పకడ్బందీగా సిలబస్‌ | In-depth study of the state government On the English medium | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా సిలబస్‌

Published Sat, Dec 7 2019 3:05 AM | Last Updated on Sat, Dec 7 2019 4:56 AM

In-depth study of the state government On the English medium - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం పాఠ్యాంశాల రూపకల్పనపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలు, ప్రణాళికపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చర్యలు చేపట్టింది. 

పాఠ్యాంశాలపై రూపకల్పనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలివే..
– ఎస్‌సీఈఆర్‌టీ అధికారుల బృందం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా, చండీగఢ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడ అనుసరిస్తున్న ఆంగ్ల మాధ్యమ ప్రణాళికలు, పాఠ్యాంశాలను పరిశీలించింది. వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర విద్యార్థులకు అవసరమైన రీతిలో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తోంది.
– ఆంగ్ల మాధ్యమ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో 180 మంది నిపుణులు విద్యావేత్తలు పాల్గొంటున్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో అనుభవమున్న నిపుణులు, ప్రొఫెసర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఢిల్లీ, మద్రాస్, అంబేడ్కర్, అన్నా, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీలు, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (ఆర్‌ఐఈ)– బెంగళూరు, నవోదయ విద్యాలయ సంఘటన్‌తోపాటు పలు ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్ల ప్రతినిధులు కూడా భాగస్వాములవుతున్నారు.
– యూకే, యూఎస్‌ఏ, సింగపూర్, శ్రీలంక, చైనా తదితర దేశాల్లోని ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను తెప్పించి ఇక్కడి నిపుణులతో ప్రభుత్వం పరిశీలింపచేస్తోంది. అక్కడి మంచి అంశాలను కూడా చొప్పించి రాష్ట్ర సిలబస్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతోంది.
– ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అనువుగా ఉండేలా రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా అనుగుణంగా ఉండేలా పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నారు. పిల్లల చదువులపై దృష్టిపెట్టలేని నిరుపేదలు, కూలి చేసుకుని జీవించే కుటుంబాల్లోని విద్యార్థులకు అనువైన రీతిలో వీటిని సిద్ధం చేస్తున్నారు. 
– తెలుగు సబ్జెక్టు పాఠ్యాంశాలు కూడా ఉన్నతంగా ఉండేలా మార్పులు చేపట్టారు. 1 నుంచి 6వ తరగతి వరకు 68 మంది ప్రముఖ కవులు, కథకుల రచనల్లోని అంశాలను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మాండలికాలకు సమ ప్రాధాన్యమిస్తున్నారు. కథలు, కవితలు, సంభాషణలు, పద్యాలు.. ఇలా తెలుగుకు సంబంధించి అన్ని అంశాలపై విద్యార్థులకు మరింత శ్రద్ధ పెరిగేలా చర్యలు చేపడుతున్నారు.

దేశీ, విదేశీ కలబోతతో సిలబస్‌
 ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ
దేశీ, విదేశీ కలబోతతో సిలబస్‌ను రూపొందిస్తున్నాం. ఎవరైనా సిలబస్‌ను మార్చాలనుకుంటే మన రాష్ట్రం వైపు చూసేలా చర్యలు చేపడుతున్నాం. యూకే, చైనా, సింగపూర్, శ్రీలంక, అమెరికా పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయిస్తున్నాం. అక్కడి మంచి విధానాలను తీసుకుంటాం. మన పిల్లలు వెనుకపడకుండా, అదే సమయంలో హైస్టాండర్డ్స్‌ లేకుండా సిలబస్‌ను సరళీకరిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement