుకున్న డాక్టర్ల వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement