
సాక్షి, అమరావతి: శరీర నిర్మాణ శాస్త్రం.. దీన్నే అనాటమీ అంటారు. ఈ కోర్సును చదవడమంటే మనిషి శరీర నిర్మాణం, అవయవాలు, వాటి విధులు, ధర్మాల గురించి తెలుసుకోవడమే. వైద్యంలో అత్యంత కీలకమైన ఈ సబ్జెక్టుకు ఇప్పుడు ఆదరణ తగ్గింది. పీజీలో అనాటమీ కోర్సు తీసుకోవడానికి విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పాటు శవపంచనామాలో కీలక పాత్ర పోషించే ఫోరెన్సిక్ మెడిసిన్ సీట్లూ మిగిలిపోతున్నాయి. మొత్తం ఎనిమిది నాన్‌క్లినికల్ సబ్జెక్టుల్లో (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్) ఏటా సగం సీట్లు మిగిలిపోతున్నాయంటే ఆదరణ ఎలా తగ్గుతోందో అంచనా వేయచ్చు.
ఈ నాలుగేళ్లలో 1,357 సీట్లకు గాను 719 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ఈ కోర్సులు కెరియర్‌కు ఉపయోగపడడం లేదని, ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అవకాశమొస్తే చేరాలి.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వస్తోందని, అందుకే ప్రత్యామ్నాయ కోర్సుల వైపు దృష్టి సారించాల్సి వస్తోందని చెబుతున్నారు.
క్లినికల్ కోర్సుల వైపే మొగ్గు
మరోవైపు క్లినికల్ కోర్సుల్లో మాత్రం సీట్లు హాట్‌కేకుల్లా మారిపోయాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ వంటి పీజీ సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నాయి. ఈ కోర్సులు చదివితే ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుంటుందనేది విద్యార్థుల ఆలోచన. పైగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే క్లినికల్ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు.