మాస్క్‌తో రిస్క్ | Serious damage to the environment with the waste of masks | Sakshi
Sakshi News home page

మాస్క్‌తో రిస్క్

Published Thu, Jul 16 2020 4:08 AM | Last Updated on Thu, Jul 16 2020 8:49 AM

Serious damage to the environment with the waste of masks - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కొద్దీ మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా  కట్టడికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారవర్గాలతోపాటు సాధారణ ప్రజలుమాస్కులను తప్పనిసరిగా ధరిస్తున్నారు. వీటిల్లో మెడికల్‌ మాస్కులు అయిన ఎన్‌95 మాస్కులు, సర్జికల్‌ మాస్కులతోపాటు పలు రకాలున్నాయి. 

► ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారు. 
► దేశంలో సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్‌ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి(ఎంసీఐ) అంచనా వేసింది. 
► మన రాష్ట్రంలో రోజుకు దాదాపు 1.20 లక్షల మెడికల్‌ మాస్కులు వాడుతున్నారు. 

వందేళ్ల వరకు మట్టిలోనే.. 
► మెడికల్‌ మాస్కులు సింథటిక్‌ రేసిన్‌తో తయారవుతాయి. వాటిలో పాలిస్టిరిన్, పాలికార్బనేట్, పాలిథిలియన్‌ వంటివి ఉంటాయి. ఆ మాస్కులు మట్టిలో కలసిపోకుండా వందేళ్ల వరకూ భూమిలోనే ఉంటాయి. పర్యావరణానికి తీవ్ర హానికరంగా మారతాయి. 
► ఈ ఏడాది 130 బిలియన్ల మాస్కుల వ్యర్థాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు  అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకునిదర్శనం. అదే జరిగితే సముద్ర జలాల్లోజెల్లీఫిష్‌ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 
► 2030నాటికి సముద్ర జలాల్లోచేరతాయని అంచనా వేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు పదేళ్లు ముందుగానే 2020లోనే పోగుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

వ్యర్థాల నిర్వహణ ఇలా.. 
► మాస్కుల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ప్రభుత్వ సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు విధానాలు నిర్దేశించాయి.   
► ఎన్‌95, సర్జికల్‌ మాస్కులను ఒకసారి మాత్రమే వాడాలి. 
► వైద్యులు, వైద్య సిబ్బంది వాడిన మాస్కులను 850 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 1100 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద  ప్రత్యేక గ్యాస్‌ క్లీనింగ్‌ ఎక్విప్‌మెంట్‌తో కాల్చివేయాలి. 
► సాధారణ ప్రజల వాడేసిన మాస్కులను ఇతర వ్యర్థ పదార్థాలతో కలపకూడదు. పారిశుధ్య సిబ్బంది వాటిని సేకరించి బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీతో కాల్చివేయాలి. లేదా పదడుగుల లోతున భూమిలో పాతిపెట్టాలి. 

కత్తిమీద సాము.. 
► మాస్కుల వ్యర్థాల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా కత్తిమీద సాముగా మారింది. ఇంతగా మాస్కులు, మెడికల్‌ వ్యర్థాలు రోజూ పోగవుతాయని ఎవరూ ఊహించలేదు. వాడిన మాస్కులను ఎక్కడపడితే  అక్కడ పారేస్తుండటంతో పరిస్థితి  దిగజారుతోంది. 
► ఢిల్లీలో ఆసుపత్రుల నుంచి సేకరించిన మెడికల్‌ వ్యర్థాలలో 70శాతం మాత్రమే శాస్త్రీయంగా నిర్వహిస్తుండగా 30 శాతం రోడ్లపక్కన, నీటివనరుల్లో పడి ఉంటున్నాయి. ఇతర  దేశాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.   
► కరోనా వైరస్‌ జన్మస్థలం చైనాలోని వూహాన్‌లో 1.10 కోట్ల జనాభా ఉంది. ఆ నగరంలో సగటున రోజుకు 200టన్నుల మెడికల్‌ వ్యర్థాలు పోగయ్యాయి. అందులో నాలుగో వంతు వ్యర్థాల నిర్వహణకు మాత్రమే అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్నాయి. 

చేపల్లో చేరి మళ్లీ మనుషుల్లోకి..
► ఒక్కో మెడికల్‌ మాస్కులో దాదాపు 25 గ్రాముల వరకు పోలిపాలిథిన్‌ ఉంటుంది. దీనివల్ల చేపలతోపాటు 600 రకాల జీవజాతులకు ప్రమాదం పొంచి ఉంది. ఆ చేపలను తినడంతో మనుషులుకూడా అనారోగ్యసమస్యలకు గురవుతారు. 
► జర్మనీలో నెలకు 1.70కోట్ల మాస్కులు వాడుతుండటంతో పర్యావరణంలోకి 850 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌వదులుతున్నట్లేనని నిపుణులు అంచనా వేశారు. ఒక కారులో ప్రపంచం చుట్టూ 1,060సార్లు తిరిగితే విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌కు ఇది సమానమని తెలిపారు. 

రీసైక్లింగ్‌ సాధ్యమా? 
భారీ సంఖ్యలో వాడుతున్న మెడికల్‌ మాస్కులను రీసైక్లింగ్‌ చేయడం ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. వాడేసిన మాస్కులను సేకరించి వేరుచేసి రీసైకిల్‌ చేసి కొత్త మాస్కు తయారు చేయాలి. కానీ అందుకు అయ్యే ఖర్చు ఆ మాస్కు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. మాస్కుల రీసైక్లింగ్‌ అచరణ సాధ్యంకాదని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. 
► మెడికల్‌ మాస్కులతో పొంచి ఉన్న పర్యావరణ ముప్పును తప్పించాలంటే ప్రత్యామ్నాయ మాస్కుల వాడకాన్ని ప్రోత్సహించాలని, వైద్య సిబ్బంది మినహా మిగిలిన వర్గాలు కాటన్‌ మాస్కులను వాడాలని సూచిస్తున్నారు.  
► కాటన్‌మాస్కులు డిటర్జెంట్‌/ డెట్టాల్‌తో ఉతికి ఎండలో ఆరవేసి మళ్లీ వాడుకోవచ్చు. పలు కంపెనీలు, కుటీర పరిశ్రమలు కాటన్‌తో చేసిన మాస్కులను తయారీ చేసి విక్రయిస్తున్నాయి. ఇళ్లల్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. 
► ఫైబర్‌తో తయారైన రీయూజబుల్‌  మాస్కులు కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement