
అణువణువూ పరిశీలన
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ మెడికల్ కళాశాల, సర్వజనాస్పత్రిలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సభ్యులు అణువణువూ పరిశీలించారు. గురువారం ఉదయాన్నే ఎంసీఐ సభ్యులు ఆర్‌కే మహేశ్వరి (రాజస్థాన్), జిగ్నాదేవ్ (గుజరాత్), షర్మిలాపాల్ (కోల్‌కతా) కళాశాలకు చేరుకున్నారు. ముందుగా ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావును కలిశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ చిట్టి నరసమ్మ, డాక్టర్ జేసీ రెడ్డితో కలిసి వేర్వేరుగా పరిశీలన ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాల, ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గత ఏడాది కళాశాలలోని ఎనిమిది విభాగాలకు గాను 37 పీజీ సీట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
గత సెప్టెంబర్‌లో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎంసీఐ సభ్యులు మైక్రో బయాలజీ, పెథాలజీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాల్లో పీజీ సీట్ల మంజూరు కోసం తనిఖీ చేశారు. ఆ తర్వాత మైక్రో బయాలజీ విభాగానికి మాత్రమే కేవలం నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. మిగిలిన విభాగాల్లో కొన్ని లోపాల కారణంగా సీట్లు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంసీఐ సభ్యులు పర్యటించారు. ఎంసీఐ నిబంధనల మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఉన్నారో, లేదో పరిశీలించారు. విభాగాల వారీగా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల వివరాలను తెలుసుకున్నారు. పలు విభాగాల్లోని యంత్రాలు, డిజిటలైజేషన్‌పై ఆరా తీశారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని సభ్యులు సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మరిన్ని పీజీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కళాశాల యాజమాన్యం భావిస్తోంది. బృందం వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, పీడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ మల్లీశ్వరి, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ విజయమ్మతో పాటు ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, ఇతర వైద్యులు ఉన్నారు.