సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వైద్య విద్యా సంవత్సరంలో తెలంగాణ, ఏపీల్లో కలిపి 200 పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లపై విద్యార్థుల్లో ఆసక్తి లేకపోవడం ప్రధాన కారణం కాగా... కొందరు విద్యార్థులకు జాతీయస్థాయి వైద్యవిద్యా సంస్థల్లో సీట్లు రావడంతో 37 క్లినికల్ సీట్లూ ఖాళీ అయినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సోమవారం కోర్టు ముందుకు రాగా. గురువారానికి విచారణ వాయిదా పడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
అవకాశాలు లేకే: ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సుమారు రెండున్నర వేల వరకు పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. ఇందులో క్లినికల్ సీట్లకు తీవ్ర పోటీ ఉంటే.. నాన్ క్లినికల్‌పై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఏటా సుమారు 200 పీజీ సీట్లు మిగిలిపోతున్నట్లు సమాచారం. సాధారణంగా క్లినికల్ విభాగంలో పీజీ చేసినవారికి ప్రైవేటు ఆస్పత్రుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ప్రభుత్వ సర్వీస్‌లో చేరినవారు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునే అవకాశమూ ఉంటుంది. కానీ నాన్ క్లినికల్ విభాగంలోని వారికి పెద్దగా డిమాండ్ ఉండదు. ఇందులోని పాథాలజీ, మైక్రోబయోలజీ, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియోలజీ తదితర కోర్సులు కేవలం మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులుగా పనిచేయడానికేనన్న పరిస్థితి ఏర్పడింది.
దీంతో నాన్ క్లినికల్ పీజీపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పీజీ వైద్య విద్యలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని కోరుతూ నెలన్నర కింద తెలంగాణ ప్రభుత్వం ఎంసీఐకి లేఖ రాసింది. ఇటీవలే పలువురు విద్యార్థులు కూడా దీనిపై సుప్రీంను ఆశ్రయించారు. ఎంతో విలువైన పీజీ సీట్లు ఖాళీగా ఉండకుండా కౌన్సెలింగ్ చేసేందుకు ఎంసీఐని, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీని ఆదేశించాలని వారు కోరుతున్నారు. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే... తెలంగాణలోని 8 సీట్లతోపాటు, ఏపీలోని 28 సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో కూడా తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుందని జూడా కన్వీనర్ శ్రీనివాస్ చెప్పారు.
నాన్ క్లినికల్ పీజీపై అనాసక్తి
Published Tue, Aug 4 2015 1:11 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement