vigilence attacks
-
నిడదవోలులో విజిలెన్స్ దాడులు
పశ్చిమగోదావరి, నిడదవోలు : నిడదవోలు పట్టణంలో పలు దుకాణాలపై శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వరదరాజు ఆదేశాల మేరకు పట్టణంలో గణేష్‌చౌక్ సెంటర్లోని దేవి విజయలక్ష్మీ ఫ్లోర్ అండ్ అయిల్ మిల్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ దుకాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. అనుమతులు లేకుండా లూజ్‌గా నూనె ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వేరుశనగ, పామాయిల్, నువ్వుల నూనె, కారం శాంపిల్స్ సేకరించారు. వీటిని హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించిన అనంతరం షాపు యజమాని బి.సత్యనారాయణపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇదే సెంటర్లో విజయదుర్గ స్వీట్స్ అండ్ బేకరీ, కూల్‌డ్రింక్స్ షాపులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ షాపునకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. షాపులో కమర్షియల్ గ్యాస్ సిలెండర్లకు బదులుగా డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్లు ఉన్నట్లు గుర్తించారు. కాలపరిమితి దాటిన క్రీమ్ బాటిల్స్ ఉన్నట్లు నిర్ధారించారు. షాపు యజమాని ఆకుల దుర్గా ఆంజనేయ ప్రసాద్‌పై 6(ఎ)కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై కె.ఏసుబాబు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దారు పి.రవికుమార్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రి అండతో అక్రమాలు.. మిల్లర్లపై విజిలెన్స్ దాడులు
సాక్షి, విజయవాడ: జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై విజిలెన్స్ దాడులు చేపట్టాయి. ధాన్యం కొనుగోళ్ళలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ అండతో రైస్ మిల్లర్లు ఓ మాఫియాగా మారారు. దళారీల నుంచి భారీగా ధాన్యం కొనుగోళ్ళు చేస్తున్నారు. కానీ, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరించినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్యే అండతో రైస్ మిల్లర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. హనుమాన్ జంక్షన్ లోని రెండు మిల్లుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యాన్ని పట్టుకున్నారు. రెవెన్యూ సిబ్బందితో స్థానిక రైతులు పండించిన ధాన్యంగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి మోసం చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు వీఆర్వోలపై వేటు వేశారు. సిపిల్ సప్లై అధికారులకూ ఈ అవినీతిలో వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రూ.కోట్లలో రైతుల పేరిట పక్కదారి పట్టినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. మీడియాపైనా చిందులు!
సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. తాను నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు పెదవేగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింతమనేని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమను భయభ్రాంతులకు గురిచేశారని వెజిలెన్స్ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం కొప్పాక వద్ద సాగుతున్న అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి.. నాలుగు టిప్పర్లు, ప్రొక్లైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం ఈ మేరకు దాడులు చేసింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న చింతమనేని విజిలెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా టిప్పర్లనే సీజ్ చేస్తారా? మా వాళ్లపైనే కేసులా?’ అంటూ ఆయన దౌర్జన్యానికి దిగారు. సీజ్ చేసిన వాహనాలు వదలాలంటూ అధికారులను బెదిరించారు. అయినా వాహనాలను వదలకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని వెనుదిరగగా.. ఆయన ప్రోద్బలంతో కొద్దిసేపటికి చింతమనేని సోదరుడు, దుగ్గిరాల మాజీ సర్పంచ్ చింతమనేని సతీష్ ఆధ్వర్యంలో వందమంది టీడీపీ కార్యకర్తలు విజిలెన్స్ అధికారులను చుట్టుముట్టారు. విజిలెన్స్ బృందాన్ని భయభ్రాంతులకు గురిచేసి.. సీజ్ చేసిన నాలుగు వాహనాలను తీసుకెళ్లిపోయారు. జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు విజిలెన్స్ డీజీ దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు. మీడియాపైనా రౌడీయిజం! ఈ ఘటన నేపథ్యంలో విజిలెన్స్ కార్యాలయంలో ఎస్పీ అచ్యుతరావుని కలిసిన చింతమనేని ప్రభాకర్ .. అనంతరం మీడియాతోను దురుసుగా ప్రవర్తించారు. వివరణ కోరేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపైకి దూసుకెళుతూ.. చింతమనేని బూతుపురాణం విపారు. ‘మీ అంతు తేలుస్తా.. తొక్కిపెట్టి నారతీస్తా నా కోడక్కల్లారా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కెమారామెన్లు, మీడియా ప్రతినిధులు బిత్తరపోయారు. కాగా, అక్రమ మైనింగ్ చేస్తున్న నాలుగు టిప్పర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. వాటిని ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని, ఈ ఘటనపై పెదవేగి పోలీసులకి ఫిర్యాదు చేశామని విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు మీడియాతో తెలిపారు. -
మెడికల్‌షాపులపై విజిలెన్స్ దాడులు
విజయవాడ:నగరంలోని మెడికల్‌షాపులపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు జరిపారు. ఐదు బృందాలు ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో మందుల షాపులు, ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. నక్కల్రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులోని 22 షాపులపై దాడులు నిర్వహించారు. దాదాపు అన్ని షాపుల్లో రిజిస్ట్రర్లు సక్రమంగా లేవని గుర్తించారు. 11 షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండా మందుల క్రయవిక్రయాలు జరగుతున్నాయి. నక్కల్ రోడ్డులో రాజేంద్రమెడికల్స్, సాయిపూర్ణిమ మెడికల్స్, మక్కెన హాస్పటల్స్, గుణదల లక్ష్మీ మెడికల్ప్లో కాలం చెల్లిన మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 22 షాపుల యజమానులకు డ్రగ్ఇన్స్పెక్టర్లు షోకాజ్ నోటీలు జారీ చేశారు. విజిలెన్స్ ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో డీఎస్పీ విజయపాల్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. -
అంతాకల్తీ.. మానెయ్యి
విజయవాడ నగరంలో కల్తీ నెయ్యి వ్యాపారంఅక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా కల్తీ నెయ్యి వ్యాపారంమాత్రం జోరుగా సాగుతూనే ఉంది. కల్తీనెయ్యి విజయవాడతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. సాక్షి, విజయవాడ: కల్తీ నెయ్యి విజయవాడ కేంద్రంగా తయారవుతోంది. ఏడాది కాలంగా అధికారులు నగరంలోని దేవినగర్, అయ్యప్పనగర్, రాజరాజేశ్వరీపేట, సింగ్‌నగర్, నున్న తదితర ప్రాంతాల్లో దాడులు చేసి 40కు పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో సుమారు కోటి రూపాయల విలువ చేసే 245 క్వింటాళ్ల కల్తీ నెయ్యిని ఫుడ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, మంచి నెయ్యి కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. కిలో నెయ్యి తయారీకి సుమారు 350 గ్రాముల వనస్పతి, 500 గ్రాముల పామాయిల్, 150 గ్రాముల మంచి నెయ్యి వాడుతారు. వనస్పతి కలపడం వల్ల నెయ్యి పూస కడుతుంది. నెయ్యి రంగు వచ్చేందుకు రంగులు, వాసన కోసం రసాయనాలు కలుపుతారు. జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వును కూడా కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యిని వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఒక్కొక్క కల్తీ సంస్థ వద్ద కనీసం ఐదు నుంచి ఏడు బ్రాండ్లను తలపించేలా లేబుళ్లను అధికారులు గుర్తించారు. నెయ్యి ప్యాకెట్‌ను సీల్ చేసి ఉంచడంతో సామాన్యులు కనుక్కోవడం కూడా కష్టమేనని అధికారులు చెబుతున్నారు. కిలో కల్తీ నెయ్యి తయారు చేయడానికి రూ.80 మాత్రమే ఖర్చవుతుందని, లేబుల్‌పై మాత్రం రూ.500 వరకు ధర ముద్రించి రిటైల్ వ్యాపారస్తులకు రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రూ.50 డిస్కౌంట్ ఇచ్చి రూ.450 చొప్పున విక్రయిస్తారు. కిలో కల్తీ నెయ్యి అమ్మితే తయారీ దారుడికు రూ.220 వరకు, రిటైల్ వ్యాపారికి రూ.100 వరకు మిగులుతుందని, నాణ్యమైన నెయ్యి విక్రయిస్తే లాభం రూ.40కి మించదని వివరిస్తున్నారు. నగరంలోనే రూ.2 కోట్ల వ్యాపారం విజయవాడలోనే ప్రతి నెలారూ.2 కోట్లు నెయ్యి వ్యాపారం జరుగుతోందని అంచనా. ఆహార పదార్థాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కోసం గేదె పాల నుంచి తయారైన నెయ్యి ఉపయోగిస్తారు. ఇందులో కనీసం 30 శాతం వరకు కల్తీనెయ్యి వ్యాపారం జరుగుతోందని అంచనా. కల్తీ నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యానికి హాని తప్పదని, ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తాయని, కిడ్నీలు, లివర్ దెబ్బ తింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కల్తీ నెయ్యి తయారీపై నిఘా నగరంలో కల్తీ నెయ్యి తయారు చేసే వారిపై గట్టి నిఘా పెట్టాం. ఫిర్యాదులు వచ్చినా, అనుమానం వచ్చినా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. పోలీసుల సహకారంతో తయారీదారులను అరెస్టు చేయిస్తున్నాం. ఈ దాడులు ఇక ముందు కూడా కొనసాగిస్తాం. కల్తీ నెయ్యి గురించి తెలిసిన వారు మాకు సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. – ఎన్.పూర్ణచంద్రరావు,అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీర్ణాశయ సంబంధ వ్యాధులు కల్తీ నెయ్యి తినడం వల్ల లివర్, కిడ్నీలు దెబ్బతింటాయి. జీర్ణాశయ సంబంధ వ్యాధులు వస్తాయి. కొంతమంది పేగులకు కల్తీ నెయ్యి అంటుకుని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో కలిపే పదార్థాలనుబట్టి కిడ్నీలు, రక్తనాళాలపై దుష్ప్రభావం పడుతుంది. కల్తీ నెయ్యివాడే బదులు అసలు నెయ్యి లేకుండా భోజనం చేయడం మంచిది. – డాక్టర్ పి.ఎస్.పి.వి.రత్నగిరి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
అమలాపురం టౌన్: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు అమలాపురంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువరం ఆకస్మిక దాడులు చేశారు. ప్రధానంగా రెండు ఎరువుల దుకాణాలపై దాడులు చేసి స్టాక్‌లు, బిల్లులను తనిఖీ చేశారు. పట్టణంలోని అనంత లక్ష్మి సీడ్స్, గంగా సీడ్స్‌కు చెందిన ఎరువుల దుకాణాల్లో ఈ దాడులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగాయి. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆదేశాల మేరకు సీఐ టి.రామమోహనరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో ఈ దాడులు, తనిఖీలు జరిగాయి. ఈ రెండు దుకాణాలకు ఆయా కంపెనీల నుంచి వచ్చిన ఎరువుల స్టాక్‌కు గోడౌన్లలో ఉన్న స్టాక్‌కు లెక్కలు తేడా వచ్చాయని విజిలెన్స్ సీఐ రామ్మోహనరెడ్డి తెలిపారు. అలాగే రైతులకు అమ్మిన ఎరువులను బిల్లులను కూడా తనిఖీ చేశారు. స్టాక్‌లు, బిల్లుల పరంగా తేడాలు ఉండడంతో ఆ రెండు దుకాణాల్లో రూ.8.33 లక్షల విలువైన ఎరువు బస్తాలను సీజ్ చేశామని సీఐ వెల్లడించారు. ఎరువులు కొనుగోలు చేసి వెళుతున్న కొంత మంది రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఏఓ మహేష్ భగవత్, రెవెన్యూ అధికారులతో కలిసి ఈ తనిఖీలు చేశారు. పట్టణంలోని కొన్ని ప్రముఖ ఎరువుల దుకాణాలను కూడా సోదాలు చేశారు. -
డిగ్రీ ఫెయిల్..30 ఏళ్లకు పైగా వైద్యం
కర్నూలు(హాస్పిటల్)/కల్లూరు/ ఎమ్మిగనూరు రూరల్: ఒకడు ఇంటర్ చదివి వైద్యం చేస్తాడు. మరొకడు డిగ్రీ ఫెయిలైనా మెడలో స్టెతస్కోపు వేసుకుంటాడు. నకిలీ ఆయుర్వేద, యునాని సర్టిఫికెట్లు కొని తెచ్చుకుని దర్జాగా తెల్లకోటు వేసుకుంటాడు మరో ప్రబుద్ధుడు. ఇలా ఒకటా, రెండా..తరచూ ఎక్కడోచోట నకిలీ డాక్టర్ల లీలలు బయటపడుతూనే ఉన్నాయి. అడ్డగోలు సంపాదనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నప్పుడు మాత్రమే వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు విచారణ పేరిట హడావుడి చేస్తున్నారు. తాజాగా బుధవారం కల్లూరు, ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల దాడుల్లో ‘శంకర్‌దాదాల’ గుట్టు రట్టయ్యింది. హెల్త్ ఎడ్యుకేటర్ ఏకంగా డాక్టర్ అవతారమెత్తాడు! కల్లూరు ఎస్టేట్స్‌లోని పందిపాడు గ్రామంలో సుఖీభవ ఆస్పత్రి ఏర్పాటు చేసిన నాగప్రకాష్ గతంలో వైద్య, ఆరోగ్యశాఖలో హెల్త్ ఎడ్యుకేటర్‌గా పనిచేశాడు. కొన్నాళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసుపత్రి నిర్మించాడు. కల్లూరులో అతను ఓ పెద్ద డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ విషయం తెలిసి విజిలెన్స్ అధికారులు రెక్కీ నిర్వహించారు. బుధవారం విజిలెన్స్ సీఐలు శ్రీనివాసరెడ్డి, జీవన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ జయన్న, కానిస్టేబుళ్లు నాగభూషణరావు, మునిస్వామి ఆస్పత్రిపై దాడి చేశారు. ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన డీఎం అండ్‌హెచ్‌ఓ, ఫైర్, పొల్యూషన్ తదితర అనుమతులు ఏమేరకు ఉన్నాయో రికార్డులు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారి అర్హతలనూ అడిగి తెలుసుకున్నారు. నాగప్రకాష్, టి.లక్ష్మినారాయణ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్న ఈ ఆస్పత్రిలో నాగప్రకాష్ వైద్యునిగానూ చలామణి అవుతున్నట్లు వెలుగు చూసింది. అలాగే డ్యూటీ డాక్టర్లుగా యునానీ చేసిన రేష్మాబేగం, ఎస్. షాహీన్ బేగం, మూసుం బాషాలను పెట్టుకుని..వారితో అల్లోపతి వైద్యం చేయిస్తున్నట్లు తేలింది. కాగా..తమ ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అర్హులైన వైద్యులను పిలిపించి రోగులకు చికిత్స చేయిస్తున్నామని నాగప్రకాష్ వివరణ ఇచ్చారు. డిగ్రీ ఫెయిల్..30 ఏళ్లకు పైగా వైద్యం ఎమ్మిగనూరు మండలం పార్లపల్లికి చెందిన నరహరిరెడ్డి డిగ్రీ ఫెయిలయ్యాడు. అతని కుమారుడు శ్రీనివాసరెడ్డి ఇంటర్ వరకు చదివాడు. నరహరిరెడ్డి పార్లపల్లిలో ధనుంజయ్ అనే ఆర్ఎంపీ దగ్గర అరకొర వైద్యం నేర్చుకున్నాడు. అనంతరం గూడూరు మండలం సి.బెళగల్‌కు వెళ్లి అక్కడ దాదాపు 18 ఏళ్లపాటు క్లినిక్ నడిపాడు. 1994లో ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చి స్థానిక శకుంత సర్కిల్లో శ్రీనరహరి క్లినిక్ ప్రారంభించాడు. దానికి సమీపంలోనే కుమారుడితో మెడికల్ షాప్ పెట్టించాడు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా చలామణి అవుతూ రోగులకు వైద్యం చేస్తుండేవాడు. అవసరం లేకున్నా ఎక్కువ మందులు రాసిచ్చి తన కుమారుడి మెడికల్ షాపునకు పంపేవాడు. ఇతని వ్యవహారం విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారు. రోగుల మాదిరి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. తండ్రి లేని సమయంలో కుమారుడు శ్రీనివాసరెడ్డి కూడా వారికి వైద్యం అందించాడు. బుధవారం మళ్లీ విజిలెన్స్ ఉద్యోగి ఒకరు పేషెంట్ మాదిరి వెళ్లారు. శరీరంలో గడ్డలు ఉన్నాయని, సాయిరాం హాస్పిటల్‌కు వెళ్లి స్కానింగ్ తీయించుకురావాలని నరహరిరెడ్డి సూచించాడు. దీంతో స్కానింగ్ తీయించుకొచ్చారు. రిపోర్టులో ఏమీ లేదని బయటపడటంతో ‘లోపల బెడ్‌పై పడుకోండి.. సెలైన్ ఎక్కిస్తా’నని నరహరిరెడ్డి చెప్పాడు. సరే అని బెడ్‌పై పడుకున్నారు. అదే సమయంలో నకిలీ డాక్టర్ సెలైన్ ఎక్కించేందుకు రావటంతో విజిలెన్స్ అ«ధికారులు దాడి చేశారు. ‘నీవు వైద్యం చేసేందుకు అర్హత సర్టిఫికెట్లు ఏమి ఉన్నాయ’ని ప్రశ్నించారు. అతను సరైన సమాధానం చెప్పకుండా అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు వెంకటేశ్వర్లు, జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇక్కడ రోజూ వంద మంది దాకా వైద్యం చేయించుకునేవారని, నరహరిరెడ్డి వద్ద ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్టిఫికెట్ ఉందని, దానిపైనా విచారణ చేస్తామని చెప్పారు. జిల్లాలో నకిలీ డాక్టర్ల గురించి సమాచారమిస్తే వారి భరతం పడతామని ప్రజలకు సూచించారు. దాడుల్లో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, విజిలెన్స్ అధికారి ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్‌లు కలిపి 393 రిజిష్టర్ అయ్యాయి. రెన్యువల్, కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం మరో 50 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. రిజిష్టరైన 393 ఆసుపత్రులు, క్లినిక్‌ల్లోనూ 70 మినహా అన్నీ కాలపరిమితి తీరిపోయాయి. వీటిని రెన్యువల్ చేయించుకోవడం లేదు. కొందరు రెన్యువల్ చేయించుకుందామని వైద్య, ఆరోగ్యశాఖకు వెళితే అక్కడ మామూళ్ల బెడద తప్పడం లేదు. వారు అడిగే మామూళ్లు ఇవ్వకపోతే ఫైళ్లు పెండింగ్ పడుతున్నాయి. ఇక నకిలీ డాక్టర్లు కూడా పెద్దసంఖ్యలోనే పుట్టుకొస్తున్నారు. ముందు ఎవరైనా డాక్టర్ వద్ద కాంపౌండర్(అసిస్టెంట్)గా చేరి కొన్నాళ్ల తర్వాత డాక్టర్ అవతారం ఎత్తుతున్న వారు చాలామందే ఉంటున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా మెడలో స్టెత్ వేసుకుని, తెల్లకోటు ధరించి దర్జాగా రోగులకు వైద్యం చేస్తున్నారు. వీరి వ్యవహారం బయటపడేంత వరకు అల్లోపతి వైద్యులుగానే చలామణి అవుతున్నారు. విజిలెన్స్ అధికారులు కొన్నాళ్లుగా సీజ్ చేసిన ఆసుపత్రులు ♦ గూడూరులో 15 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా అనురాధ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న శ్రీరాములు అనే వ్యక్తిని పట్టుకుని, ఆసుపత్రిని సీజ్ చేశారు. ఆయన వైద్యవృత్తి చేయడానికి ఎలాంటి కోర్సునూ చదవలేదు. అయినా ఆయుర్వేద రత్న అని, సర్టిఫికెట్ ఆఫ్ చిల్డ్రన్స్ హెల్త్ అని బోర్డు పెట్టుకున్నాడు. ఏకంగా 50 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్వహించేవాడు. గర్భిణులకు ప్రసవాలు, లింగనిర్ధారణ, అబార్షన్లు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. ♦ కర్నూలులోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉండే జేపీ హాస్పిటల్స్‌ను ఇంటర్ మీడియట్ చదివిన యువకులు ఎండీ డాక్టర్లుగా చలామణి అయ్యి నిర్వహించేవారు. వీరే ఆదోనిలోనూ విజయగౌరి హాస్పిటల్‌ను నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఆస్పత్రులను సీజ్ చేశారు. ♦ నిబంధనలకు విరుద్ధంగా టైఫాయిడ్, జాండిస్ వ్యాక్సిన్లు వేస్తూ ప్రజలను మోసగిస్తున్న కర్నూలు నగరం నెహ్రూనగర్‌కు చెందిన నకిలీ వైద్యుణ్ని 8 నెలల క్రితం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇతను 20 ఏళ్లుగా క్లినిక్ ఏర్పాటు చేసుకుని దర్జాగా వైద్యం చేసిన ఉదంతం వెలుగు చూసింది. -
కృత్రిమ పదార్థాలతో పాల తయారీ
బుక్కరాయసముద్రం: కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేసి హోటళ్లు, స్వీట్‌స్టాళ్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారిని విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. బుక్కరాయసముద్రం మండలం జంతులూరుకు చెందిన రామచంద్ర పాల వ్యాపారి. గేదెల ద్వారా 40 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నాడు. అయితే త్వరగా ధనవంతుడు కావాలన్న అత్యాశతో కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేయడం ఆరంభించాడు. అలా రోజుకు 400 లీటర్ల పాలను అనంతపురం నగరంలోని పలు హోటళ్లు, స్వీట్‌స్టాళ్లకు సరఫరా చేస్తున్నాడు. అంతా గుట్టుగానే..: కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేసే రామచంద్ర తన ఇంట్లోకి ఎవరినీ రానించేవాడు కాదు. ప్రత్యేక గదిలో ఉదయాన్నే పాలు తయారు చేసి నగరంలో విక్రయించేవాడు. రోజుకు పది వేల రూపాయల ప్రకారం నెలకు రూ.3లక్షల దాకా సంపాదించేవాడు. ఇలా ఏడాదిపాటు వ్యాపారం గుట్టుగా సాగింది. పాడి పశువుల సంఖ్యకు పాల ఉత్పత్తికి భారీగా తేడా ఉండటం గమనించిన కొంతమంది గ్రామస్తులు ఈ వ్యవహారంపై నిఘా ఉంచారు. ఇక్కడ ఏదో జరుగుతోందని విజిలెన్స్ అధికారులకు, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సమాచారం ఇచ్చారు. ‘విజిలెన్స్’ మెరుపు దాడి: జంతులూరులో రామచంద్ర కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేస్తున్నాడనే పక్కా సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ రామక్రిష్ణ, ఫుడ్ కంట్రోల్ అధికారి నాగేశ్వరయ్య, పోలీసు బృందంతో బుధవారం ఆ ఇంటిపై మెరుపు దాడి నిర్వహించారు. పాల తయారీకి వినియోగించే గోల్డెన్ ఆయిల్, చక్కెర, పాలపొడి, లిక్విడ్‌తోపాటు 400 లీటర్ల పాలు స్వాధీనం చేసుకున్నారు. పాల శ్యాపింల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. పాల తయారీదారుడు రామచంద్రని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. -
భారీగా మిర్చి విత్తనాలు స్వాధీనం
-
భారీగా మిర్చి విత్తనాలు స్వాధీనం
కొణిజెర్ల: ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలంలో విజిలెన్స్ అధికారులు భారీగా మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పల్లిపాడులోని స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజిపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1.40 లక్షల బస్తాల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిల్వలను సీజ్ చేసి, నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. -
ఇసుకపై నిఘా
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ ఇసుక క్వారీల నిర్వహణ తీరుపై ఫిర్యాదులు, ఆరోపణలు ఎక్కువ కావడంతో విజిలెన్స్ విభాగం విచారణ మొదలుపెట్టింది. క్వారీల నిర్వహణ తీరును పూర్తిగా పరిశీలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై పలు క్వారీలకు అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని ఇసుక క్వారీల్లో నిర్వహణ లోపాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది తీరుతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోందని ఆదివాసీ సంఘాల నాయకులు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. గిరిజనులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన క్వారీలు.. నిర్వహణ లోపాలతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నెరవేడం లేదని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ విభాగం క్వారీల నిర్వహణపై విచారణ మొదలుపెట్టింది. ఏటూరునాగారం ఇసుక క్వారీలో 2015 మార్చి 11 నుంచి 2016 ఏప్రిల్ 1 వరకు 13,62,050 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరిగాయి. గనుల శాఖకు రూ.5.40 కోట్ల ఆదాయం సమకూరింది. తుపాకులగూడెం క్వారీకి సంబంధించి 1,37,500 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించగా, రూ.5.50 లక్షల ఆదాయం సమకూరింది. ఈ క్వారీల్లో విక్రయించే ఇసుకతో ఆయా గ్రామాల్లోని గిరిజన సొసైటీల సభ్యులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక విక్రయాలతో పోల్చితే సొసైటీ సభ్యులకు ఇచ్చిన మొత్తం తక్కువగా ఉందని విజిలెన్స్ శాఖకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఈ విషయంపై విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. క్వారీల వారీగా విక్రయాలు, వసూలైన డబ్బులు, సొసైటీ సభ్యులకు చెల్లింపు లెక్కలను పరిశీలించేందుకు సన్నద్ధమైంది. ఆడిట్‌కు ఆదేశాలు... విజిలెన్స్ విభాగం విచారణకు ఉపక్రమించగా... క్వారీల వారీగా అమ్మకాలు, వచ్చిన ఆదాయం, సొసైటీ సభ్యులకు ఇచ్చిన మొత్తం వంటి లెక్కలపై ఆడిట్ నిర్వహించాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) విచారణకు ఆదేశించింది. ఇసుక విక్రయాలకు, సొసైటీ సభ్యులు ఇచ్చిన మొత్తాలకు తేడా ఉందనే ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై ఆడిట్ నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అమయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. – మిగతా 7లోu -
ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై విజిలెన్స్ కొరడా
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని రావులపాలెంలో ఓ ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ఈ దాడులు చేశామని ఓ అధికారి తెలిపారు. రూ. 30 లక్షల విలువైన విత్తనాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్, మారుతి ఫెర్టిలైజర్స్ అనే రెండు షాపుల్లో అనుమతుల్లేకుండా రసాయనిక ఎరువులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ దాడుల్లో సీఐ రాఘవన్, మండల వ్యవసాయ అధికారి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. వెంటనే రసాయనిక ఎరువుల విక్రయాలను నిలిపివేయించారు.