
ఎంసీ‘ఐ’
- సర్వజనాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంసీఐ బృందం
- వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించిన సభ్యులు
అనంతపురం న్యూసిటీ : ‘‘ కొన్ని విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత స్పష్టంగా కన్పిస్తోంది. సిబ్బంది పూర్తీ స్థాయిలో లేరు.. ఇంకా మెరుగుపడాలి’’ అని ఎంసీఐ బృందం పేర్కొంది. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల రెన్యూవల్‌కు సంబంధించి గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఇక్కడ పర్యటించింది. అప్పుడు పలు లోటుపాట్లను గుర్తించినా సీట్ల రెన్యూవల్‌కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లోటుపాట్లు సరిదిద్దారా..? లేదా అన్న విషయాలు తెలుసుకునేందుకు శుక్రవారం ప్రొఫెసర్లు డాక్టర్ జ్యోతికృష్ణ (బీహార్), డాక్టర్ రామకృష్ణారెడ్డి (కర్నాటక), బసవరాజు (బళ్లారి) బృందం ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వీరు మూడు బృందాలుగా ఏర్పడి ఆస్పత్రిలోని మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్, లేబర్, బ్లడ్ బ్యాంక్, సర్జరీ, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, క్యాజువాలిటీ, వైద్య కళాశాలలోని వివిధ విభాగాలతో పాటు ఓపీ కౌంటర్‌ను నిశితంగా పరిశీలించారు.
రోజూ ఓపీకి ఎంత మంది రోగులు వస్తున్నారని ఆరా తీశారు. అందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ రోజూ 1200 ఓపీ, 800 ఇన్‌పేషంట్లున్నారని సమాధానమిచ్చారు. సర్జరీ విభాగంలోని ఎంఎస్ –1, ఎంఎస్–2, ఆపరేషన్ థియేటర్‌ను కూడా పరిశీలించారు. హెచ్‌ఓడీ డాక్టర్ రామస్వామినాయక్‌తో గత కొన్నేళ్లుగా ఏ మేరకు శస్త్ర చికిత్సలు చేశారో వాటి వివరాలను సేకరించారు. అనంతరం సర్జరీ విభాగం వైద్యులతో వారు ఎటువంటి సర్జరీలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. డెంగీ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన చిన్న పిల్లల ప్రత్యేక వార్డును పరిశీలించారు. మెయిన్ ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి సదుపాయాలున్నాయో చూశారు. సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఏవిధంగా పని చేస్తోందో ఆరా తీశారు. రోజూ డెలివరీలు ఏమాత్రం జరుగుతాయని గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్ బేగంను ఆరా తీశారు.
మెటర్నిటీ సెలవును మాత్రమే పరిగణిస్తాం
ఇద్దరు, ముగ్గురు వైద్యులు క్యాజువల్ లీవ్‌లో ఉండటాన్ని కూడా ఎంసీఐ బృంద సభ్యులు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం క్యాజువల్ లీవ్ (సీఎల్)ను పరిగణలోకి తీసుకోం కదా.. దాన్నే కారణంగా చూపితే ఎలా అని గైనిక్ విభాగంలో ఉన్న వారిని అడగ్గా... వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. వైద్య కళాశాలలో ఎంసీఐ బృందం అన్ని విభాగాల హెడ్‌కౌంట్‌ను పరిశీలించారు. కొంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వారు అలాగే నివేదికలో పొందుపరుస్తామని తేల్చి చెప్పారు.
ఈఎన్‌టీలో ఛాతివైద్య నిపుణుడా..?
ఏం సార్ ఇది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈఎన్‌టీ విభాగంలో ఛాతివైద్య నిపుణుడిని ఉంచితే ఎలా..? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అన్ని విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వివరాలను రికార్డు చేసుకున్నారు.