మృతురాలు జయమాధవి గొంతుపై ఉన్న గాయాలు, రావి జయమాధవి, గాదిరెడ్డి శివ సుబ్రహ్మణ్యం (ఫైల్)
నిడదవోలు(పశ్చిమగోదావరి): ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు.. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగాలు చేస్తున్న సమయంలో కొంత కాలంగా కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. చివరకు అత్తారింటి బాధలకు నిండు గర్భిణి బలైపోయింది. నిడదవోలుకు చెందిన రావి జయమాధవి (28) బెంగళూరు కేఆర్ పురంలో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇవి. నిడదవోలు 4 వార్డులో నివాసముంటున్న రావి ధనంజయరావు, ధనలక్ష్మీలకు కుమార్తె జయమాధవి, కుమారుడు శ్రీనివాసరావు సంతానం. శ్రీనివాసరావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తండ్రి ధనంజయరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. 2018 మార్చిలో కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గాదిరెడ్డి శివ సుబ్రహ్మణ్యంతో జయమాధవి వివాహం చేశారు. వివాహ సమయంలో వరకట్నం రూ.30 లక్షలు, 300 గ్రామలు బంగారం, రూ.2 లక్షల ఆడపడుచు కట్నం ఇచ్చారు.
బెంగళూరు కేఆర్ పురంలో జయమాధవి డెలెట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భర్త శివ సుబ్రహ్మణ్యం అదే నగరంలోని ఐబీఎం కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. జయమాధవి ఇటీవల పర్సనల్ లోన్ తీసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తీసుకున్న రుణానికి ప్రతినెలా ఈఎంఐలు కడుతోంది. రుణం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో చెప్పమని భర్త వేధించడం ప్రారంభించాడు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. జయమాధవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అక్కడ నుంచి నిడదవోలులోని ఆమె పుట్టింటికి సమాచారం అందింది. తన కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదని, ఆమెను భర్త, అత్తగారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశారని ధనంజయరావు ఆరోపిస్తున్నాడు. ఎనిమిది నెలల గర్భిణిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యాడు. తన కుమార్తె గొంతు మీద గాయాలు ఉన్నాయని, దారుణంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు కేఆర్ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు.
పర్సనల్ లోన్ ఎందుకు తీసుకుంది...
ఇటీవల జయమాధవి పర్సనల్ లోన్ తీసుకోవడంతో భర్త బాధిస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. బెంగళూరు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం ఎంతో ప్రేమగా తమ ముందు నటించేవాడని, అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ ఇబ్బందులు పెట్టేవాడని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలో పాటిమీద సెంటర్‌లో ఉన్న సిరి సెల్ షాపు యజమాని బ్రాహ్మణగూడెంకు చెందిన పుల్లేటికుర్తి చంద్రశేఖర్ తమ ఇంటికి వచ్చి జయమాధవి ఫోటోలు చూపించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు గత ఏడాది డిసెంబర్‌లో నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ ఆమె తల్లిదండ్రులు ధనంజయరావు, ధనలక్ష్మి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జయమాధవి పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవలసి వచ్చిందనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment