రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై ‘సీఐడీ’ వేయండి
నరసాపురం: గత సర్కార్ హయాంలో అన్నదాతలను మోసం చేస్తూ టీడీపీ నేతలు చేసిన రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ కోరింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో లీజు ముగిసిన భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ అమాయకులైన రైతుల నుంచి డబ్బులు దండుకున్న వ్యవహారంపై సమగ్ర దర్యాపునకు ఆదేశాలివ్వాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ‘నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీ’ భూముల రిజిస్ట్రేషన్‌కు కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారాన్ని గతేడాది సెప్టెంబర్ 16న ‘టీడీపీ తీరంతా అవినీతి’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కుంభకోణంపై అప్పటి నరసాపురం సబ్ కలెక్టర్ విచారణ చేసి.. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
బ్రిటిష్ హయాంలో ఇచ్చిన భూములు..
బ్రిటిష్ హయాంలో నరసాపురం తీర ప్రాంతమంతా ఇసుక భూములే. ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కలిసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. తమకు భూములిస్తే.. సాగు చేసుకుని ఉపాధి పొందుతామన్నారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. స్థానిక రైతులంతా కలిసి నరసాపురం అగ్రికల్చర్ కంపెనీగా ఏర్పడ్డారు. దర్భరేవు, మర్రితిప్ప, వేములదీవి ప్రాంతాల్లోని 1,811.33 ఎకరాలను ఈ కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1920లో ఆమోదం తెలిపింది.
అమలు కాని జీవోను అడ్డంపెట్టుకొని..
మొత్తం 1,811.33 ఎకరాల్లో గట్లు, నీటి కుంటలను తీసివేయగా.. నికరంగా 1,754.49 ఎకరాలను 1,485 మంది రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లీజు గడువు ముగింపునకు వచ్చింది. ఈ భూములను ఉచితంగా ఇస్తామంటూ సాగుదారులకు టీడీపీ పాలకులు సరిగ్గా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 2019 జనవరి 24న జీవో కూడా విడుదల చేశారు. ఎకరాకు రూ.1,000 చొప్పున రైతులకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారాలు చూసేందుకు రైతులు సభ్యులుగా ఉన్న ‘కంపెనీ’ బోర్డుకు టీడీపీ నేత కోట్ల సాయి వెంకట రాజా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో కలిసి బోర్డు డైరెక్టర్లు, టీడీపీ స్థానిక నేతలు సజ్జా వీర వెంకట సత్యనారాయణ, మేకా శ్రీధర్ చౌదరి రంగంలోకి దిగారు. రైతుల నుంచి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. డబ్బులివ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసేది లేదంటూ బెదిరించారు. దీంతో 1,485 మంది సాగుదారుల్లో 760 మంది రూ.1.58 కోట్లు ఇచ్చారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవోను మాత్రం అమలు చేయలేదు.. రైతుల పేర్ల మీద భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ కుంభకోణాన్ని గతేడాది ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. బాధిత రైతులు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, అప్పటి సబ్ కలెక్టర్ విశ్వనాథన్‌కు ఫిర్యాదు చేశారు.
రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు
మా కుటుంబానికి కంపెనీ భూముల్లో 5 ఎకరాలున్నాయి. తరతరాలుగా వాటిని సాగు చేసుకుంటున్నాం. 2019 ఎన్నికలకు ముందు మీ భూములు మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాం.. ఎకరాకు రూ.21 వేలు కట్టాలని చెప్పారు. రూ.1,000 ప్రభుత్వానికి, మిగిలినవి ఖర్చులకని చెప్పి.. నా నుంచి రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు. మా నుంచి వసూలు చేసిన డబ్బులను బోర్డు పెద్దలే జేబులో వేసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే వారేమీ జవాబివ్వట్లేదు. సీఐడీ విచారణతో న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం.
– జి.బంగార్రాజు, రైతు, దర్భరేవు