పాల తయారీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు
బుక్కరాయసముద్రం: కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేసి హోటళ్లు, స్వీట్‌స్టాళ్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారిని విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. బుక్కరాయసముద్రం మండలం జంతులూరుకు చెందిన రామచంద్ర పాల వ్యాపారి. గేదెల ద్వారా 40 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నాడు. అయితే త్వరగా ధనవంతుడు కావాలన్న అత్యాశతో కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేయడం ఆరంభించాడు. అలా రోజుకు 400 లీటర్ల పాలను అనంతపురం నగరంలోని పలు హోటళ్లు, స్వీట్‌స్టాళ్లకు సరఫరా చేస్తున్నాడు.
అంతా గుట్టుగానే..: కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేసే రామచంద్ర తన ఇంట్లోకి ఎవరినీ రానించేవాడు కాదు. ప్రత్యేక గదిలో ఉదయాన్నే పాలు తయారు చేసి నగరంలో విక్రయించేవాడు. రోజుకు పది వేల రూపాయల ప్రకారం నెలకు రూ.3లక్షల దాకా సంపాదించేవాడు. ఇలా ఏడాదిపాటు వ్యాపారం గుట్టుగా సాగింది. పాడి పశువుల సంఖ్యకు పాల ఉత్పత్తికి భారీగా తేడా ఉండటం గమనించిన కొంతమంది గ్రామస్తులు ఈ వ్యవహారంపై నిఘా ఉంచారు. ఇక్కడ ఏదో జరుగుతోందని విజిలెన్స్ అధికారులకు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు సమాచారం ఇచ్చారు.
‘విజిలెన్స్’ మెరుపు దాడి: జంతులూరులో రామచంద్ర కృత్రిమ పదార్థాలతో పాలు తయారు చేస్తున్నాడనే పక్కా సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ రామక్రిష్ణ, ఫుడ్ కంట్రోల్ అధికారి నాగేశ్వరయ్య, పోలీసు బృందంతో బుధవారం ఆ ఇంటిపై మెరుపు దాడి నిర్వహించారు. పాల తయారీకి వినియోగించే గోల్డెన్ ఆయిల్, చక్కెర, పాలపొడి, లిక్విడ్‌తోపాటు 400 లీటర్ల పాలు స్వాధీనం చేసుకున్నారు. పాల శ్యాపింల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. పాల తయారీదారుడు రామచంద్రని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment