రాష్ట్రానికి ఎంసీఐ లేఖ
కాలేజీల్లో వసతుల కల్పనకు ఆర్నెల్లు
సమయమిచ్చినా ఫలితం సున్నా
మెడికల్ కాలేజీలను నవంబర్‌లో తనిఖీ చేసిన ఎంసీఐ అధికారులు
మరికొన్ని కళాశాలలకూ సీట్ల
కోత తప్పదు.. త్వరలో నివేదిక ఇవ్వనున్న ఎంసీఐ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లపై కోతల కాలం మొదలైంది. ‘మీకు మరో అవకాశమిస్తున్నాం, ఆరు మాసాల్లో వసతులు పునరుద్ధరణ చేసి సీట్లు నిలుపుకోండి’ అంటూ భారతీయ వైద్యమండలి ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుకోలేక పోయింది. దీంతో ఎంసీఐ కోతలు వేసేందుకు సిద్ధమైంది. ఒంగోలు రిమ్స్ కళాశాలకు చెందిన 100 ఎంబీబీఎస్ సీట్లను వచ్చే ఏడాదికి ఇవ్వలేమంటూ రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒంగోలు రిమ్స్‌కు ఈ సీట్లు అదనంగా ఇచ్చినవి కావు. ఉన్నవే పోతున్నాయంటే ఆ కళాశాల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 2015-16 సంవత్సరానికి ఒంగోలు రిమ్స్‌కు సంబంధించి 100 సీట్లు ఇవ్వకపోతే అసలు అడ్మిషన్లే ఉండవు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాదీ ఇదే పరిస్థితి. చివరి నిమిషంలో ఎంసీఐని బతిమాలుకోవడం, అనుమతి తెచ్చుకోవడం జరుగుతోంది. ఈ దఫా మాత్రం కరాఖండీగా సీట్లు ఇవ్వలేమని ఎంసీఐ తేల్చి చెప్పింది.
ఇప్పటికీ వసతులు కల్పించలేకపోయారు
2014 జూన్‌లో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు సుమారు 300 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా కల్పించారు. ఈ సీట్లకు సంబంధించి అదనంగా కావాల్సిన వసతులన్నీ 2014 నవంబర్‌లోగా కల్పించాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలు రాతపూర్వక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు నవంబర్‌లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలను తనిఖీ చేశారు. కొత్తగా కేటాయించిన సీట్లకు సంబంధించి ఎలాంటి వసతులూ ఏర్పాటు చేయలేదని తనిఖీల్లో తేలింది. దీంతో ఎంసీఐ తొలి వేటు ఒంగోలు రిమ్స్‌పై వేసింది.
అదే బాటలో మరికొన్ని కళాశాలలు
తొలివేటు ఒంగోలు రిమ్స్‌కు వేశారుగానీ.. అదే బాటలో మరికొన్ని కళాశాలలపైనా కోత పడే అవకాశం లేకపోలేదని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులే చెప్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ, ఎస్‌వీఆర్ మెడికల్ కాలేజీ (తిరుపతి), రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), సిద్ధార్థ మెడికల్ కాలేజీ (విజయవాడ), గుంటూరు మెడికల్ కాలేజీ (గుంటూరు) తదితర కళాశాలల్లో 50 సీట్ల చొప్పున కోల్పోయే ప్రమాదమున్నట్టు తెలిసింది. ఇప్పటికే వీటిలో తనిఖీలు పూర్తయ్యాయని, ఈ కళాశాలల్లో సీట్లకు సంబంధించిన నివేదిక వారం రోజుల్లో ఇవ్వనున్నామని ఎంసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాదు 2014-15కు సంబంధించి నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లు అనుమతిచ్చారు. వచ్చే ఏడాది దీనికి తగ్గ వసతులు లేకపోతే అక్కడ కూడా సీట్లు పోయే పరిస్థితి ఉంటుందని, ఇప్పటికీ అక్కడ పరిస్థితి బాగోలేదని ఎంసీఐ దృష్టికి వచ్చింది.
ఒంగోలు రిమ్స్‌లో 100 సీట్లు కోత
Published Thu, Dec 25 2014 2:05 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement