విజయనగరంలో ప్రారంభమైన తరగతులు
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు.
ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు.
నంద్యాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల హాజరు
నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్‌ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు.
కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్‌లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment