ఈ సారీ.. నిరాశే!
► రిమ్స్‌కు లభించని ఎంసీఐ అనుమతులు
► 600 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం
ఒంగోలు సెంట్రల్ : ఆశ.. నిరాశే అయింది. ఈ సారి కూడా రిమ్స్‌కు ఎంసీఐ అనుమతులు రాలేదు. కొన్ని చిన్న, చిన్న కారణాలను ఎత్తిచూపుతూ భారతీయ వైద్యమండలి రిమ్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేందుకు అంగీకారం తెలపలేదు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో రిమ్స్‌కు గురువారం ఎంసీఐ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో 600 మంది వైద్య విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పూర్తిస్థాయి అనుమతులు వస్తేనే వైద్య విద్యార్థులకు ఇచ్చిన పట్టాలకు గుర్తింపు ఉంటుంది. లేకుంటే పీజీ ఎంట్రన్స్ రాయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా అర్హత ఉండదు.
పనికిరాని పట్టాలు..
ఇప్పటికే ఒక బ్యాచ్ వైద్య విద్యార్థులు హౌస్ సర్జన్ షిప్‌ను పూర్తి చేసుకున్నారు. వైద్య పట్టాలు పుచ్చుకుని కూడా ఏం చేయడానికి వీలు గాక ఖాళీగా ఉంటున్నారు. ఏప్రిల్ నుంచి మరో బ్యాచ్ ఎంబీబీఎస్ పరీక్షలను పూర్తి చేసుకుని హౌస్ సర్జన్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. మరో 400 మంది ప్రస్తుతం రిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ, వైద్య విద్యను, వైద్యులను పర్యవేక్షించే భారతీయ వైద్య మండలి మాత్రం తగిన సౌకర్యాలు లేవని అనుమతులు ఇవ్వడం లేదు.
ప్రజాధనం వృథా..
ఇప్పటి వరకూ మూడు నాలుగు సార్లు ఎంసీఐ పరిశీలనకు దరఖాస్తు చేసుకోవడంతో రూ. 10 లక్షలకు పైగా ప్రజాధనం వృథా అయింది. ఎంసీఐ పరిశీలించాలంటే వారికి దాదాపు రూ.3 లక్షలు ముందుగా చెల్లించాలి. ఇవి గాక వారు వచ్చినప్పుడు వసతి ఖర్చులు అదనం. ఇలా లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి.
సమస్యలు పరిష్కరించాం..
ఎంసీఐ అభ్యంతరాలను తాము పూర్తి చేశాం. వాటి ఫొటోలు తీసి ఎంసీఐకి పంపుతున్నాం. గతంలో రిమ్స్‌కు పూర్తిస్థాయిలో అనుమతులు రావడానికి రెండోసారి వచ్చిన సమయంలో లేవనెత్తిన అభ్యంతరాలను మూడో పర్యటనకు పరిష్కరించాం. అధికారులు వాటిని చూడకుండా కొత్తగా చిన్న, చిన్న కారణాలను ఎత్తిచూపుతూ అనుమతులు నిరాకరించారు. – డాక్టర్ వల్లీశ్వరి, రిమ్స్ డైరక్టర్
అభ్యంతరాలివీ..
► రిమ్స్‌లో 600 ఎంఎ ఎక్స్‌కే విభాగంలో కిటికీలు ఉన్నాయి. ఎక్స్‌రే యంత్రం అమర్చిన గదిలో కిటికీలు ఉండకూడదు.
► లైబ్రరీలో 7,090 పుస్తకాలు ఉన్నప్పటికీ, వేరు, వేరు రచయితలవి లేవు.
► డెర్మటాలజీ విభాగంలో సీనియర్ రెసిడెంట్ వైద్యులు లేరు.
► ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్ (ఐసీసీ యూ)ను రిమ్స్‌లో ఏర్పాటు చేయలేదు.