నాన్‌ క్లినికల్‌ పీజీ... నాట్‌ ఇంట్రెస్టెడ్‌! | Telangana: MBBS Students Eager To Pursue Medical PG | Sakshi
Sakshi News home page

నాన్‌ క్లినికల్‌ పీజీ... నాట్‌ ఇంట్రెస్టెడ్‌!

Published Mon, Feb 6 2023 1:11 AM | Last Updated on Mon, Feb 6 2023 7:34 AM

Telangana: MBBS Students Eager To Pursue Medical PG - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్‌ పీజీ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. తద్వారా స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. అందువల్ల క్లినికల్‌ విభాగంలోని సీట్లకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కోట్లు ఖర్చు చేసి వాటిల్లో చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. కానీ నాన్‌ క్లినికల్‌ పీజీ సీట్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఈ సీట్లను పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఉండే కన్వీనర్‌ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరడంలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాధారణ ఫీజు చెల్లిస్తే చాలనీ, డొనేషన్‌ కూడా వద్దని, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి.  

క్లినికల్‌ సీట్లపైనే అందరి దృష్టి... 
క్లినికల్‌ విభాగంలోని సబ్జెక్టులన్నింటికీ భారీగా డిమాండ్‌ ఉండగా, నాన్‌క్లినికల్‌ సబ్జెక్టులకు డిమాండ్‌ ఉండటం లేదు. నాన్‌క్లినికల్‌లో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రో బయోలజీ, ఎస్పీఎం, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి సబ్జెక్టులున్నాయి. ఇవి చేసిన వారికి ప్రధానంగా మెడికల్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీగా చేయడానికి వీలుంటుంది.

ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వంటి వాటికి ఇతరత్రా అవకాశాలుంటాయి. కానీ క్లినికల్‌ కోర్సుల మాదిరి నాన్‌ క్లినికల్‌ సబ్జెక్టులకు డిమాండ్‌ ఉండదు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో నాన్‌క్లినికల్‌ అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడంలేదు. దీంతో ఈ కోర్సులు చేసినవాళ్లు చాలామంది ఖాళీగా ఉంటున్నారు. నాన్‌ క్లినికల్‌ కోర్సులు చేసినవారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు కాలేజీల్లోనూ అవకాశాలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో రూ. లక్షకు పైగా జీతాలు తీసుకున్నవారు, ఇప్పుడు రూ. 40–50 వేలకే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది.

కొన్నిసార్లు ఆ మేరకైనా అవకాశాలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో చేరడానికి ఆసక్తి చూపడంలేదు. క్లినికల్‌ విభాగాలైన జనరల్‌ మెడిసిన్, రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, ఆర్థో, గైనిక్‌ తదితర కీలకమైన వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. బయట ప్రాక్టీస్‌ చేయడానికి, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో భారీ జీతాలు పొందడానికి క్లినికల్‌ మెడికల్‌ కోర్సులే ఉపయోగపడతాయి.  

క్లినికల్‌ సీట్లనైనా పెంచితే... 
మెడికల్‌ కాలేజీల్లో నాన్‌ క్లినికల్‌ పీజీ వైద్య సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతుండటంపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సీట్లుండీ మిగిలిపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని అంటున్నాయి. ఇన్‌ సర్వీస్‌ కోటా కింద భర్తీ చేసుకోవడానికి వీలు కల్పించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు గతంలో జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు లేఖ రాశాయి.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ‘నీట్‌’పరీక్ష తప్పనిసరి కాబట్టి తామేమీ చేయలేమని ఎన్‌ఎంసీకి చెందిన కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాన్‌ క్లినికల్‌ సీట్లను తగ్గించి క్లినికల్‌ సీట్లనైనా పెంచితే బాగుంటుందని ఎంబీబీఎస్‌ విద్యార్థులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement