Non-clinical PG
-
అనాటమీపై అనాసక్తి
సాక్షి, అమరావతి: శరీర నిర్మాణ శాస్త్రం.. దీన్నే అనాటమీ అంటారు. ఈ కోర్సును చదవడమంటే మనిషి శరీర నిర్మాణం, అవయవాలు, వాటి విధులు, ధర్మాల గురించి తెలుసుకోవడమే. వైద్యంలో అత్యంత కీలకమైన ఈ సబ్జెక్టుకు ఇప్పుడు ఆదరణ తగ్గింది. పీజీలో అనాటమీ కోర్సు తీసుకోవడానికి విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పాటు శవపంచనామాలో కీలక పాత్ర పోషించే ఫోరెన్సిక్ మెడిసిన్ సీట్లూ మిగిలిపోతున్నాయి. మొత్తం ఎనిమిది నాన్క్లినికల్ సబ్జెక్టుల్లో (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్) ఏటా సగం సీట్లు మిగిలిపోతున్నాయంటే ఆదరణ ఎలా తగ్గుతోందో అంచనా వేయచ్చు. ఈ నాలుగేళ్లలో 1,357 సీట్లకు గాను 719 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ఈ కోర్సులు కెరియర్‌కు ఉపయోగపడడం లేదని, ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అవకాశమొస్తే చేరాలి.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వస్తోందని, అందుకే ప్రత్యామ్నాయ కోర్సుల వైపు దృష్టి సారించాల్సి వస్తోందని చెబుతున్నారు. క్లినికల్ కోర్సుల వైపే మొగ్గు మరోవైపు క్లినికల్ కోర్సుల్లో మాత్రం సీట్లు హాట్‌కేకుల్లా మారిపోయాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ వంటి పీజీ సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నాయి. ఈ కోర్సులు చదివితే ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుంటుందనేది విద్యార్థుల ఆలోచన. పైగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే క్లినికల్ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. -
నాన్ క్లినికల్ పీజీపై అనాసక్తి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వైద్య విద్యా సంవత్సరంలో తెలంగాణ, ఏపీల్లో కలిపి 200 పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లపై విద్యార్థుల్లో ఆసక్తి లేకపోవడం ప్రధాన కారణం కాగా... కొందరు విద్యార్థులకు జాతీయస్థాయి వైద్యవిద్యా సంస్థల్లో సీట్లు రావడంతో 37 క్లినికల్ సీట్లూ ఖాళీ అయినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సోమవారం కోర్టు ముందుకు రాగా. గురువారానికి విచారణ వాయిదా పడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అవకాశాలు లేకే: ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సుమారు రెండున్నర వేల వరకు పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. ఇందులో క్లినికల్ సీట్లకు తీవ్ర పోటీ ఉంటే.. నాన్ క్లినికల్పై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఏటా సుమారు 200 పీజీ సీట్లు మిగిలిపోతున్నట్లు సమాచారం. సాధారణంగా క్లినికల్ విభాగంలో పీజీ చేసినవారికి ప్రైవేటు ఆస్పత్రుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ప్రభుత్వ సర్వీస్‌లో చేరినవారు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునే అవకాశమూ ఉంటుంది. కానీ నాన్ క్లినికల్ విభాగంలోని వారికి పెద్దగా డిమాండ్ ఉండదు. ఇందులోని పాథాలజీ, మైక్రోబయోలజీ, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియోలజీ తదితర కోర్సులు కేవలం మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులుగా పనిచేయడానికేనన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో నాన్ క్లినికల్ పీజీపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పీజీ వైద్య విద్యలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని కోరుతూ నెలన్నర కింద తెలంగాణ ప్రభుత్వం ఎంసీఐకి లేఖ రాసింది. ఇటీవలే పలువురు విద్యార్థులు కూడా దీనిపై సుప్రీంను ఆశ్రయించారు. ఎంతో విలువైన పీజీ సీట్లు ఖాళీగా ఉండకుండా కౌన్సెలింగ్ చేసేందుకు ఎంసీఐని, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీని ఆదేశించాలని వారు కోరుతున్నారు. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే... తెలంగాణలోని 8 సీట్లతోపాటు, ఏపీలోని 28 సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో కూడా తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుందని జూడా కన్వీనర్ శ్రీనివాస్ చెప్పారు.