డ్రమ్ముల్లో నిల్వచేసిన కల్తీనెయ్యి, తయారీ కేంద్రంలో అధికారుల తనిఖీలు
విజయవాడ నగరంలో కల్తీ నెయ్యి వ్యాపారంఅక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా కల్తీ నెయ్యి వ్యాపారంమాత్రం జోరుగా సాగుతూనే ఉంది. కల్తీనెయ్యి విజయవాడతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది.
సాక్షి, విజయవాడ: కల్తీ నెయ్యి విజయవాడ కేంద్రంగా తయారవుతోంది. ఏడాది కాలంగా అధికారులు నగరంలోని దేవినగర్, అయ్యప్పనగర్, రాజరాజేశ్వరీపేట, సింగ్‌నగర్, నున్న తదితర ప్రాంతాల్లో దాడులు చేసి 40కు పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో సుమారు కోటి రూపాయల విలువ చేసే 245 క్వింటాళ్ల కల్తీ నెయ్యిని ఫుడ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, మంచి నెయ్యి కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. కిలో నెయ్యి తయారీకి సుమారు 350 గ్రాముల వనస్పతి, 500 గ్రాముల పామాయిల్, 150 గ్రాముల మంచి నెయ్యి వాడుతారు. వనస్పతి కలపడం వల్ల నెయ్యి పూస కడుతుంది. నెయ్యి రంగు వచ్చేందుకు రంగులు, వాసన కోసం రసాయనాలు కలుపుతారు.
జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వును కూడా కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యిని వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఒక్కొక్క కల్తీ సంస్థ వద్ద కనీసం ఐదు నుంచి ఏడు బ్రాండ్లను తలపించేలా లేబుళ్లను అధికారులు గుర్తించారు. నెయ్యి ప్యాకెట్‌ను సీల్ చేసి ఉంచడంతో సామాన్యులు కనుక్కోవడం కూడా కష్టమేనని అధికారులు చెబుతున్నారు. కిలో కల్తీ నెయ్యి తయారు చేయడానికి రూ.80 మాత్రమే ఖర్చవుతుందని, లేబుల్‌పై మాత్రం రూ.500 వరకు ధర ముద్రించి రిటైల్ వ్యాపారస్తులకు రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రూ.50 డిస్కౌంట్ ఇచ్చి రూ.450 చొప్పున విక్రయిస్తారు. కిలో కల్తీ నెయ్యి అమ్మితే తయారీ దారుడికు రూ.220 వరకు, రిటైల్ వ్యాపారికి రూ.100 వరకు మిగులుతుందని, నాణ్యమైన నెయ్యి విక్రయిస్తే లాభం రూ.40కి మించదని వివరిస్తున్నారు.
నగరంలోనే రూ.2 కోట్ల వ్యాపారం
విజయవాడలోనే ప్రతి నెలారూ.2 కోట్లు నెయ్యి వ్యాపారం జరుగుతోందని అంచనా. ఆహార పదార్థాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కోసం గేదె పాల నుంచి తయారైన నెయ్యి ఉపయోగిస్తారు. ఇందులో కనీసం 30 శాతం వరకు కల్తీనెయ్యి వ్యాపారం జరుగుతోందని అంచనా. కల్తీ నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యానికి హాని తప్పదని, ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తాయని, కిడ్నీలు, లివర్ దెబ్బ తింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కల్తీ నెయ్యి తయారీపై నిఘా
నగరంలో కల్తీ నెయ్యి తయారు చేసే వారిపై గట్టి నిఘా పెట్టాం. ఫిర్యాదులు వచ్చినా, అనుమానం వచ్చినా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. పోలీసుల సహకారంతో తయారీదారులను అరెస్టు చేయిస్తున్నాం. ఈ దాడులు ఇక ముందు కూడా కొనసాగిస్తాం. కల్తీ నెయ్యి గురించి తెలిసిన వారు మాకు సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. – ఎన్.పూర్ణచంద్రరావు,అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్
జీర్ణాశయ సంబంధ వ్యాధులు
కల్తీ నెయ్యి తినడం వల్ల లివర్, కిడ్నీలు దెబ్బతింటాయి. జీర్ణాశయ సంబంధ వ్యాధులు వస్తాయి. కొంతమంది పేగులకు కల్తీ నెయ్యి అంటుకుని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో కలిపే పదార్థాలనుబట్టి కిడ్నీలు, రక్తనాళాలపై దుష్ప్రభావం పడుతుంది. కల్తీ నెయ్యివాడే బదులు అసలు నెయ్యి లేకుండా భోజనం చేయడం మంచిది. – డాక్టర్ పి.ఎస్.పి.వి.రత్నగిరి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు
Comments
Please login to add a commentAdd a comment