
నాడు ఘన కీర్తి.. నేడు అపకీర్తి
పద్మశ్రీలు పొందిన జీజీహెచ్ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు
క్రమేణా నిర్లక్ష్యంతో వైభవం కోల్పోతున్న వైద్య కళాశాల
యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగానికి గుర్తింపు నిరాకరణ
వైద్యుల రిజిస్ట్రేషన్‌కు తిరస్కరించిన ఏపీ మెడికల్ కౌన్సిల్
గుంటూరు: అనేక దేశాల్లో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న ఎందరో వైద్యులను అందించిన ఘన చరిత్ర గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ప్రభుత్వం పద్మశ్రీలతో సత్కరించింది. కొందరు ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, ప్రముఖ వైద్యులుగా, రాజకీయ నాయకులుగా రాణించారు.
జీజీహెచ్‌లో సరైన సౌకర్యాలు లేనప్పుడే..అప్పటి అధికారులు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించారు. ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. అత్యున్నత వైద్య పరికరాలు, వసతులు ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా విద్యార్థులను తీర్చిదిద్దలేకపోతున్నారు. ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎంసీఐ ఆదేశాలు బేఖాతరు
వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తనిఖీలు నిర్వహించిన ప్రతిసారీ భారత వైద్య మండలి (ఎంసీఐ) అక్కడి వసతులు, వైద్య పరికరాల లేమి, సిబ్బంది కొరత వంటివి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు ఆ పోస్టుకు అర్హులు కాదని, గత తనిఖీల్లో తేల్చి చెప్పింది. కానీ ఈ ఏడాది తనిఖీల సమయంలో అర్హులను ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఒక్కరోజు ఎంసీఐ అధికారుల కళ్లకు గంతలు కట్టారు. గతేడాది సూచనలు పాటించలేదంటూ ఎంసీఐ ఏకంగా 50 ఎంబీబీఎస్ సీట్లకు కోత విధించడంతో రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులు రంగంలో దిగి బతిమాలుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
ఆ తరువాతా గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు లేవు. నిన్న మొన్నటి వరకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పని చేసిన డాక్టర్ వేణుగోపాలరావు, ప్రస్తుతం డీఎంఈగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్‌లోని సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నా పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదు.
రోడ్డున పడిన యూరాలజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసిన వైద్యులు రోడ్లపై తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఈ విభాగంలో సరైన వసతులు, వైద్య పరికరాలు లేవనే కారణంతో ఎంసీఐ గుర్తింపు ఇవ్వలేదు. దీంతో కోర్సు పూర్తి చేసిన వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఎంసీఐ గుర్తింపు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌కు ఏపీ మెడికల్ కౌన్సిల్ తిరస్కరించింది.
యూరాలజీ విభాగాధిపతిగా కొనసాగుతున్న డాక్టర్ సూర్యకుమారి నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌గా డిప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వేతనం తీసుకుంటూ విజయవాడలో పని చేస్తున్నారు. ఎంసీఐ తనిఖీలు, పీజీ పరీక్షలు జరుగుతున్న సమయంలో మాత్రం ఇక్కడ హెచ్‌ఓడీగా ప్రత్యక్షమవుతున్నారు.
గుంటూరు వైద్య కళాశాల్లో చదివిన పూర్వ విద్యార్థులు డాక్టర్ సీఎం హబీబుల్లా, డాక్టర్ గొల్లపల్లి ఎన్ రావు, డాక్టర్ బీ సోమరాజు, డాక్టర్ డీ ప్రసాదరావు, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ నాయుడమ్మ, డాక్టర్ గోపీచంద్ వంటివారు పద్మశ్రీ అవార్డులు తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుత విద్యార్థులు రోడ్డున పడుతున్నారు.