Bio-Chemistry
-
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల హాజరు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా గద్దె అనూరాధ?
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా గద్దె అనూరాధను రంగంలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోంది. గద్దె రామ్మోహన్ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండటంతో పాటు విజయవాడ ఎంపీ, గన్నవరం ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండటంతో ఈసారి ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై గద్దె రామ్మోహన్‌తో చంద్రబాబు బుధవారం చర్చించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గద్దె అనూరాధ ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) చదివారు. జెడ్పీ చైర్మన్ పోస్టుకు పలువురు పోటీపడుతున్నప్పటికీ అనూరాధ విద్యావంతురాలు కావడంతో పాటు రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. గద్దె అనూరాధ కాకుండా ఇంకా ఎవరైనా అభ్యర్థులు లభిస్తారా.. అనే అన్వేషణలో రాష్ట్ర పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అనూరాధకు సీటు ఇచ్చే విషయంలో అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తోందని చెబుతున్నారు. అనూరాధకే టిక్కెట్ లభిస్తే ఆమె తిరువూరు జెడ్పీటీసీ సభ్యురాలుగా పోటీలోకి దిగుతారని సమాచారం. గద్దె దంపతుల తర్జనభర్జన... గద్దె రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన వ్యాపార వ్యవహారాలన్నీ గద్దె అనూరాధ చూసుకుంటున్నారు. ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తే వ్యాపారాలు కుంటుపడతాయనే భావనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తనకు జెడ్పీ చైర్పర్సన్ టిక్కెట్ ఇస్తే భవిష్యత్తులో తన భర్త గద్దె రామ్మోహన్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరేమోనన్న అనుమానాలు వారికి ఉన్నట్లు సమాచారం. దీంతో జెడ్పీ బరిలోకి దిగడంపై ఈ దంపతులు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే సీటు కోసం గద్దె పట్టు... తన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ టిక్కెట్ ఇచ్చినప్పటికీ తనకు తప్పనిసరిగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని గద్దె రామ్మోహన్ చంద్రబాబును కోరినట్లు సమాచారం. గతంలో తనకు ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ (తూర్పు) సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సమ్మతిస్తేనే తన భార్య తిరువూరు నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుందని అంటున్నారు. గతంలో నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు ఎమ్మెల్యే సీటు, ఆయన భార్య నల్లగట్ల సుధారాణికి జెడ్పీ చైర్పర్సన్ పోస్టు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గద్దె ఉదహరిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇవ్వాలని డిమాండ్... గద్దె అనూరాధకు జెడ్పీటీసీ సీటు ఇస్తే గద్దె రామ్మోహన్‌ను ఎన్నికల బరిలోంచి తప్పించాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం కార్పొరేషన్ సీటు కేటాయించే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు ఇప్పటికే రోడ్డెక్కారు. వీరంతా రాబోయే ఎన్నికల్లో గద్దెకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. తూర్పు సీటును గద్దెకు కాకుండా మరొకరికి కేటాయించాలంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గద్దె అనూరాధకు జెడ్పీ చైర్పర్సన్ సీటు ఇవ్వాలనే చంద్రబాబు నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.