దేవి విజయలక్ష్మీ ఫ్లోర్ అండ్ అయిల్ మిల్‌లో నూనె విక్రయాలు పరిశీలిస్తున్న అధికారులు
పశ్చిమగోదావరి, నిడదవోలు : నిడదవోలు పట్టణంలో పలు దుకాణాలపై శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ వరదరాజు ఆదేశాల మేరకు పట్టణంలో గణేష్‌చౌక్ సెంటర్‌లోని దేవి విజయలక్ష్మీ ఫ్లోర్ అండ్ అయిల్ మిల్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ దుకాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. అనుమతులు లేకుండా లూజ్‌గా నూనె ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వేరుశనగ, పామాయిల్, నువ్వుల నూనె, కారం శాంపిల్స్ సేకరించారు. వీటిని హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించిన అనంతరం షాపు యజమాని బి.సత్యనారాయణపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇదే సెంటర్‌లో విజయదుర్గ స్వీట్స్ అండ్ బేకరీ, కూల్‌డ్రింక్స్ షాపులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ షాపునకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. షాపులో కమర్షియల్ గ్యాస్ సిలెండర్లకు బదులుగా డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్లు ఉన్నట్లు గుర్తించారు. కాలపరిమితి దాటిన క్రీమ్ బాటిల్స్ ఉన్నట్లు నిర్ధారించారు. షాపు యజమాని ఆకుల దుర్గా ఆంజనేయ ప్రసాద్‌పై 6(ఎ)కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై కె.ఏసుబాబు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తహసీల్దారు పి.రవికుమార్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment