‘ఫాతిమా’ కేసులో ఎంసీఐ, ఏపీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కడప ఫాతిమా మెడికల్ కళాశాల కేసు విచారణ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఫాతిమా కాలేజీ విద్యార్థులను ఇతర కళాశాల్లోకి సర్దుబాటు చేసే పరిస్థితి ఉందా అని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానం ఇస్తూ 13 ప్రభుత్వ, ప్రయివేట్ కాలేజీల్లో విద్యార్థులను సర్ధుబాటు చేస్తామని తెలిపారు. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.
మరోవైపు సుప్రీంకోర్టు నోటీసులపై ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులను ఏవిధంగా రీ లోకేట్ చేసేది... వారం రోజుల్లో న్యాయస్థానానికి తెలుపుతామన్నారు. విద్యార్థులకు నష్టం లేకుండా చూస్తామని, అలాగే ఫాతిమా కాలేజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని తెలిపారు.
కాగా కనీస వసతులు లేని కారణంగా ఫాతిమా ప్రైవేటు వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వలేమని, 2014-15 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు భారత వైద్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యం తప్పిదానికి తమ భవిష్యత్తును ఫణంగా పెట్టడం బాధాకరమని, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.