సాక్షి, ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. తాజాగా కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా ఐదేళ్ళ నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. దీంతో కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి వసతులు కూడా మెరుగుపడనున్నాయి.ఎంసీఐ అనుమతుల గురించి వెంకయ్యనాయుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సహా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు దీనికి సంబంధించి మార్గం సుగమం అయింది. ఎంసీఐ అనుమతుల నేపథ్యంలో లాంఛనాలను త్వరితగతిన పూర్తిచేసి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యేలా చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి కేంద్రమంత్రికి సూచించారు. (భారత్ బంద్ : 20 రైతు సంఘాల మద్దతు)
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల.. 2014-15 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో భారతీయ వైద్యమండలి అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే మొదటి బ్యాచ్ విద్యార్థుల శిక్షణాకాలం ముగుస్తున్న సమయంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు చొరవతీసుకొని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాలేజీలో మౌలిక వసతులకు సంబంధించి కళాశాల యాజమాన్యం గతంలో ఇచ్చిన నివేదికలు, నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ భారతీయ వైద్య మండలి అనుమతులు నిరాకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి చొరవతో మరోసారి జనవరి 30, 2020న ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులకు సంబంధించి ఎంసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కేంద్ర బృందం పరిశీలించింది. సంతృప్తికరమైన నివేదిక ఇవ్వడంతో.. కాలేజీకి ఎంసీఐ గుర్తింపు లభించింది. (రెండేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినా!)
Comments
Please login to add a commentAdd a comment