డిగ్రీ ఫెయిల్‌..30 ఏళ్లకు పైగా వైద్యం | fake doctors arrest in kurnool district | Sakshi
Sakshi News home page

శంకర్‌దాదాలు

Published Thu, Feb 15 2018 12:50 PM | Last Updated on Thu, Feb 15 2018 3:38 PM

fake doctors arrest in kurnool district - Sakshi

తండ్రీ కొడుకులు నరహరిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలను అదుపులోకి తీసుకుంటున్న విజిలెన్స్‌ అ««ధికారులు

కర్నూలు(హాస్పిటల్‌)/కల్లూరు/ ఎమ్మిగనూరు రూరల్‌: ఒకడు ఇంటర్‌ చదివి వైద్యం చేస్తాడు. మరొకడు డిగ్రీ ఫెయిలైనా మెడలో స్టెతస్కోపు వేసుకుంటాడు. నకిలీ ఆయుర్వేద, యునాని సర్టిఫికెట్లు కొని తెచ్చుకుని దర్జాగా తెల్లకోటు వేసుకుంటాడు మరో ప్రబుద్ధుడు. ఇలా ఒకటా, రెండా..తరచూ ఎక్కడోచోట నకిలీ డాక్టర్ల లీలలు బయటపడుతూనే ఉన్నాయి. అడ్డగోలు సంపాదనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా..  వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి పట్టుకున్నప్పుడు మాత్రమే వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు విచారణ పేరిట హడావుడి చేస్తున్నారు. తాజాగా బుధవారం కల్లూరు, ఎమ్మిగనూరులో విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో ‘శంకర్‌దాదాల’ గుట్టు రట్టయ్యింది.

హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ఏకంగా డాక్టర్‌ అవతారమెత్తాడు!
కల్లూరు ఎస్టేట్స్‌లోని పందిపాడు గ్రామంలో సుఖీభవ ఆస్పత్రి ఏర్పాటు చేసిన నాగప్రకాష్‌ గతంలో వైద్య, ఆరోగ్యశాఖలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌గా పనిచేశాడు. కొన్నాళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసుపత్రి నిర్మించాడు. కల్లూరులో అతను ఓ పెద్ద డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ విషయం తెలిసి విజిలెన్స్‌ అధికారులు  రెక్కీ నిర్వహించారు. బుధవారం విజిలెన్స్‌ సీఐలు శ్రీనివాసరెడ్డి, జీవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ జయన్న, కానిస్టేబుళ్లు నాగభూషణరావు, మునిస్వామి ఆస్పత్రిపై దాడి చేశారు. ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన డీఎం అండ్‌హెచ్‌ఓ, ఫైర్, పొల్యూషన్‌ తదితర అనుమతులు ఏమేరకు ఉన్నాయో రికార్డులు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారి అర్హతలనూ అడిగి తెలుసుకున్నారు. నాగప్రకాష్, టి.లక్ష్మినారాయణ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా ఉన్న ఈ ఆస్పత్రిలో నాగప్రకాష్‌ వైద్యునిగానూ చలామణి అవుతున్నట్లు వెలుగు చూసింది. అలాగే డ్యూటీ డాక్టర్లుగా యునానీ  చేసిన రేష్మాబేగం, ఎస్‌. షాహీన్‌ బేగం, మూసుం బాషాలను పెట్టుకుని..వారితో అల్లోపతి వైద్యం చేయిస్తున్నట్లు తేలింది. కాగా..తమ ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అర్హులైన వైద్యులను పిలిపించి రోగులకు చికిత్స చేయిస్తున్నామని నాగప్రకాష్‌ వివరణ ఇచ్చారు.

డిగ్రీ ఫెయిల్‌..30 ఏళ్లకు పైగా వైద్యం
ఎమ్మిగనూరు మండలం పార్లపల్లికి చెందిన నరహరిరెడ్డి డిగ్రీ ఫెయిలయ్యాడు. అతని కుమారుడు శ్రీనివాసరెడ్డి ఇంటర్‌ వరకు చదివాడు. నరహరిరెడ్డి పార్లపల్లిలో ధనుంజయ్‌ అనే ఆర్‌ఎంపీ దగ్గర అరకొర వైద్యం నేర్చుకున్నాడు. అనంతరం గూడూరు మండలం సి.బెళగల్‌కు వెళ్లి అక్కడ దాదాపు 18 ఏళ్లపాటు క్లినిక్‌ నడిపాడు. 1994లో ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చి స్థానిక శకుంత సర్కిల్‌లో శ్రీనరహరి క్లినిక్‌ ప్రారంభించాడు. దానికి సమీపంలోనే కుమారుడితో మెడికల్‌ షాప్‌ పెట్టించాడు. ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా చలామణి అవుతూ రోగులకు వైద్యం చేస్తుండేవాడు. అవసరం లేకున్నా ఎక్కువ మందులు రాసిచ్చి తన కుమారుడి మెడికల్‌ షాపునకు పంపేవాడు. ఇతని వ్యవహారం విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారు. రోగుల మాదిరి వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. తండ్రి లేని సమయంలో కుమారుడు శ్రీనివాసరెడ్డి కూడా వారికి వైద్యం అందించాడు.

బుధవారం మళ్లీ విజిలెన్స్‌ ఉద్యోగి ఒకరు పేషెంట్‌ మాదిరి వెళ్లారు. శరీరంలో గడ్డలు ఉన్నాయని, సాయిరాం హాస్పిటల్‌కు వెళ్లి స్కానింగ్‌ తీయించుకురావాలని నరహరిరెడ్డి సూచించాడు. దీంతో స్కానింగ్‌ తీయించుకొచ్చారు. రిపోర్టులో ఏమీ లేదని బయటపడటంతో ‘లోపల బెడ్‌పై పడుకోండి.. సెలైన్‌ ఎక్కిస్తా’నని నరహరిరెడ్డి చెప్పాడు. సరే అని బెడ్‌పై పడుకున్నారు. అదే సమయంలో నకిలీ డాక్టర్‌ సెలైన్‌ ఎక్కించేందుకు రావటంతో విజిలెన్స్‌ అ«ధికారులు దాడి చేశారు. ‘నీవు వైద్యం చేసేందుకు అర్హత సర్టిఫికెట్లు ఏమి ఉన్నాయ’ని ప్రశ్నించారు. అతను సరైన సమాధానం చెప్పకుండా అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్‌ను సీజ్‌ చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు వెంకటేశ్వర్లు, జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ రోజూ వంద మంది దాకా వైద్యం చేయించుకునేవారని, నరహరిరెడ్డి వద్ద ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ సర్టిఫికెట్‌ ఉందని, దానిపైనా విచారణ చేస్తామని చెప్పారు. జిల్లాలో నకిలీ డాక్టర్ల గురించి సమాచారమిస్తే వారి భరతం పడతామని ప్రజలకు సూచించారు. దాడుల్లో పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, విజిలెన్స్‌ అధికారి ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు
జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు,  డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, క్లినిక్‌లు కలిపి 393 రిజిష్టర్‌ అయ్యాయి. రెన్యువల్, కొత్తగా రిజిస్ట్రేషన్‌ కోసం మరో 50 దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయి. రిజిష్టరైన 393 ఆసుపత్రులు, క్లినిక్‌ల్లోనూ 70 మినహా అన్నీ కాలపరిమితి తీరిపోయాయి. వీటిని రెన్యువల్‌ చేయించుకోవడం లేదు. కొందరు రెన్యువల్‌ చేయించుకుందామని వైద్య, ఆరోగ్యశాఖకు వెళితే అక్కడ మామూళ్ల బెడద తప్పడం లేదు. వారు అడిగే మామూళ్లు ఇవ్వకపోతే  ఫైళ్లు పెండింగ్‌ పడుతున్నాయి. ఇక నకిలీ డాక్టర్లు కూడా పెద్దసంఖ్యలోనే పుట్టుకొస్తున్నారు. ముందు ఎవరైనా డాక్టర్‌ వద్ద కాంపౌండర్‌(అసిస్టెంట్‌)గా చేరి కొన్నాళ్ల తర్వాత డాక్టర్‌ అవతారం ఎత్తుతున్న వారు చాలామందే ఉంటున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా మెడలో స్టెత్‌ వేసుకుని, తెల్లకోటు ధరించి దర్జాగా రోగులకు వైద్యం చేస్తున్నారు. వీరి వ్యవహారం బయటపడేంత వరకు  అల్లోపతి వైద్యులుగానే చలామణి అవుతున్నారు.

  విజిలెన్స్‌ అధికారులు కొన్నాళ్లుగా సీజ్‌ చేసిన ఆసుపత్రులు
గూడూరులో 15 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా అనురాధ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న శ్రీరాములు అనే వ్యక్తిని పట్టుకుని, ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఆయన వైద్యవృత్తి చేయడానికి ఎలాంటి కోర్సునూ చదవలేదు. అయినా ఆయుర్వేద రత్న అని, సర్టిఫికెట్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ హెల్త్‌ అని బోర్డు పెట్టుకున్నాడు. ఏకంగా 50 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్వహించేవాడు. గర్భిణులకు ప్రసవాలు, లింగనిర్ధారణ, అబార్షన్లు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి.
కర్నూలులోని కొత్తబస్టాండ్‌ ఎదురుగా ఉండే జేపీ హాస్పిటల్స్‌ను ఇంటర్‌ మీడియట్‌ చదివిన యువకులు ఎండీ డాక్టర్లుగా చలామణి అయ్యి నిర్వహించేవారు. వీరే ఆదోనిలోనూ విజయగౌరి హాస్పిటల్‌ను నిర్వహించారు. విజిలెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఆస్పత్రులను సీజ్‌ చేశారు.  
నిబంధనలకు విరుద్ధంగా టైఫాయిడ్, జాండిస్‌ వ్యాక్సిన్లు వేస్తూ ప్రజలను మోసగిస్తున్న కర్నూలు నగరం నెహ్రూనగర్‌కు చెందిన నకిలీ వైద్యుణ్ని 8 నెలల క్రితం విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇతను 20 ఏళ్లుగా క్లినిక్‌ ఏర్పాటు చేసుకుని దర్జాగా వైద్యం చేసిన ఉదంతం వెలుగు చూసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement