
ఓటర్లకు వాల్‌క్లాక్‌లు, గిఫ్ట్ బాక్సులు పంపిణీ
విజయనగరంలో రంగంలోకి మంత్రి బంధువులు
నూజివీడు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో జరుగుతున్న 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వాల్ క్లాక్‌లు, గిఫ్ట్ బాక్స్‌లు, ఇతర వస్తువులు పంపిణీ చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
గురువారం పోలింగ్ జరుగుతుండటంతో బుధవారం వీటిని పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంవ్యాప్తంగా బుధవారం ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేశారు. బత్తులవారిగూడెంలోని నగరవనంలో ఉదయం సమావేశం నిర్వహించి, మండలాల వారీగా వాల్‌క్లాక్‌లను నాయకులకు అప్పగించి, వారి ద్వారా ఓటర్లకు అందజేశారు.
ఈ వాల్‌క్లాక్‌లపై సీఎం చంద్రబాబు, మంత్రి కొలుసు పార్థసారథి, అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల ఫొటోలతో కూడిన స్టిక్కర్ అంటించి ఉంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా గిఫ్ట్‌లు పంపిణీ చేసినట్లు సమాచారం.
విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి కుటుంబ సభ్యుల పర్యవేక్షణ
ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు క్షేత్ర స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది. దీంతో టీడీపీ నేతలు టీచర్లకు గిఫ్ట్‌బాక్సులు అందజేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబానికి చెందిన కొంతమంది వీటి పంపిణీ బాధ్యత తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంట్యాడ మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి కుటుంబానికి చెందిన రైస్ మిల్లు వద్ద నుంచే ఇతర ప్రాంతాలకు గిఫ్ట్‌బాక్స్‌లు పంపిస్తున్నారు.
సీలేరులో మద్యం పట్టివేత
సీలేరు (అల్లూరి జిల్లా): ఉత్తరాంధ్ర ఎన్నికలు వాడీవేడిగా జరుగుతున్న నేప«థ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో బహిరంగంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. జీకే వీధి మండలం సీలేరులోని ఒక ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి జరిపారు. నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment