జీజీహెచ్‌లో ఎంసీఐ తనిఖీలు
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో సోమవారం భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇన్‌స్పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం వైద్య కళాశాలలో 97 పీజీ సీట్లు ఉండగా అదనంగా 45 సీట్లు కావాలని గుంటూరు వైద్య కళాశాల అధికారులు ఎంసీఐని కోరారు. పీజీ సీట్లు పెంచేందుకు నిబంధనల ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాలు తదితరాలను తనిఖీచేసి ఎంసీఐ ఇన్‌స్పెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్లు పెరగటం జరుగుతుంది. అందులో భాగంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య విభాగం, పల్మనరీ డిపార్ట్‌మెంట్, పెథాలజీ, ఎస్‌పిఎం, మానసిక వ్యాధుల వైద్య విభాగాల్లో తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేశారు. ఆస్పత్రిలోని ఓపీ వైద్య విభాగాలు, ఇన్‌పేషెంట్ విభాగాలు, ల్యాబ్‌లు, క్యాజువాలిటీ, కళాశాలలోని గ్యాలరీలు, సిబ్బంది హాజరు పట్టీలు తనిఖీ చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ మెండా ఫర్నికుమార్, డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజు నాయుడు, ఆయా వైద్య విభాగాధిపతులు వారికి వైద్య సౌకర్యాలు చూపించి, వారు అడిగిన సమాచారాన్ని అందించారు.